‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా చెయ్యాలి. త్రికరణశుద్ధి గా చెయ్యాలి. ఫలితం పరమాత్మదని భావించి చెయ్యాలి. భవబంధాలను వదలి చెయ్యాలి. నిస్వార్ధం గా చెయ్యాలి. అహంకారరహితం గా చెయ్యాలి. లోకహితం కోసం చెయ్యాలి…. ఇదే భగవద్గీత సారాంశం…’ అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అమ్మకు ప్రేమతో…’ శీర్షికన తన తల్లి గారైన సునీతమ్మ జన్మదినం సందర్భం గా – శ్రీమతి సర్వేపల్లి ప్రవీణ (జూబిలీ హిల్స్ -హైదరాబాద్ లో ) ఏర్పాటు చేసిన గీతా సత్సంగం లో గంగాధర శాస్త్రి గాన ప్రవచనం చేశారు. ఆదర్శవంతమైన భవిష్యత్తు సౌధం నిర్మించుకోవాలంటే – జీవిత ప్రారంభదశలో నైతికమైన పునాది ఏర్పరచుకోవాలని అన్నారు. అందుకు ప్రపంచం లోనే – భగవద్గీత కు మించిన జీవిత పాఠం, ఉపదేశం మరొకటి లేదని అన్నారు. భగవద్గీత లోని ప్రతి శ్లోకాన్నీ – ప్రతి పదానికి అంతరార్ధం అర్ధం చేసుకుంటూ, దానిని ఆచరించే లక్ష్యం తో చదివితే – మన ఆలోచనా విధానంలో స్పష్టత ఏర్పడుతుందని, కుటుంబవ్యవస్థ, సమాజం, ప్రపంచం శాంతిమయం అవుతుందని అన్నారు. ఆధ్యాత్మికత అంటే అది రిటైర్మెంట్ సబ్జక్ట్ కాదని, భగవద్గీత వైరాగ్య గ్రంధం కాదని … అది ఉత్తమ జీవన విధాన మార్గాన్ని ఉపదేశించే పాఠమని, కాబట్టి దీనిని జీవిత ప్రారంభదశలోనే భగవద్గీత ద్వారా తల్లి తండ్రులు, గురువులు పిల్లలకు నేర్పించాలని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే తమ భగవద్గీతా ఫౌండేషన్ భగవద్గీతను పాఠ్యాంశం గా చేర్చమని రాష్ట్రప్రభుత్వాలని, జాతీయ గ్రంథం గా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని అన్నారు. మరణించిన తరువాత కూడా ప్రజల హృదయాలలో జీవించి ఉండాలంటే అందుకు త్యాగం అవసరమని, అలాగే – సేవలేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదని అన్నారు. సర్వ శక్తులకూ కారణమైన ఆహారాన్ని స్వీకరించేముందు విధిగా దైవానికి కృతజ్ఞతలు చెబుతూ – బ్రహ్మార్పణం బ్రాహ్మహవి (4-24), అహం వైశ్వానరో భూత్వా (15-14) శ్లోకాలను పఠించవలసిందని సూచించారు. మానవ సంబంధాలు కేవలం ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో భగవద్గీతా పఠనం మానసిక వత్తిడిని తగ్గించి, నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించి, ఉత్తమ లక్ష్యాన్ని చేరుస్తుందని అన్నారు. భగవద్గీతను మరణ గీత గా కాక జీవనగీత గా గుర్తించాలని, శ్రీకృష్ణుడికి మించిన మేనేజ్ మెంట్ గురువు, భగవద్గీత తో సమానమైన ఉత్తమ జీవన విధాన గ్రంధం ఈ ప్రపంచం లోనే లేదని అన్నారు. కుటుంబ జీవనానికి ఆత్మ జ్యోతి – తల్లి కాబట్టి తల్లులు తమ బిడ్డలకు భగవద్గీత నేర్పించే బాధ్యత తీసుకోవాలని, ఇలాంటి గీతా సత్సంగాలు ప్రతి చోటా వారానికి ఒక్కరోజైనా జరగాలని చెబుతూ – జూబిలీ హిల్స్ లో తరచుగా జరిగే పార్టీ లకు భిన్నం గా శ్రీమతి ప్రవీణ ఏర్పాటు చేసిన ఈ సత్సంగం ఎంతోమందికి ఆదర్శమని చెబుతూ వారికి ఆశీస్సులు అందజేశారు. చివరిగా గంగాధరశాస్త్రి ఆలపించిన కృష్ణ భజన లో అందరూ గళం కలిపారు.