‘మానవ జాతి కి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం, ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి, తరింపజేసే కర్తవ్య బోధ భగవద్గీత. మనిషి మరణించాక కూడా కీర్తి కాయం తో బ్రతక గలిగే కర్మలను ఆచరించే స్ఫూర్తినివ్వగలిగే దివ్య సందేశం భగవద్గీత.. దీని విలువ తెలుసుకోండి.. చదివి అర్ధం చేసుకుని ఆచరించి తరించండి. కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన రెండు వరాల గురించి శ్రీ రామునితో చెప్పినప్పుడు రాముని ముఖం లో ఎలాంటి మార్పు లేకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణాన్ని సూచిస్తుంది. ఆతర్వాత యుగం లో శ్రీకృష్ణుడు కూడా ‘గీత’ ద్వారా మానవుడు ఎల్లప్పుడూ స్థితప్రజ్ఞుని లక్షణాలను కలిగి ఉండాలని చెబుతాడు. అందుచేత గీత నేర్చుకుంటే మన రాత మార్చుకున్నట్టే .. గీత గొప్పతనాన్ని తెలుసుకుని న్యూ జెర్సీ లో ఉన్న శాటన్ హాల్ యూనివర్సిటీ వారు తమ యూనివర్సిటీ లో MBA చదివే విద్యార్థులకు భగవద్గీతను ‘A JOURNEY TRANSFERMATION’ పేరుతో బోధిస్తున్నారు. ఇందుకు భారతీయులమైన మనం గర్వించాలి ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ..! ఆయనను – న్యూజెర్సీ, అమెరికా లోని ‘సాయి దత్త పీఠం కల్చరల్ సెంటర్’, ‘మన అమెరికా తెలుగు అసోసియేషన్’ (MATA), తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (TFAS) సంస్థలు ‘గీతారత్న’ బిరుదుతో ఘనం గా సత్కరించాయి.(16.9.2023 ) ఈ మూడు సంస్థలను కలుపుకుంటూ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారధి గా దశాబ్దాలుగా కళారంగానికి, ఆధ్యాత్మిక రంగానికి సేవలందిస్తున్న శ్రీ ఊటుకూరి ప్రసాద్ శ్రీ గంగాధర శాస్త్రి చే ‘గీతా గాన ప్రవచన’ కార్యక్రమాన్ని అత్యంత ఘనం గా నిర్వహించారు. ఈ మూడు సంస్థల అధ్యక్షులైన బ్రహ్మశ్రీ రఘు శర్మ, శ్రీ శ్రీనివాస్ గనగోని, శ్రీ మధు రాచకుళ్ల లు శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన వైభవాన్ని ప్రస్తుతించారు. ఆయన గాత్రం లో శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శించామని అన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరి చేతా చదివించే స్ఫూర్తి తో సాగిన అయన ప్రవచనం గతం లో ఎక్కడా తాము వినలేదని అన్నారు. మూడు గంటల పాటు సాగిన గీతా గాన గంగాప్రవాహం లో తాము ఓలలాడామని, ప్రవచనం ప్రారంభం నుంచి చివరి వరకూ, రాత్రి గం.10.30 దాటినా ఒక్కరు కూడా కదలకుండా ఆసక్తి గా వినడం తాము ఏ కార్యక్రమం లోనూ చూడలేదని అభిప్రాయపడ్డారు. ఇది తాము పొందిన ఒక దివ్యానుభూతి గా భావిస్తున్నామని అన్నారు. ఇందుకు నిర్వాహకుడైన శ్రీ ఊటుకూరి ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. శ్రీ దాము గేదల అభ్యర్ధన మేరకు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ సినీ గీయ రచయిత శ్రీ చంద్రబోస్, శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రయాణ విశిష్ఠతను కొనియాడుతూ ప్రత్యేకం గా రాసి ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని శ్రీ మధు రాచకుల్ల చదివి వినిపించగా మూడు సంస్థల ప్రతినిధులూ కలిసి శ్రీ గంగాధర శాస్త్రి కి బహూకరించారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి -శ్రీ చంద్రబోస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రఘు శర్మ తమ దేవస్థానం లో కొలువై ఉన్న దేవి దేవతలకు గంగాధర శాస్త్రి చేత ప్రత్యేక పూజలు చేయించి, శ్రీ వేంకటేశ్వరుని శేష వస్త్రాలతో సత్కరించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A