“తనను తెలుసుకున్న వాడు తత్వజ్ఞుడు / పరుల తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు / అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు / అన్ని తెలుసునన్నవాడు అల్పజ్ఞుడు’ అంటూ ఎలా ఉంటె మనిషి మనీషి అవుతాడో జాతికి పాఠం చెప్పిన సద్గురువు డా సి నారాయణ రెడ్డి గారు.” అన్నారు భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్ బి సుధాకర్ వ్యవస్థాపకుడు గా ప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ – ప్రసిద్ధ సినీ నేపధ్య గాయనీమణి పద్మభూషణ్ పి సుశీలకు సి నా రే జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించిన సందర్భం గా – అతిథి గా హాజరై గాన ప్రసంగం చేశారు. ‘నన్ను గాయకుడుగా ప్రోత్సహించి, సంగీత దర్శకుడుగా పరిచయం చేసి, దాసరినారాయణ రావు గారికి సిఫార్సు చేయడం ద్వారా సినీ నేపధ్య గాయకుడుగా పరిచయం చేసి , పి వి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గార్లకు పరిచయం చేసి, స్వరకల్పనావధానo పేరుతో నాతో ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి, తన ‘విశ్వంభర’ కు సంగీతం సమకూర్చేందుకు అవకాశం ఇచ్చి అనేక విధాలుగా ప్రోత్సహించిన దివంగత మహాకవి డాII సి నారాయణరెడ్డి గారు నాకు గురువు, గాడ్ ఫాదర్… ఆయన కు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఆయన రాసిన ప్రతి పాట, ప్రతి కవిత ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధమే ” అన్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమను పంచేది తల్లి అయితే – అలాంటి తల్లి ప్రకృతి అని చెబుతూ – ‘కణ కణ లాడే ఎండకు శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ / చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అందించే మబ్బే అమ్మ ‘ అని నిస్వార్ధం తో బతకమనే సందేశం తో సినారె కలం మాత్రమే వ్రాయగలదని గంగాధరశాస్త్రి అన్నారు. భాషా స్పష్టత, అమృతత్వం, ఆర్ద్రత నిండిన పురుష కంఠాలలొ ఘంటసాలను, స్త్రీ కంఠాలలో పి. సుశీలను భర్తీ చేసిన గాత్రాలు నేటికీ తాను విన లేదని అన్నారు. తెలుగు భాషను కాపాడిన ఆ సంగీత సరస్వతి గాత్రం లతామంగేష్కర్ కి ఏ మాత్రం తక్కువ కాదని ‘భారత రత్న’ కి అన్నివిధాలా అర్హత ఉన్న గాత్రమని అన్నారు. సినారె అవార్డు గ్రహీతలు- గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్, గాయకుడు రేవంత్, ప్రణీత్ గ్రూప్ ఎం డి శ్రీ కామరాజు నరేంద్రకుమార్ లను అభినందించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో ఈ నెల 12న న ఈ కార్యక్రమం జరిగింది.