ప్రసిద్ధ నాట్యాచారిణి ‘పద్మశ్రీ ‘ శోభానాయుడు తన శిష్యబృందం తో ‘విప్రనారాయణ’ నృత్యరూపకాన్ని మంగళవారం (30.7. 2018) నాడు హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో అత్యంత రసార్ద్రం గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. శోభానాయుడు ప్రదర్శనలను తిలకించి స్ఫూర్తి పొందిన అనేకమంది లో తానూ ఒకడినని గంగాధర శాస్త్రి అన్నారు. సిద్ధేంద్ర యోగి అంశతో ఉద్భవించి కూచిపూడి నాట్య ఔన్నత్యాన్ని ప్రచారం చేయడానికే తన జీవితం అంకితం చేసిన తపస్వి శోభానాయుడు అని అన్నారు. సినిమాలలో వచ్చిన అవకాశాల్ని కాదని, కూచిపూడి సంప్రదాయాన్ని కాపాడడానికే తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించడం శోభానాయుడు అంకితభావానికి నిదర్శనమని అన్నారు.
ఆమెను స్ఫూర్తి గా తీసుకుని కూచిపూడి నాట్య కళను కాపాడవలసిన బాధ్యతను ఈ తరం వారు స్వీకరించాలని పిలుపునిచ్చారు. పాటంటే సినిమా పాటే అనీ, డాన్స్ అంటే సినిమా డాన్సే అనుకునే వారికి – అంతకు మించిన దివ్యానుభూతి సంప్రదాయ కళల్లో ఉంటుందని ఈ రోజు ప్రదర్శించిన విప్రనారాయణ నృత్య రూపకం చెబుతుందని, ఇలాంటి ప్రదర్శనలను విద్యార్థులు,యువతీ యువకులకు చూపించడం ద్వారా భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చెప్పవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని గంగాధర శాస్త్రి అన్నారు. శ్రీమతి శోభానాయుడు కూచిపూడి నాట్య కళకు నాలుగున్నర దశాబ్దాలుగా నిస్వార్ధంగా చేస్తున్న సేవలను గుర్తించి ఆమెను “భారత రత్న ” తో గౌరవించాల్సిoదిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి జయ జయ శంకర టీవీ ఛానెల్ సి ఈ ఓ శ్రీ ఓలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించారు..