‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప … అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ..! అంటే – మానసిక దౌర్బల్యాన్ని నీచమైనది గా చెబుతూ దాన్ని విడిచిపెట్టి నీ కర్తవ్యాన్ని ధర్మబద్ధం గా ఆచరిస్తే అంతటా విజయమే..! భగవద్గీతను జీవితకాలం లో సర్వావస్థల్లో చదివి అర్ధం చేసుకోగలిగితే స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. మానసిక దౌర్బల్యం అనేక రూపాలలో పట్టి పీడిస్తుంది. ఎలక్షన్స్ దగ్గరపడుతుండగా మద్యం, డబ్బు, ఉచితాలు, పధకాల పేరుతొ సామాన్యుణ్ణి ప్రలోభపెడితే పదవిలోకి రావచ్చు. అనేది రాజకీయ నాయకుల మానసిక దౌర్బల్యమైతే.. ఆ పంచిపెట్టేది మన డబ్బే కదా… తీసుకుంటే తప్పేంటి ? అనేది సామాన్యుడి లాజికల్ మానసిక దౌర్బల్యం ..! డబ్బు మనదే.. కానీ ఇస్తున్నది ఏ రూపం లో అన్నది ముఖ్యం… ఇదీ ఒకరకం గా ‘ఓటుకి నోటు’ పథకమే.. దురదృష్టం ఏమిటంటే ఈ సామాన్యుడే ప్రభుత్వాలను నిర్ణయించేది. మనం ఏది ఆలోచించినా, ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ సందర్భం లోనే ‘ధర్మo’ అనేది గుర్తుకు రావాలి.. భగవద్గీతా బోధన పేరుతో ప్రతి ఒక్కరికీ ధర్మమార్గం అంటే ఏమిటో, హిందూయిజం గొప్పతనమేమిటో చెబుతూ ప్రజలను చైతన్యపరచాలి. కష్టం తో సంపాదించేదానికే విలువుంటుంది. ఉచితానికి విలువలేదు. ఇచ్చేవాడికీ తీసుకునే వాడికీ ఇద్దరికీ అగౌరవమే.. శారీరక, మానసిక, ఆర్ధిక, ప్రకృతి వైపరీత్యాలవల్ల దుర్బలులైన వారికే దానం చెయ్యాలి. ఇదే పాత్ర ఎరిగి దానం అంటారు. గీత లో ‘దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే..’ శ్లోకం ఈ విషయమే చెబుతుంది.. నైతిక విలువలను పెంపొందించడానికి భగవద్గీత కంటే మించిన జీవిత పాఠం మరొకటి లేదు. దీనిని బాల్యదశ నుండే పిల్లలకు నేర్పించండి.” అన్నారు ప్రసిద్ధ ఆధ్యాత్మిక గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. సంగారెడ్డి జిల్లా లోని నారాయణ్ ఖేడ్ గ్రామం లో ప్రసిద్ధ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ యలమంచి మోహన్ జోషి ఘనం గా నిర్వహించిన ‘మహారుద్ర సహిత శత చండీ యాగ పురస్సర చతుర్వేద స్వాహాకార సుదర్శన మహా యాగ ఉత్సవం’ సందర్భం గా మూడవ రోజున గంగాధర శాస్త్రి గీతా వైభవాన్ని గానసహితం గా వివరించారు. ‘శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసం లో విష్ణురూపుడైన శ్రీ కృష్ణుని గీతను చెప్పించడాన్ని శివకేశవులకు అభేదాన్ని చెప్పడమే’ అని గంగాధర శాస్త్రి అన్నారు. కర్మ ఫలాన్ని పరమాత్మకు అర్పిస్తూ, అనన్య భక్తి తో ఆరాధించడం వల్లే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందని అన్నారు. తల్లి తండ్రులు పిల్లలతో వీలైనంత సమయం గడపాలనీ, శ్రీరామాయణ, భారత, భాగవత, భగవద్గీతల వంటి మన ఆధ్యాత్మిక సంపద గురించిన అవగాహన కల్పించాలని గంగాధర శాస్త్రి కోరారు. తన సమక్షం లో భగవద్గీతా శ్లోక పఠనం చేసిన చిన్నారులను గంగాధర శాస్త్రి అభినందించి ఆశీర్వదించారు. లోక క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ యాగాలను శాస్త్రోక్తం గా నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ మోహన్ జోషి కి హృదయపూర్వకo గా నమస్సులందిస్తూ అభినందించారు. చివరిగా భక్తులతో శ్రీ గంగాధర శాస్త్రి చేయించిన కృష్ణ భజన తో ‘మా ఫంక్షన్ హాల్’ భక్తి తరంగాలతో నిండిపోయింది. కార్యక్రమ అనంతరం గంగాధర శాస్త్రి మార్వాడి గల్లీ లోని 200 ఏళ్ల క్రిందటి రాధాకృష్ణ మందిరాన్ని దర్శించారు. ఈ మందిర నిర్వాహకులు
శ్రీ నందకిషోర్ భంగ్ గంగాధర శాస్త్రి కి స్వాగతం పలికి రాధాకృష్ణ చిత్రాన్ని ఆవిష్కరింపజేసి అటుపై తాము నిర్వహిస్తున్న గోశాలను చూపించారు. ఈ సందర్భం గా రావి ఆకు పైన శ్రీ గంగాధర శాస్త్రి చిత్రాన్ని చిత్రించిన పటాన్ని శ్రీ సంతోష్ కుమార్ బహూకరించారు.
See Insights and Ads
All reactions:
88