‘తల్లి తండ్రులు బాల్య దశ నుండే పిల్లలకు భగవద్గీత ను నేర్పించడం ద్వారా – వారిలో నైతిక విలువలను పెంపొందించవచ్చు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నేర్పవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించవచ్చు.. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని, స్థితప్రజ్ఞతను అందించవచ్చు. మానసిక వత్తిడి లేని జీవితం గడిపే అవకాశం కలిగించవచ్చు. తద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. ఏపని చేసినా ధర్మబద్ధం గా చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఫలితం దైవానికి అర్పించి చెయ్యాలి. అహంకార రహితం గా చెయ్యాలి. నిస్వార్ధబుద్ధితో చెయ్యాలి. లోకహితం కోసం చెయ్యాలి. భవబంధాలకు అతీతం గా చెయ్యాలి.’ అని తరచూ తన ప్రసంగాలలో చెబుతూ ఉంటారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ఆయన ప్రసంగాలు విన్న స్ఫూర్తి తో తమ ఇద్దరు ఆడ పిల్లలకు భగవద్గీత నేర్పించాలనే లక్ష్యం తో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కు విచ్చేసారు కెనడా వాసులైన శ్రీ వినోద్ కుమార్ రెడ్డి, శ్రీమతి అపర్ణ దంపతులు…! శ్రీ గంగాధర శాస్త్రి తొలుత
‘వసుదేవ సుతం దేవం’ అంటూ చిరంజీవులు వికాసిని, వంశిక లతో కృష్ణ ప్రార్ధన చేయించి … అటుపై ‘సర్వధర్మన్ పరిత్యజ్య’ (గీత 18-66) శ్లోకం నేర్పించడం ద్వారా వారి భగవద్గీతా అధ్యయన మార్గాన్ని ఆశీర్వదించారు. ఆ చిన్నారుల స్పష్టమైన ఉచ్చారణను అభినందించారు. వారి తల్లితండ్రులను ఆశీర్వదించారు. “శుచీనాం శ్రీమతాం గేహే… అభిజాయతే …” అని పరమాత్మ చెప్పినట్టు – సత్కర్మ చేసుకుంటే ఇటువంటి సదాచారవంతులైన తల్లితండ్రుల కడుపున జన్మిస్తారని గంగాధర శాస్త్రి అన్నారు. శృతి శుద్ధం గా, శ్రావ్యం గా పాటలు పాడుతున్న చిరంజీవి వికాసిని కి ఆశీస్సులందించారు. వీరి కుటుంబాన్ని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కు చేర్చిన ప్రముఖ సినీ నటి జయలలిత, డాII చంద్రకాంత రెడ్డి లను అభినందించారు.