“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ కాదు. ఉత్తమ జీవన విధాన గ్రంథం. అజ్ఞానాన్ని పారద్రోలి, అనేక సందేహాలను నివృత్తి చేసి, జీవితం పట్ల ఒక స్పష్టత ఏర్పరిచే, మతాలకు అతీతమైన, స్ఫూర్తిదాయకమైన గ్రంథం. అందుకే గీత చివరన అర్జునుడు – ‘ నష్టోమోహః స్మృతిర్లబ్ధా … నా అవివేకము, సందేహములు, తొలగిపోయి జ్ఞానము లభించినది. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను … అంటూ కర్తవ్యోన్ముఖుడయ్యాడు. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరికీ ఇది అనుభవం లోకి వస్తుంది. ” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యం లో హైదరాబాద్ లో నిర్వహించిన భగవద్గీతా గోష్టి కార్యక్రమం లో అతిథి గా పాల్గొని భగవద్గీత విశిష్టతను, పఠన ఆవశ్యకతను గురించి స్ఫూర్తి దాయకమైన గాన ప్రసంగం చేశారు. తాను పరమాత్మ గా ప్రకటించుకుని బోధించడం వల్ల ఇది భగవద్గీత గా ప్రసిద్ధి చెందిందని, గీత లో కృష్ణపరమాత్మ చెప్పిన 574 శ్లోకాలూ మంత్ర తుల్యాలని, వాటి ఫలితాలను పాఠకులు పొందవచ్చునని గంగాధర శాస్త్రి అన్నారు. గీతా ఆచరణం ద్వారా స్వార్ధ రహిత సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. భగవద్గీతను అర్ధం చేసుకుంటే మతమార్పిడులు ఉండవనిగంగాధర శాస్త్రి అన్నారు. జగత్తు లోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి విశ్వజనీనమైన భగవద్గీతా రూపం లో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడని అన్నారు. ప్రతి తల్లి తమ బిడ్డ కు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం ద్వారా ‘గీతా మాత’ కావాలని ఆశిస్తున్నానన్నారు. మానసిక బలం పెంపొందడానికి గీత కంటే మించిన ఔషధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు గీత ను పాఠ్యఅంశం గా రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వo గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
.