‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ నీవు సంతోషించుచూ, నా మాటను మన్నించి సుఖము గా ఉండుము.’ అని త్రేతాయుగములో శ్రీరాముడు హనుమంతుడికి చిరంజీవిత్వమును ప్రసాదిస్తూ వరమిచ్చాడు. చిరంజీవి అనగా మరణము లేనివాడని కాదు.. దీర్గాయువు కలవాడని అర్ధము. ఇది ఇలా ఉండగా ద్వాపర యుగములో తన తపస్సుచే శివుణ్ణి ప్రసన్నం చేసికొని పాశుపతాస్త్రమును పొందిన అర్జునుడు అటుపై ప్రసిద్ధ క్షేత్రమైన రామేశ్వరాన్ని సందర్శించి, ఆ పరిసర ప్రాంతాలనుకూడా దర్శిస్తూ దారిలో ఒక కొండమీద ధ్యాన ముద్రలో ఉన్న ఒక వానరాన్ని చూసి పలకరించాడు. ఆ వానరం – తన పేరు హనుమంతుడనీ, శ్రీరామభక్తుడనని, శ్రీరాముని ఆజ్ఞతో రామసేతుని తామే నిర్మించామని చెప్పగా – ‘గొప్ప శస్త్రధారి గా పేరుగాంచిన శ్రీరాముడు బాణాలతో వారధి నిర్మించకుండా, మీ సహాయంతో, రాళ్లతో వారధి నిర్మించడమేమిటి’ అంటూ అర్జునుడు పరిహాసం చేస్తూ ప్రశ్నించగా – ‘కోట్లాది వానర సేన బరువుని నిబాణాల వంతెన మోయలేదు కనుక’ అంటూ హనుమంతుడు బదులిస్తూ – ‘అయితే నువ్వు బాణాల వంతెన నిర్మించు.. దానికి మీద నేను నడుస్తాను. నా బరువుకు అది నిలబడితే అప్పుడు నా రాముడు చేసింది తప్పని ఒప్పుకుంటాను. అంటూ సవాలు విసురుతాడు. అర్జునుడు ఆ సవాలును స్వీకరిస్తూ ‘ నా బాణాల వారధిని నువ్వు కూల్చి వేయగలిగితే నేను ప్రాణత్యాగం చే స్తాను.’ అంటాడు. అటుపై అర్జునుడు బాణాలతో వారధి నిర్మించడం, దానిపై హనుమంతుడు కాలుమోపగానే అది కూలిపోవడం, అర్జునుడు తన ఓటమిని అంగీకరించి ప్రాణత్యాగానికి సిద్ధపడడం చూసి అప్పటి వరకూ అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని రూపం దాల్చి అర్జునుడు, హనుమంతుల మధ్య మైత్రిని ఏర్పరచగా – ‘ బలం, ధైర్యం ఉన్న నీవు ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను.’ అని అర్జునుడు కోరగా – రాబోయే కురుక్షేత్ర సంగ్రామం లో నీ రథం పై ఉండి నీకు విజయాన్ని చేకూరుస్తాను.’ అంటూ వరమిస్తాడు హనుమంతుడు. అటువంటి హనుమ విజయాంజనేయస్వామిగా – పహాడీ హనుమాన్ దేవస్థానం ( తుకారాం గేటు దగ్గర, ఈస్టు మారేడు పల్లి, బృందావన్ మోటార్స్ పక్కన, హైదరాబాద్ ) లో కొలువై భక్తుల కు విజయం చేకూరుస్తున్నాడు. బ్రిటిషర్ల కాలం నుండి కొండ పై ఉన్న ఈ దేవాలయం చుట్టూ ఇప్పటికే చాలా భాగం కబ్జాలకు గురై హిందువుల బలహీనతను వెక్కిరిస్తోంది. ఈ దేవాలయాన్ని కాపాడుకోవలసిన హిందువుల బాధ్యతను గుర్తు చేస్తోంది. దేవదాయ శాఖని, మరెవ్వరివల్లా సాధ్యం కాని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ మహాద్భుత మహత్కార్యాన్ని హిందువుల కళ్లముందుంచిన శ్రీకృష్ణదేవరాయ సమానుడు, ధార్మికుడైన ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ ని ఈ దేవాలయానికి పూర్వ వైభవమ్ తెచ్చిపెట్టడానికై ‘భగవద్గీతా ఫౌండేషన్’ అభ్యర్థిస్తోంది. ప్రసిద్ధ సినీ నటులు, శ్రీరామకోటి రచనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, ప్రసిద్ధ న్యాయవాది శ్రీ సి వి ఎల్ నరసింహారావు గారు ఈ దేవాలయ వైభవం కోసం విశేషమైన కృషి చేస్తున్నారు. వారి ఆహ్వానం పై భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి పహాడీ విజయాంజనేయస్వామి వారిని కుటుంబసమేతం గా దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇష్టకామ్యాలను నెరవేర్చగలిగిన అత్యంత శక్తివంతమైన, పురాతనమైన ఈ దేవాలయాన్ని కాపాడవలసిందిగా రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భక్తులు దర్శించుకుని సత్ఫలితాలను పొందవలసిందిగా, విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరారు. భారతానికి భగవద్గీత ఎలాంటిదో, రామాయణానికి సుందరకాండ అలాంటిదని చెబుతూ – సర్వాభీష్టప్రదాయిని, సకలారిష్ట నివారిణి అయిన సుందరకాండ ను నిత్యమూ దేవాలయ సౌండ్ సిస్టం ద్వారా ప్లే చెయ్యాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచారకులు శ్రీ రాధామనోహర్ దాస్ స్వామి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొనడం విశేషం.