భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీత-వ్యక్తిత్వ వికాసం’ అనే అంశం పై స్ఫూర్తిదాయకo గా చేసిన భగవద్గీతా గాన ప్రసంగానికి ప్రేక్షకులు విశేషం గా స్పందించారు. గీతాచరణ ద్వారా నిత్యజీవితాన్ని వత్తిడికి దూరం గా ఎలా ఆనందమయం చేసుకోవచ్చో గంగాధర శాస్త్రి వివరించారు. మనకు నచ్చిందని ఏదిపడితే అది చేసుకుంటూ పోరాదని, అది శాస్త్రసమ్మతమై ఉండాలని, ఆ శాస్త్రమే గీతా శాస్త్రమని, ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ’ అన్న పరమాత్మ వాక్కు మానవ జాతికి అనుసరణీయమని గంగాధరశాస్త్రి అన్నారు, ఈ కార్యక్రమం ‘హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో’ లో 30.7.2023 న ఉదయం జరిగింది. దేవాలయ కార్యవర్గం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక స్వాములు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ గంగాధర శాస్త్రి కి తీర్థ ప్రసాదాలు అందించారు. డాII మీనాక్షి శ్రీ గంగాధర శాస్త్రి స్వాగత వచనాలతో వేదికపైకి ఆహ్వానించారు. గీతా గాన ప్రవచనం అనంతరం దేవాలయ పాలకమండలి చైర్మన్ శ్రీ రామకృష్ణ జూలుకుంట్ల, డా మీనాక్షి, శ్రీ కేదార్నాథ్ చింతపల్లి దంపతులు, శ్రీ రాజేశ్వర రావు టేకుమళ్ళ, శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు గంగాధర శాస్త్రి ఆశీస్సులు తీసుకుని ఫోటోలు దిగారు. ప్రవచనం కార్యక్రమానికి ముందు శ్రీమతి జయంతి కోట శిక్షణలో, బాలబాలికలు భగవద్గీత లోని ‘భక్తి యోగము’ పఠించగా గంగాధర శాస్త్రి ఆశీరభినందనలు అందించారు. తనకు ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన శ్రీ రాజేశ్వర రావు టేకుమళ్ళ, శ్రీమతి జ్యోతి దంపతులకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు.