Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

తానా రజతోత్సవ వేడుకలు

నగర కేంద్ర గ్రంథాలయంలో సింగింగ్‌ సూపర్‌సిక్స్‌

ఎన్టీఆర్ అంటే రాముడు 

ఎన్టీఆర్ అంటే రాముడు .. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు … ఎన్టీఆర్ అంటే తెలుగు భాష …. ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్ అంటే నటుడుగా సంపాదించుకున్న  శక్తిని రాజకీయం అనే సేవ ద్వారా ప్రజల హృదయాలలో స్థిరస్థానం ఏర్పరచుకున్న కారణజన్ముడు! అలాగే అమృత గానం అంటే ఘంటసాల … ఈ ఇద్దరు తెలుగు మహనీయులనూ దయచేసి ‘భారత రత్న’ తో గౌరవించండి.” అని భారత ప్రభుత్వాన్ని కోరారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త  ప్రసిద్ధ గాయకులు  శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. తాను సంగీతభరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేయడానికి ఈ ఎన్టీఆర్, ఘంటసాలలే స్ఫూర్తి అన్నారు. గాన సుధాకర్ స్థాపించిన ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సంస్థ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాన్ని హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఎన్టీఆర్ అవార్డు ను ‘గాత్ర కంఠీరవ’ సాయికుమార్ కు అందజేశారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – ఎన్టీఆర్, ఘంటసాలలకు నివాళిగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం లోని ‘నను భవదీయ దాసుని’ పద్యాన్ని ఆలపించారు. ఔచిత్యభరితమైన నటనతో, అద్భుతమైన గాత్రం తో ఘన కీర్తిని సంపాదించుకుని ఎన్టీఆర్ ప్రశంసలు పొందిన సాయికుమార్ ‘ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారానికి’ ముమ్మాటికీ అర్హులు అన్నారు.  తమ భగవద్గీతా ఫౌండేషన్  రూపొందించిన “The Making of  Bhagavadgita Documentary ” కి సాయికుమార్ గాత్రo అందించడాన్ని ఈ సందర్భంగా కృతజ్ఞతలతో గుర్తుచేసుకున్నారు. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసారు.

కంచి పీఠాధిపతులు

కంచి పీఠాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి హైదరాబాద్ లోని స్కందగిరి దేవాలయం లో బస చేసిన సందర్భం లో – భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి  కుటుంబ సమేతం గా స్వామి ని దర్శించి ఆశీస్సులు పొందారు. తమ భగవద్గీత రికార్డింగ్ సమయం లో  కంచి కి వచ్చి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని కలిసి ఆశీస్సులు పొందిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వీడియో చూపించి, తమ భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న, చేపట్టిన కార్యక్రమాలను స్వామి వారికి వివరించారు. ఈ సందర్భం గా భక్తి గానాన్ని  వినిపించమని స్వామి కోరగా – గంగాధర శాస్త్రి – లింగాష్టకం, శివతాండవ స్తోత్రం, శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం, శ్యామలా దండకం (మహాకవి కాళిదాసు), జయ జయ మహాదేవ శంభో హరా శంకరా  (కాళహస్తిమహాత్మ్యం), నీలకంధరా దేవా (భూకైలాస్), భగవద్గీతా శ్లోకాలను గానం చేశారు. అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి గంగాధర శాస్త్రి దంపతులను దుశ్శాలువ తోను సత్కరించి  కుమారుడు విశ్వతేజ, కుమార్తె కీర్తిప్రియల ను ఆశీర్వదించారు. గంగాధర శాస్త్రి ని ఆశీర్వదిస్తూ – భగవద్గీత ప్రచారానికే జీవితం అంకితం చేయడం పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యిందని,  హర్యానా లోని కురుక్షేత్రం లో భగవద్గీతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందని, అందుకు తమ సహకారం కూడా ఉంటుందని, 27 చరణాలు గల  ‘శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రాన్ని కూడా ప్రచారం చేయవలసిందని సూచించారు.

‘గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశః

గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశః’ అంటూ గోవును సర్వదేవతా స్వరూపం గా, చతుర్దశ భువనాకృతి గా కీర్తించిన వేదం పుట్టిన భరత భూమిలో గోవు నిరాదరణకు గురి కావడం దురదృష్టం..! అ అంటే అమ్మ .. ఆ అంటే ఆవు అని తెలుగు పిల్లలకు పాఠం చెబుతూ అమ్మ తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చిన తెలుగు భూమిలో కూడా నిత్యం గోవధ జరగడం తెలుగు జాతి దురదృష్టం’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అఖిల భారత గో సేవా ఫౌండషన్’ చేపట్టిన ‘గోమహాపాదయాత్ర’ కార్యక్రమానికి అతిథి గా హాజరై ప్రసంగించారు. గోవును హిందువుల జంతువుగా భావించరాదని, ఇది సర్వ మానవాళికి హితమొనర్చె ప్రాణి అని, సృష్టిలో శ్రేష్టమైనవాటిని హిందువులు తమ తపస్సు ద్వారా గుర్తించారనీ అన్నారు. వేదాలలో విశిష్ట స్థానం ఇవ్వబడి, ‘సర్వోపనిషదో గావో ..’ అంటూ ఉపనిషత్తుల ను గోవులతో పోల్చి న భరత భూమి లో, ‘పాడి ఆవులలో కామధేనువు నేను’ అనే పరమాత్మ చేత పేర్కొనబడిన మన దేశం లో నిత్యం వేలాది గోవులు బలి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గోవును జాతీయ ప్రాణి గా ప్రకటించి, గోవధ నిషేధానికి కఠినమైన చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులవల్ల భూమి, ఆహారం విషతుల్యమైపోయిందని, గో ఆధారిత వ్యవసాయం వల్ల భూమి సారవంతమవుతుందని, తద్వారా పండే పంట తినడం ద్వారా ఆరోగ్యం, సద్బుద్ధి, సదాలోచనలు కలుగుతాయని అన్నారు. ఆవులు పాలు రోగ నిరోధకశక్తి ని పెంచుతాయని, గోవులను వధ్యశాలలకు అమ్మేసేవారు, వాటిని కొని గోవులను సంహరించేవారు, ‘అల్కబీర్’ లాంటి గోవధ్యశాలలను నిర్వహించేవారు అందరు హిందువులే కావడం అత్యంత శోచనీయమని గంగాధర శాస్త్రి అన్నారు. గో హత్య మహా పాపమని అన్నారు. గర్భం తో ఉన్న గోవు లలోని పిండాలకు ముస్లిం దేశాలలో అత్యంత గిరాకీ అన్న వార్త చదివి దుఃఖం ఆపుకోలేకపోయానని, ఇది మానవ జాతికే శాపమని గంగాధర శాస్త్రి గద్గద స్వరం తో అన్నారు. ఈ సందర్బo గా -మానవ జీవితంతో మమేకమైన గోవు ప్రయోజనాలను వివరిస్తూ సాగే ‘గోవులగోపన్న’ చిత్రం లోని ‘వినరా వినరా నరుడా’ గీతాన్ని ఆలపించి ఆలోచింపచేశారు. భారత దేశపు సంస్కృతి అస్థిత్వాన్ని కాపాడి తరువాత తరాలవారికి అందించాల్సిన బాధ్యత మన అందరిదని చెబుతూ ఈ గో మహాపాదయాత్ర ముఖ్యోద్దేశ్యాన్ని గ్రహించి ప్రజలు చైతన్యులవ్వాలని, తల్లితండ్రులను కన్నబిడ్డలే పట్టించుకోని ఈ రోజుల్లో బాలకృష్ణ గురుస్వామి అఖిల గోమాత పరిరక్షణ కోసమే తన జీవితాన్ని అంకితం చేయడం నమస్కరించతగ్గ విశేషమని గంగాధర శాస్త్రిఅన్నారు. హైద్రాబాదు నుండి తిరుపతి వరకూ జరిగే ఈ గో మహాపాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు..

తనను తెలుసుకున్న వాడు తత్వజ్ఞుడు

“తనను తెలుసుకున్న వాడు తత్వజ్ఞుడు / పరుల తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు / అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు / అన్ని తెలుసునన్నవాడు అల్పజ్ఞుడు’ అంటూ ఎలా ఉంటె మనిషి మనీషి అవుతాడో జాతికి పాఠం చెప్పిన సద్గురువు డా సి నారాయణ రెడ్డి గారు.” అన్నారు భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్ బి సుధాకర్ వ్యవస్థాపకుడు గా ప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ – ప్రసిద్ధ సినీ నేపధ్య గాయనీమణి పద్మభూషణ్ పి సుశీలకు సి నా రే జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించిన సందర్భం గా – అతిథి గా హాజరై గాన ప్రసంగం చేశారు. ‘నన్ను గాయకుడుగా ప్రోత్సహించి, సంగీత దర్శకుడుగా పరిచయం చేసి, దాసరినారాయణ రావు గారికి సిఫార్సు చేయడం ద్వారా సినీ నేపధ్య గాయకుడుగా పరిచయం చేసి , పి వి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గార్లకు పరిచయం చేసి, స్వరకల్పనావధానo పేరుతో నాతో ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి, తన ‘విశ్వంభర’ కు సంగీతం సమకూర్చేందుకు అవకాశం ఇచ్చి అనేక విధాలుగా ప్రోత్సహించిన దివంగత మహాకవి డాII సి నారాయణరెడ్డి గారు నాకు గురువు, గాడ్ ఫాదర్… ఆయన కు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఆయన రాసిన ప్రతి పాట, ప్రతి కవిత ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధమే ” అన్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమను పంచేది తల్లి అయితే – అలాంటి తల్లి ప్రకృతి అని చెబుతూ – ‘కణ కణ లాడే ఎండకు శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ / చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అందించే మబ్బే అమ్మ ‘ అని నిస్వార్ధం తో బతకమనే సందేశం తో సినారె కలం మాత్రమే వ్రాయగలదని గంగాధరశాస్త్రి అన్నారు. భాషా స్పష్టత, అమృతత్వం, ఆర్ద్రత నిండిన పురుష కంఠాలలొ ఘంటసాలను, స్త్రీ కంఠాలలో పి. సుశీలను భర్తీ చేసిన గాత్రాలు నేటికీ తాను విన లేదని అన్నారు. తెలుగు భాషను కాపాడిన ఆ సంగీత సరస్వతి గాత్రం లతామంగేష్కర్ కి ఏ మాత్రం తక్కువ కాదని ‘భారత రత్న’ కి అన్నివిధాలా అర్హత ఉన్న గాత్రమని అన్నారు. సినారె అవార్డు గ్రహీతలు- గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్, గాయకుడు రేవంత్, ప్రణీత్ గ్రూప్ ఎం డి శ్రీ కామరాజు నరేంద్రకుమార్ లను అభినందించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో ఈ నెల 12న న ఈ కార్యక్రమం జరిగింది.

దేవుడు కోరికని బట్టి కాదు

దేవుడు కోరికని బట్టి కాదు … అర్హతని బట్టి ఇస్తాడు.. పరమాత్మ అనుగ్రహం పొందడానికి అర్హతలు ఉన్నాయి. ఇది భగవద్గీత లో కృష్ణుడు -11 వ అధ్యాయమైన విశ్వరూపసందర్శన యోగం లో, 55 వ శ్లోకం లో అర్జునుడి కి చెబుతూ -” ఓ అర్జునా… నేనే పరమ గతి అని నమ్మి, సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి, ఇంద్రియ విషయములపట్ల ఆసక్తిని త్యజించి, సమస్త ప్రాణులయందు వైరభావము లేని భక్తుడే నన్ను పొందును.” అంటాడు. ఈ మార్గం లో ప్రయాణించి పరమాత్మను పొందవచ్చు. ప్రతి మానవుడూ దీర్ఘ జీవితo కోసం కాక దివ్య జీవితం కోసం ప్రయత్నం చెయ్యాలి.” అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి… శ్రీ శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారి 35 వ చాతుర్మాస్య దీక్ష సందర్భం గా శ్రీ గంగాధర శాస్త్రి చే భగవద్గీతా ప్రవచనం ఏర్పాటు చేసారు. ‘తండ్రి చేయిపట్టుకుని రోడ్డు దాటే పిల్లవాడికి భయం ఉండనట్టే… భగవద్గీత చదివి అర్ధం చేసుకుని ఆచరించేవాడిని అధైర్యం దరి చేరదని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతను – జీవన గీత గా, నిష్కామ కర్మ గీత గా, భక్తి గీత గా, జ్ఞాన గీత గా, వ్యక్తిత్వ వికాస గీత గా, ధర్మ ప్రబోధ గీత గా, మానవీయ గీత గా ప్రచారం చేయవలసిఉందని, ఇది బాల్య దశనుండే అధ్యయనo చేయవలసిన గ్రంథం అన్నారు. ప్రతి ఒక్కరూ మితాహారాన్ని, సాత్వికాహారాన్ని, న్యాయార్జితాహారాన్ని, దైవార్పితాహారాన్ని భుజించాలని భగవద్గీత చెబుతుందన్నారు. ‘భగవద్గీతను అర్ధం చేసుకుంటూ చదవండి. ఆచరించే లక్ష్యంతో అర్ధం చేసుకోండి..’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలం లో భగవద్గీత పుస్తకం చదివి అర్ధం చేసుకునే తీరిక లేకపోవడం వల్లనే భగవద్గీతా ఫౌండేషన్ సంగీత భరిత భగవద్గీతను రూపొందించిందని, దీనిని ప్రజలు సద్వినియోగo చేసుకోవాలని సూచించారు. ఇంకా ఇంగ్లిష్, హిందీ, గుజరాతి, కన్నడ, తమిళ్, మలయాళం, ఒడియా, జర్మనీ, రష్యన్ భాషలలోకి కూడా విడుదల చేసేoదుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకు దాతల నుండి చేయూతను అర్ధిస్తున్నామని గంగాధర శాస్త్రి కోరారు. అనంతరం శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామి- భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన చరితార్థుడు శ్రీ గంగాధర శాస్త్రి అని అభినందిస్తూ, భగవద్గీతా ఫౌండేషన్ రూపొందించిన సంపూర్ణ భగవద్గీత – తమ గురుదేవులైన శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
 

భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ కాదు. ఉత్తమ జీవన విధాన గ్రంథం. అజ్ఞానాన్ని పారద్రోలి, అనేక సందేహాలను నివృత్తి చేసి, జీవితం పట్ల ఒక స్పష్టత ఏర్పరిచే, మతాలకు అతీతమైన, స్ఫూర్తిదాయకమైన గ్రంథం. అందుకే గీత చివరన అర్జునుడు – ‘ నష్టోమోహః స్మృతిర్లబ్ధా … నా అవివేకము, సందేహములు, తొలగిపోయి జ్ఞానము లభించినది. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను … అంటూ కర్తవ్యోన్ముఖుడయ్యాడు. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరికీ ఇది అనుభవం లోకి వస్తుంది. ” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యం లో హైదరాబాద్ లో నిర్వహించిన భగవద్గీతా గోష్టి కార్యక్రమం లో అతిథి గా పాల్గొని భగవద్గీత విశిష్టతను, పఠన ఆవశ్యకతను గురించి స్ఫూర్తి దాయకమైన గాన ప్రసంగం చేశారు. తాను పరమాత్మ గా ప్రకటించుకుని బోధించడం వల్ల ఇది భగవద్గీత గా ప్రసిద్ధి చెందిందని, గీత లో కృష్ణపరమాత్మ చెప్పిన 574 శ్లోకాలూ మంత్ర తుల్యాలని, వాటి ఫలితాలను పాఠకులు పొందవచ్చునని గంగాధర శాస్త్రి అన్నారు. గీతా ఆచరణం ద్వారా స్వార్ధ రహిత సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. భగవద్గీతను అర్ధం చేసుకుంటే మతమార్పిడులు ఉండవనిగంగాధర శాస్త్రి అన్నారు. జగత్తు లోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి విశ్వజనీనమైన భగవద్గీతా రూపం లో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడని అన్నారు. ప్రతి తల్లి తమ బిడ్డ కు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం ద్వారా ‘గీతా మాత’ కావాలని ఆశిస్తున్నానన్నారు. మానసిక బలం పెంపొందడానికి గీత కంటే మించిన ఔషధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు గీత ను పాఠ్యఅంశం గా రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వo గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

.

హనుమంతుడా! నా కథలు

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ నీవు సంతోషించుచూ, నా మాటను మన్నించి సుఖము గా ఉండుము.’ అని త్రేతాయుగములో శ్రీరాముడు హనుమంతుడికి చిరంజీవిత్వమును ప్రసాదిస్తూ వరమిచ్చాడు. చిరంజీవి అనగా మరణము లేనివాడని కాదు.. దీర్గాయువు కలవాడని అర్ధము. ఇది ఇలా ఉండగా ద్వాపర యుగములో తన తపస్సుచే శివుణ్ణి ప్రసన్నం చేసికొని పాశుపతాస్త్రమును పొందిన అర్జునుడు అటుపై ప్రసిద్ధ క్షేత్రమైన రామేశ్వరాన్ని సందర్శించి, ఆ పరిసర ప్రాంతాలనుకూడా దర్శిస్తూ దారిలో ఒక కొండమీద ధ్యాన ముద్రలో ఉన్న ఒక వానరాన్ని చూసి పలకరించాడు. ఆ వానరం – తన పేరు హనుమంతుడనీ, శ్రీరామభక్తుడనని, శ్రీరాముని ఆజ్ఞతో రామసేతుని తామే నిర్మించామని చెప్పగా – ‘గొప్ప శస్త్రధారి గా పేరుగాంచిన శ్రీరాముడు బాణాలతో వారధి నిర్మించకుండా, మీ సహాయంతో, రాళ్లతో వారధి నిర్మించడమేమిటి’ అంటూ అర్జునుడు పరిహాసం చేస్తూ ప్రశ్నించగా – ‘కోట్లాది వానర సేన బరువుని నిబాణాల వంతెన మోయలేదు కనుక’ అంటూ హనుమంతుడు బదులిస్తూ – ‘అయితే నువ్వు బాణాల వంతెన నిర్మించు.. దానికి మీద నేను నడుస్తాను. నా బరువుకు అది నిలబడితే అప్పుడు నా రాముడు చేసింది తప్పని ఒప్పుకుంటాను. అంటూ సవాలు విసురుతాడు. అర్జునుడు ఆ సవాలును స్వీకరిస్తూ ‘ నా బాణాల వారధిని నువ్వు కూల్చి వేయగలిగితే నేను ప్రాణత్యాగం చే స్తాను.’ అంటాడు. అటుపై అర్జునుడు బాణాలతో వారధి నిర్మించడం, దానిపై హనుమంతుడు కాలుమోపగానే అది కూలిపోవడం, అర్జునుడు తన ఓటమిని అంగీకరించి ప్రాణత్యాగానికి సిద్ధపడడం చూసి అప్పటి వరకూ అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని రూపం దాల్చి అర్జునుడు, హనుమంతుల మధ్య మైత్రిని ఏర్పరచగా – ‘ బలం, ధైర్యం ఉన్న నీవు ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను.’ అని అర్జునుడు కోరగా – రాబోయే కురుక్షేత్ర సంగ్రామం లో నీ రథం పై ఉండి నీకు విజయాన్ని చేకూరుస్తాను.’ అంటూ వరమిస్తాడు హనుమంతుడు. అటువంటి హనుమ విజయాంజనేయస్వామిగా – పహాడీ హనుమాన్ దేవస్థానం ( తుకారాం గేటు దగ్గర, ఈస్టు మారేడు పల్లి, బృందావన్ మోటార్స్ పక్కన, హైదరాబాద్ ) లో కొలువై భక్తుల కు విజయం చేకూరుస్తున్నాడు. బ్రిటిషర్ల కాలం నుండి కొండ పై ఉన్న ఈ దేవాలయం చుట్టూ ఇప్పటికే చాలా భాగం కబ్జాలకు గురై హిందువుల బలహీనతను వెక్కిరిస్తోంది. ఈ దేవాలయాన్ని కాపాడుకోవలసిన హిందువుల బాధ్యతను గుర్తు చేస్తోంది. దేవదాయ శాఖని, మరెవ్వరివల్లా సాధ్యం కాని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ మహాద్భుత మహత్కార్యాన్ని హిందువుల కళ్లముందుంచిన శ్రీకృష్ణదేవరాయ సమానుడు, ధార్మికుడైన ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ ని ఈ దేవాలయానికి పూర్వ వైభవమ్ తెచ్చిపెట్టడానికై ‘భగవద్గీతా ఫౌండేషన్’ అభ్యర్థిస్తోంది. ప్రసిద్ధ సినీ నటులు, శ్రీరామకోటి రచనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, ప్రసిద్ధ న్యాయవాది శ్రీ సి వి ఎల్ నరసింహారావు గారు ఈ దేవాలయ వైభవం కోసం విశేషమైన కృషి చేస్తున్నారు. వారి ఆహ్వానం పై భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి పహాడీ విజయాంజనేయస్వామి వారిని కుటుంబసమేతం గా దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇష్టకామ్యాలను నెరవేర్చగలిగిన అత్యంత శక్తివంతమైన, పురాతనమైన ఈ దేవాలయాన్ని కాపాడవలసిందిగా రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భక్తులు దర్శించుకుని సత్ఫలితాలను పొందవలసిందిగా, విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరారు. భారతానికి భగవద్గీత ఎలాంటిదో, రామాయణానికి సుందరకాండ అలాంటిదని చెబుతూ – సర్వాభీష్టప్రదాయిని, సకలారిష్ట నివారిణి అయిన సుందరకాండ ను నిత్యమూ దేవాలయ సౌండ్ సిస్టం ద్వారా ప్లే చెయ్యాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచారకులు శ్రీ రాధామనోహర్ దాస్ స్వామి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొనడం విశేషం.

 ధర్మబద్ధం గా చెయ్యాలి

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా చెయ్యాలి. త్రికరణశుద్ధి గా చెయ్యాలి. ఫలితం పరమాత్మదని భావించి చెయ్యాలి. భవబంధాలను వదలి చెయ్యాలి. నిస్వార్ధం గా చెయ్యాలి. అహంకారరహితం గా చెయ్యాలి. లోకహితం కోసం చెయ్యాలి…. ఇదే భగవద్గీత సారాంశం…’ అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అమ్మకు ప్రేమతో…’ శీర్షికన తన తల్లి గారైన సునీతమ్మ జన్మదినం సందర్భం గా – శ్రీమతి సర్వేపల్లి ప్రవీణ (జూబిలీ హిల్స్ -హైదరాబాద్ లో ) ఏర్పాటు చేసిన గీతా సత్సంగం లో గంగాధర శాస్త్రి గాన ప్రవచనం చేశారు. ఆదర్శవంతమైన భవిష్యత్తు సౌధం నిర్మించుకోవాలంటే – జీవిత ప్రారంభదశలో నైతికమైన పునాది ఏర్పరచుకోవాలని అన్నారు. అందుకు ప్రపంచం లోనే – భగవద్గీత కు మించిన జీవిత పాఠం, ఉపదేశం మరొకటి లేదని అన్నారు. భగవద్గీత లోని ప్రతి శ్లోకాన్నీ – ప్రతి పదానికి అంతరార్ధం అర్ధం చేసుకుంటూ, దానిని ఆచరించే లక్ష్యం తో చదివితే – మన ఆలోచనా విధానంలో స్పష్టత ఏర్పడుతుందని, కుటుంబవ్యవస్థ, సమాజం, ప్రపంచం శాంతిమయం అవుతుందని అన్నారు. ఆధ్యాత్మికత అంటే అది రిటైర్మెంట్ సబ్జక్ట్ కాదని, భగవద్గీత వైరాగ్య గ్రంధం కాదని … అది ఉత్తమ జీవన విధాన మార్గాన్ని ఉపదేశించే పాఠమని, కాబట్టి దీనిని జీవిత ప్రారంభదశలోనే భగవద్గీత ద్వారా తల్లి తండ్రులు, గురువులు పిల్లలకు నేర్పించాలని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే తమ భగవద్గీతా ఫౌండేషన్ భగవద్గీతను పాఠ్యాంశం గా చేర్చమని రాష్ట్రప్రభుత్వాలని, జాతీయ గ్రంథం గా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని అన్నారు. మరణించిన తరువాత కూడా ప్రజల హృదయాలలో జీవించి ఉండాలంటే అందుకు త్యాగం అవసరమని, అలాగే – సేవలేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదని అన్నారు. సర్వ శక్తులకూ కారణమైన ఆహారాన్ని స్వీకరించేముందు విధిగా దైవానికి కృతజ్ఞతలు చెబుతూ – బ్రహ్మార్పణం బ్రాహ్మహవి (4-24), అహం వైశ్వానరో భూత్వా (15-14) శ్లోకాలను పఠించవలసిందని సూచించారు. మానవ సంబంధాలు కేవలం ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో భగవద్గీతా పఠనం మానసిక వత్తిడిని తగ్గించి, నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించి, ఉత్తమ లక్ష్యాన్ని చేరుస్తుందని అన్నారు. భగవద్గీతను మరణ గీత గా కాక జీవనగీత గా గుర్తించాలని, శ్రీకృష్ణుడికి మించిన మేనేజ్ మెంట్ గురువు, భగవద్గీత తో సమానమైన ఉత్తమ జీవన విధాన గ్రంధం ఈ ప్రపంచం లోనే లేదని అన్నారు. కుటుంబ జీవనానికి ఆత్మ జ్యోతి – తల్లి కాబట్టి తల్లులు తమ బిడ్డలకు భగవద్గీత నేర్పించే బాధ్యత తీసుకోవాలని, ఇలాంటి గీతా సత్సంగాలు ప్రతి చోటా వారానికి ఒక్కరోజైనా జరగాలని చెబుతూ – జూబిలీ హిల్స్ లో తరచుగా జరిగే పార్టీ లకు భిన్నం గా శ్రీమతి ప్రవీణ ఏర్పాటు చేసిన ఈ సత్సంగం ఎంతోమందికి ఆదర్శమని చెబుతూ వారికి ఆశీస్సులు అందజేశారు. చివరిగా గంగాధరశాస్త్రి ఆలపించిన కృష్ణ భజన లో అందరూ గళం కలిపారు.