“మనం చేసే కర్మలు ధర్మబద్ధమైనవి అయి ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ అనుగ్రహం సంపూర్ణం గా ఉంటుంది. ధర్మ మార్గం లో ఉన్న ఏ భక్తుడు అనన్య భక్తి తో పరమాత్మ ను ధ్యానిస్తాడో అట్టి వారి యోగక్షేమాలు తానే చూసుకుంటానని పరమాత్మ చెబుతాడు. ఇక్కడ యోగం అంటే పొందని దానిని పొందుట, క్షేమం అంటే పొందినదానిని రక్షించుట అని ఆది శంకరుల భాష్యం. ఏ దేవతను ఆరాధించినా అది తనను ఆరాధించినట్టేనని చెబుతూ ఆయా దేవతలు తన అనుగ్రహం వల్లనే ఫలాలను ఇస్తారని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. తిరగలిలో దగ్గరగా ఉండే గింజలు నలగవు. అలాగే పరమాత్మకు దగ్గరగా ఉండే వానికి నాశనము లేదు. ‘న మే భక్త: ప్రణశ్యతి’ అన్నది పరమాత్మ వాక్యం… గీతను బాల్య దశనుండే పిల్లలకు నేర్పించండి. ఈ దేశం గొప్పతనం, ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత రూపం లో పిల్లలకు నేర్పించండి. ఇలా తెలియ చేయకపోవడo వల్లే పిల్లలు తల్లి తండ్రులను, ఈ దేశాన్ని వదిలేసి కేవలం డబ్బుకోసం ఇతర దేశాల వెంట పరుగెడుతున్నారు. ఉత్తమ జీవన విధానాన్ని, ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పరుస్తుంది భగవద్గీత. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం గా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది భగవద్గీత. భగవద్గీతను ప్రచారం చేయడమంటే మతాన్ని ప్రచారం చెయ్యడమని కాదు. ధర్మాన్నీ, జ్ఞానాన్ని ప్రచారం చెయ్యడం…! మానసిక, శారీరక, వాచిక ఆరోగ్యాలను కాపాడి ఉన్నతమైన మార్గాన్ని చూపుతుంది గీత.. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి… నల్గొండ జిల్లా నకిరేకల్ లోని షిరిడి సాయిబాబా సంస్థాన్ ప్రాంగణం లో (29.4. 2023) ఆయన గీతా గాన ప్రవచనం చేశారు. భగవద్గీత శ్లోకాలు పఠించిన చిన్నారులను, వారికి శిక్షణనిచ్చిన గురువు శ్రీమతి సుమలత ను ఆశీర్వదించారు. తమకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీ రాంబాబు, తులసి దంపతులకు, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేసారు. ట్రస్టు చైర్మన్ శ్రీ కోసం లింగయ్య, సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి దంపతులను సత్కరించారు.





































