సెయింట్ లూయిస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ సెంటర్ లో జరిగిన (27.8. 2023) ‘గీతా గాన ప్రవచనం’ కార్యక్రమంలో ప్రజలు అత్యధిక సంఖ్య లో పాల్గొని ఘన విజయం చేకూర్చారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి తన గీతా గాన ప్రవచనం లో భగవద్గీత తో పాటు ఘంటసాల, అన్నమయ్య భక్తి గీతాలతో, భజనలతో రెండున్నర గంటలసేపు ప్రేక్షకులకు స్పూర్తినిస్తూ గీతా మార్గం లో ప్రయాణించారు. ”అమెరికన్స్ తో పాటు కలిసి మెలుగుతున్న భారతీయుల పిల్లలు ఒక పక్క తమ తల్లి తండ్రుల సంస్కృతిని, మరోపక్క అమెరికన్స్ జీవన విధానాన్ని అర్ధం చేసుకుంటూ నడవడం లో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని, తత్కారణం గా అశాంతి పెరిగి పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గంగాధర శాస్త్రి అన్నారు. దీనికి పరిష్కారం – బాల్యదశ నుండే మన పిల్లలకు స్వధర్మాన్ని, సంప్రదాయాలను, భగవద్గీతను తెలియజేయడం ఒక్కటే అని, మన సంస్కృతిని, మాతృ భాషను తరువాత తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ‘శ్రేయాన్ స్వధర్మో విగుణః’ అనే గీతా శ్లోకాన్ని తాత్పర్య సహితం గా శ్రీ గంగాధర శాస్త్రి గుర్తు చేస్తూ వివరించారు. ‘గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే’ అని చెబుతూ గీత లో అతి ముఖ్య శ్లోకాలను నిజ జీవితం లో ఆచరించడం ద్వారా మానసిక వత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు. తనకీ అవకాశం ఇచ్చిన శ్రీ ప్రసాద్ స్వర్ణ కు గంగాధర శాస్త్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదం చేసిన శ్రీ నారాయణ బొమ్మిరెడ్డిపల్లి, శ్రీ వెంకట్ ధర్మవరపు, శ్రీ హరి కావూరి, రవి ప్రకాష్ శ్రీపాద, శ్రీ సాయి స్తబ్నవిస్ లకు ధన్యవాదాలు తెలియజేసారు. ప్రసిద్ధ నాట్యకళాకారిణి, నాట్యాచారిణి శ్రీమతి అర్చన ఉపమాక సుమధురమైన తెలుగు లో వ్యాఖ్యానం అందించారు. ప్రసిద్ధ నాట్యాచారిణి శ్రీమతి సుజాత వింజమూరి, శ్రీమతి సునీత ధర్మవరపు, శ్రీమతి నీలిమ స్వర్ణ, శ్రీమతి ప్రియా నందనవనం, శ్రీమతి లావణ్య కావూరి, శ్రీమతి మాధవి స్తబ్నవిస్ లు జ్యోతి ప్రకాశనం చేసిన అనంతరం శ్రీ ప్రసాద్ స్వర్ణ – భగవద్గీతా వ్యాప్తి కి శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయనను వేదికకు ఆహ్వానించారు. శ్రీ శ్రీనివాస ఐనాపురపు – గంగాధరు జూటము విడి /పొంగుచు యేతెంచెనేమొ పుష్కరవేళన్ /జంగమ తీర్థపు గళమున /సంగమమైనట్టి గంగ చప్పున మెఱిసెన్ / అంటూ తన పద్య రత్న మాలతో గంగాధర శాస్త్రి ని సత్కరించారు. శ్రీ జయరాం అద్దేపల్లి, శ్రీమతి జయంతి లు స్ప్రింగ్ ఫీల్డ్ నుంచి మూడున్నర గంటల రోడ్డు ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి హాజరై దివ్యమైన అనుభూతిని, భగవద్గీతా స్ఫూర్తిని పొందామని అన్నారు. యూట్యూబ్ వీడియోలు చూసిన స్ఫూర్తి తో శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రవచనాన్ని ప్రత్యక్షం గా వినేందుకు సుదూరాలనుంచి అభిమానులు తరలిరావడం విశేషం.