అనంతపురం జిల్లా లోని ధర్మవరం లో కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ – పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించింది. 16.2.2020 న జరిగిన ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి విశిష్ట అతిధి గా హాజరై ఘంటసాల పాటలలో ఉన్న జీవన విలువలను వివరిస్తూ గాన ప్రసంగం చేశారు. ఘనాఘన సుందరా, అహో ఆంధ్ర భోజ, వినరా వినరా నరుడా, ఆలయన వెలసిన, కలకానిది, బాబూ వినరా, గాంధీపుట్టిన దేశమా వంటి గీతాలను గానం చేస్తూ మధ్య మధ్య భగవద్గీతా రహస్యాన్ని వివరించారు. ఘంటసాల భగవద్గీతా గానం తో తన జన్మని చరితార్థం చేసుకుని తెలుగువారికి ఆరాధ్యుడయ్యారనీ, ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా భగవద్గీతను సంపూర్ణం గా గానం చేసి గురుదక్షిణ చెల్లిoచుకున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. అయన పాటలు పాడడం ద్వారా తనకు ప్రపంచ వ్యాప్తం గా గాయకుడి గా విశేషమైన గుర్తింపూ, గౌరవం వచ్చిందనీ ఆ కృతజ్ఞతతోనే తాను కట్టుకున్న ఇంటికి “ఘంటసాల స్వర సౌధం” అని పేరు పెట్టుకున్నానని అన్నారు. ప్రజలు తమ విధులను నిర్వర్తించడానికి బయటికి వెళ్లే ముందు ప్రతిరోజూ తాను పాడిన భగవద్గీతను వినడం ద్వారా ధర్మ మార్గం లో ప్రయాణం చేయవచ్చని – ఘంటసాల చెబుతూ ఉండేవారని, అటువంటిది ఆయన పాడిన భగవద్గీతను వ్యక్తుల మరణాలకు సంకేతం గా ఉపయోగించడం బాధాకరమని అన్నారు. ఘంటసాల పాటల్లో భక్తి , సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, సంస్కృత, ఆంధ్ర భాషల మాధుర్యం, శాంతి ఉన్నాయని అన్నారు. ధర్మవరం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ జి ఆర్ మధుసూదన్, శ్రీ పి వెంకటనారాయణ , శ్రీ బి నాగరాజారావు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు.