‘దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే / దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్ II ( గీత -17-20) దానమిచ్చుట కర్తవ్యమని భావించి దేశ, కాల, పాత్రములనెఱిఁగి ప్రత్యుపకారమునాశింపక చేయుదానము సాత్త్విక దానము… అంటాడు కృష్ణ పరమాత్మ ఇదే ఉత్తమ దానము. మనిషి విధి గా ఆచరించవలసిన మూడు పుణ్య కర్మలలో దానము కూడా ఒకటి. మిగతా రెండు యజ్ఞము, తపస్సు. దాతలు ప్రధానం గా గుర్తించవలసింది పాత్ర ఎరిగి దానం చేయడం. దేవుడు కూడా కోరికను బట్టి ఇవ్వడు. అర్హతను బట్టే ఇస్తాడు. మనమూ అర్హతను బట్టే దానం చెయ్యాలి. శారీరక, మానసిక, ఆర్ధిక దుర్బలులకు, ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతిని కోలుకోలేని వారికి సహాయం చెయ్యండి. ఈ జ్ఞానం కొరవడడం వల్లే ప్రభుత్వాలు ప్రజలకు అవసరం లేని అనేక ఉచితాల ఆశ చూపించి, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. ప్రజలను మానసిక దుర్బలులను, సోమరిపోతులను చేస్తున్నారు. ఉచితం ఎప్పుడూ అనుచితమే.. ఉచితం గా వచ్చేదానికి విలువ ఉండదు. ఏదైనా కష్టపడితే వచ్చే ఫలితానికే విలువ… ఏదైనా ఉచితం గా పొందాలనుకోవడం మానసిక దుర్బలత్వమే…! ఉచితం అంటున్నారంటే అది మరొక చోట ధరలు పెంచి వసూలు చేస్తారని, ఆ భారం పేదల పైనే మరింత పడుతుందని అర్ధం చేసుకోనంతకాలం వ్యవస్థ మారదు.’ అన్నారు ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి…! మాజీ ప్రధాని శ్రీ పి వి నరసింహా రావు సోదరులు, సర్వార్ధ సంక్షేమ సమితి మరియు పి.వి సాహిత్య పీఠం అధ్యక్షులు శ్రీ పివి మనోహరరావు ఆధ్వర్యం లో జరిగిన ( 10.12.2023, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, హైదరాబాద్) కార్తీకమాస వనభోజన కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. “కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనదైతే, మార్గశిరం విష్ణువునకు ప్రీతికరమైనది. ఈ ఇద్దరికీ భేదం లేదని ‘గీత’ లో ‘రుద్రాణాం శంకరశ్చాస్మి’ అంటూ మరోసారి స్పష్టం చేసాడు విష్ణు రూపుడైన కృష్ణపరమాత్మ…దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ పి వి మనోహరరావు గారు నాచేత కార్తీక మాసం లో గీతా ప్రవచనం చెప్పించడం సముచితం గా ఉందని భావిస్తున్నాను. భగవద్గీతను జీవన గీత గా గుర్తెరిగి అధ్యయనం చేస్తే ఉత్తమ జీవితం గడపడం ఎలాగో అర్థమవుతుంది. అప్పుడే జన్మ సార్ధకమవుతుంది. భగవద్గీత వృధాప్యపు కాలక్షేపం కాదు. కేవలం పఠనా గ్రంథమూ కాదు. అధ్యయన గ్రంథం.. ఆచరణ గ్రంథం..! కాబట్టి గీత నేర్చుకుందాం.. రాత మార్చుకుందాo… ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం… బాల్యదశ నుండే మన పిల్లలకు భగవద్గీతను నేర్పించడం ద్వారా సనాతన ధర్మ రక్షకులమవుదాం. స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం…” అన్నారు గంగాధర శాస్త్రి. అనంతరం శ్రీ పివి మనోహర రావు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, బ్రహ్మశ్రీ వి ఎస్ ఆర్ మూర్తి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విజయ బాబు తదితరులు గంగాధర శాస్త్రి ని సత్కరించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A