Latest News

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

మనిషి మరణించే వరకు జీవించడం

మనిషి మరణించే వరకు జీవించడం

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

ఇహ పర లోకాలలో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి, జన్మరాహిత్య స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్ని శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించే వాడు గురువు అవుతాడు. అయితే సర్వ దేశాలకూ, సర్వ కాలాలకూ, సర్వ జాతులకూ వర్తించే విధం గా – జగత్తులోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి అభ్యుదయ నిశ్రేయస మార్గాలను రెండింటినీ, మహోదాత్తమైన పధ్ధతి లో, విశ్వజనీనమైన భగవద్గీతా రూపం లో ఉపదేశించడం ద్వారా శ్రీ కృష్ణుడు జగద్గురువయ్యాడు… ఆ జ్ఞానాన్ని యథార్థం గా విశ్లేషణాత్మకం గా, మహోదాత్తం గా జన బాహుళ్యానికి అందించడం ద్వారా వేద వ్యాసుడు, ఆది శంకరాచార్య జగద్గురువులయ్యారు.’ అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త బ్రహ్మశ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ నిర్వహణలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య భక్త సమాజం, వేదాంత భారతి, ఋషి పీఠం, తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యం లో హైదరాబాద్ లో జరుగుతున్న శ్రీ శంకర జయంతి ఉత్సవాలలో శ్రీ గంగాధర శాస్త్రి పాల్గొని ప్రసంగించారు. భారతదేశం లోని యోగులందరూ కలిసి ప్రజలలో తీసుకువచ్చిన ఆధ్యాత్మిక చైతన్యం ఒక ఎత్తైతే , ఆది శంకరులు ఒక్కరే తీసుకు వచ్చిన చైతన్యం అనన్య సామాన్యమనీ గంగాధర శాస్త్రి అన్నారు. ఎంత కాలం జీవించినా మరెవరూ చేయలేనంత ఆధ్యాత్మిక సేవ 32 సంవత్సరాల వయసులోపే అఖండ భారతాన్ని పర్యటించి, నాలుగు పీఠాలను స్థాపించి, హిందూ మతాల మధ్య సయోధ్యను నెలకొల్పి, అనేక రచనలు చేసి ముఖ్యం గా ప్రస్థాన త్రయానికి ( బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ) భాష్యాలు రచించి, హిందూ మతానికి దిశానిర్దేశం చేసిన అవతార పురుషుడు శ్రీ శంకరాచార్య – అన్నారు. ముఖ్యం గా లక్ష శ్లోకాల మహాభారత ఇతిహాసం లో – భీష్మ పర్వం లోని 25 వ అధ్యాయం నుండి 42 వ అధ్యాయం వరకూ ఉన్న భగవద్గీతకు అత్యద్భుతమైన భాష్యం అందించి హైన్దవ జాతిని జాగృతం చేసిన మొదటి వాడు జగద్గురువు ఆది శంకరాచార్య అన్నారు. శ్రీ శంకరాచార్య ‘నారాయణః పరోవ్యక్తాత్’ అంటూ నారాయణ స్మరణం తో భగవద్గీత కు భాష్యం ప్రారంభించారని, శివకేశవులకు అభేదమని ప్రవచించారని, విష్ణు రూపాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు శివుడిని పూజించిన వారేనని, అజ్ఞానం తో వారిద్దరూ వేరు అని మనం భావిస్తున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. ‘సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।’ అంటూ -శివ నామం లేకుండా విష్ణు సహస్రనామం, విభూతి యోగం లో ‘రుద్రాణాం శంకర శ్చాస్మి’ అంటూ శంకర నామం లేకుండా భగవద్గీత పూర్తి కాదని పేర్కొన్నారు. భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి శంకరులు చేసిన కృషి మరెవ్వరూ చేయలేదని అన్నారు. ముఖ్యం గా అద్వైతామృతవర్షిణి గా బోధించబడిన భగవద్గీతకు శ్రీ శంకరాచార్య వ్రాసిన భాష్యం అత్యంత ప్రామాణికమని గంగాధర శాస్త్రి అన్నారు. మతాలకు అతీతమైన, ఉత్తమ జీవన విధాన గ్రంథమైన భగవద్గీతను బాల్యదశ నుంచే నేర్పించే ప్రయత్నం తల్లులు చేయాలని పిలుపునిచ్చారు. అటుపై రాష్ట్ర ప్రభుత్వాలు గీతను పాఠ్యాంశo గా ప్రవేశ పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం భగవద్గీతను జాతీయ గ్రంధం గా ప్రకటించాలని కోరారు. శ్రీ శంకరుల బోధనలను అర్ధం చేసుకుని వాటిని కొంతవరకైనా ఆచరించగలిగితే – అదే ఆ మహాత్మునికి ఘనమైన నివాళి అవుతుందని గంగాధరశాస్త్రి అన్నారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *