‘మోహన్ ట్రస్ట్’ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ వ్యాఖ్యాత శ్రీ పి ఎం కె గాంధి ‘తెలుగు కళా వైభవం’ పేరుతో హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ లో నిర్వహించిన (10.11.2023) కార్యక్రమం లో – ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి ని ‘గీతా గాంధర్వ సుధార్ణవ’ బిరుదుతో సత్కరించారు. తెలంగాణ బి సి కమిషన్ చైర్మన్ డాII వకుళాభరణం కృష్ణమోహన్ చేతులమీదుగా ఈ సత్కారం జరిగింది. అమెరికాలో ఇటీవల మూడు నెలల పాటు విజయవంతం గా అనేక నగరాలలో తన గీతాగాన ప్రవచనం తో హిందువులను చైతన్య పరచి స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భం గా శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరిస్తున్నట్టు శ్రీ గాంధీ తెలియజేసారు. సత్కారానంతరం శ్రీ గంగాధర శాస్త్రి తన స్పందనను తెలియజేస్తూ – నేటి తరం శారీరకం గా, ప్రతిభ పరం గా, తెలివితేటల పరం గా చాల బలం గా ఉన్నారని మానసికం గా మాత్రం చాలా బలహీనం గా ఉన్నారని, మానసిక వత్తిడులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు సుఖదుఃఖాలను, జయాపజయాలను, లాభాలాభాలను సమం గా తీసుకునే స్థితప్రజ్ఞత్వ లక్షణాన్ని నేర్పగలిగే భగవద్గీత ను భవరోగాలకు దివ్యఔషధం లా భావించి అధ్యయనం చేయగలిగితే ఆదర్శవంతమైన జీవితాన్ని సాధించవచ్చని అన్నారు. భారత దేశం లో పుట్టిన, మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథం భగవద్గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని, పాఠ్యాంశం గా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. గీత లోని విశ్వరూప సందర్శనయోగ ఘట్టాన్ని తాత్పర్యం తో పాడుతూ కళ్ళకు కట్టినట్టు గా వివరించి ప్రేక్షకులను కదిలించారు. నిరు పేదలకు లక్ష కిలోల బియ్యాన్ని పంపిణి చెయ్యాలనే తమ లక్ష్యాన్ని మోహన్ గాంధి వ్యక్తం చేస్తూ వేదికపైన గంగాధర శాస్త్రి చేతుల మీదుగా పేదలకు బియ్యం పంపిణీ చేసినప్పుడు – శ్రీ గంగాధర శాస్త్రి తమ భగవద్గీతా ఫౌండేషన్ తరఫున 25 వేల విరాళాన్ని మోహన్ ట్రస్ట్ కు అందించారు. సమర్ధవంతమైన వ్యాఖ్యానం తో సభలను రంజింపజేస్తూ తెలుగుభాషను కాపాడుతున్నందుకు గాంధీని ప్రశంసించారు.












