భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎం ఎల్ ఏ శ్రీ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ రామంతాపూర్, హైదరాబాద్ లోని తన స్వగృహం లో కోటి లలితాసహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని పది రోజుల పాటు అత్యంత ఘనం గా నిర్వహించారు. ఈ పారాయణ కార్యక్రమం లో వందలాది మంది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని మూడు కోట్ల లలితా సహస్రనామ పారాయణ చేసారు. ఈ కార్యక్రమం లో 9 వ రోజు, ఫిబ్రవరి 3, 2020 న ముఖ్య అతిధి గా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరై గీతా వైభవం గురించి ప్రసంగించారు. ప్రభుత్వాల పైన, పాఠశాలల్లో అధ్యాపకుల పైనా నిందలు వేయకుండా భగవద్గీతను తమ బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత తల్లులే స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. హిందూ సమాజం పటిష్టం కావాలంటే భగవద్గీతను అధ్యయనం చేయాలని సూచిస్తూ , మహిళలు రోజుకొక్క శ్లోకం అర్థం తో సహా తాము చదువుకుని పిల్లలకు నేర్పించగలిగితే, మానసికవత్తిడి, స్వార్థమూ లేని ఉత్తమమైన సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. తాను పరమాత్మగా ప్రకటించుకుని ప్రవచించడం వల్ల భగవద్గీతలోని ప్రతిశోకమూ మంత్రతుల్యమైనదని, గీతాపఠనం కార్యసిద్ధికి సోపానమనీ తెలిపారు.
గీతలో కొన్ని శ్లోకాలను తాత్పర్య సహితంగా వివరిస్తూ, అవి నిత్యా జీవన విధానం లో సర్వ మానవాళికి ఎలా ఉపయోగిస్తాయో గంగాధర శాస్త్రి తెలిపారు. ఇతరమతాల దాడికి హిందూధర్మానికి కలుగుతున్న హాని కి తాజా ఉదాహరణే పిఠాపురం లో ఇటీవల 24 హిందూ దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేయడమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో స్వామి పరిపూర్ణానంద శ్రీ లలితా వైభవాన్ని హృద్యం గా ప్రవచించారు. ..