‘భగవద్గీతను ఉదహరిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి గారు చెప్పింది అర్ధం చేసుకుని ఆచరించగలిగితే స్వార్ధం లేని ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. స్ఫూర్తి దాయకం గా సాగిన ఆయన గాన ప్రవచనం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు మలేషియా లో ఆయన నాకు పరిచయం కావడం ఎంతో భాగ్యం గా భావిస్తున్నాను.’ అన్నారు మలేషియా లోని భారతీయ హై కమీషనర్ శ్రీ బి ఎన్ రెడ్డి – శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీమతి అర్చన దంపతులను సత్కరిస్తూ ! మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం ( EXPATS ) ఘనం గా నిర్వహించిన ఉగాది వేడుకలలో ( 4.5.2024 – మరియమ్మన్ బిల్డింగ్, సిటీ సెంటర్, కౌలాలంపూర్ ) గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం చేశారు. జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ భగవద్గీత లో చెప్పబడ్డాయనీ, ఇది మతాలకు అతీతమైన, అత్యున్నతమైన వ్యక్తిత్వ వికాస బోధ అని, ఇది కర్మ సిద్ధాంత గ్రంథమని, కర్మ,భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా మన కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో గీత తెలియజేస్తుందని గంగాధర శాస్త్రి అన్నారు. ఏపని చేసినా ధర్మబద్ధం గా చెయ్యాలని, త్రికరణ శుద్ధిగా చెయ్యాలని, ఫలితం పరమాత్మదని భావించి చెయ్యాలని, స్వార్ధ రహితం గా, లోకహితం కోసం చెయ్యాలని, తామరాకును నీటి బిందువు అంటని రీతిగా భవ బంధాలకు తావు లేకుండా కర్మలను ఆచరించాలని గీత చెబుతుందని అన్నారు. భగవద్గీత మత గ్రంధం కాదని, మానవీయ గ్రంథమని, మానసిక వత్తిడి లేని, ఆనందకరమైన జీవితాన్ని గంగాధర శాస్త్రి అన్నారు. ‘ప్రపంచం లో ఇతర మత గ్రంధాలు మానవులచేత రచించబడితే, భగవద్గీత సాక్షాత్తు తాను పరమాత్మ గా ప్రకటించుకుని, విశ్వరూప ప్రదర్శన ద్వారా నిరూపించుకున్న శ్రీకృష్ణ భగవానుడి ద్వారా బోధించబడిన మానవ వికాస గీత …! ఇందులోని ప్రతిశ్లోకమూ మంత్రతుల్యమే…గీత ఒక్కటి చదివితే సర్వశాస్త్రాల సారం చదివినట్టే…!కాబట్టి తల్లి తండ్రులారా … మీరు గీత నేర్చుకుని రోజుకొక్క శ్లోకం మీ బిడ్డలకు తాత్పర్యసహితం గా నేర్పించండి. భారత దేశానికి దూరమైనా భారతీయ సంస్కృతికి దూరం కావద్దు. 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మదేవుని పగటి కాలాన్ని కల్పం అంటారు. అది సృష్టి కాలం. దీనినే యుగాది లేదా ఉగాది అంటారు. ఇది క్రోధి నామ సంవత్సరం.. చైత్రమాసం… ఉత్తరాయణం … వసంత ఋతువు.. పాడ్యమి తిథి…! చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని పుట్టిన రోజు… శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని పుట్టిన రోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత బోధించబడిన రోజు…! తిథులు. వారాలు, నక్షత్రాలు ఇవన్నీ మన పిల్లలకు నేర్పించాలి. బయట ఏ భాష అయినా నేర్చుకోండి . ఇంట్లో మాత్రం మీ పిల్లలతో తెలుగు లోనే మాట్లాడండి. మన భారత దేశం గొప్పతనాన్ని పిల్లలకు చెప్పండి. మన సంస్కుతీ సంపదని నిజమైన వారసత్వ సంపదగా తరువాత తరాలకు పంచిపెట్టండి. ‘ అన్నారు గంగాధర శాస్త్రి. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనం గా నిర్వహించిన శ్రీ అనిల్ కుమార్, శ్రీ కంచర్ల ఆనంద్, శ్రీ ఇంద్ర నీల్, శ్రీ నాగరాజ్, శ్రీ సుబాని, శ్రీ కిరణ్, శ్రీ మస్తాన్ తదితరులను శ్రీ గంగాధర శాస్త్రి అభినందించారు. ‘మాతెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతం తో EXPATS ఉగాది ఉత్సవాలు ప్రారంభం కావడం విశేషమని, తెలుగు రాష్ట్రాలు విడి పోయాక తెలుగు జాతీయ గీతం ‘మా తెలుగు తల్లి కి మల్లెపూదండ’ అదృశ్యమైపోయిందని, తిరిగి మలేసియా లో ప్రత్యక్షమయినట్టనిపించిందని, మలేషియా లో ఉన్న తెలుగు వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే స్థాయికి EXPATS ఎదగడం హర్షణీయమని గంగాధర శాస్త్రి అన్నారు. క్రోధి నామసంవత్సర ఉగాది కార్యక్రమాలను జ్యోతి ప్రకాశనం తో ప్రారంభించి అటుపై తెలుగు జాతీయ గీతాన్ని ఆలపించిన చిన్నారులను, శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించిన కళాకారులను ఆయన సత్కరించి ఆశీర్వదించారు.
See insights and ads
All reactions:
4040