మానవ జీవితం లో జననం నుంచి మరణం వరకు మనకు తెలియకుండా చేసే శారీరిక, వాచిక, మానసిక దోషాలతో కూడిన కర్మలనుండి, మాతృ, పితృ దోషాలనుండి విముక్తుల్ని చేయగలిగిన పవమాన ప్రయోగ హోమాన్ని ఉప్పల్, హైదరాబాద్ లోని శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్టు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి అతిథి గా హాజరయ్యారు. యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యం కార్యమేవతత్/యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషీణామ్ (గీత – 18-5) అని గీతాచార్యుడు చెప్పినట్టు మానవ జన్మను పావనం చేసే యజ్ఞము, దానము, తపస్సు అనే మూడు సత్కర్మలను ప్రతిమానవుడూ ఆచరించవలసిందేనని గంగాధర శాస్త్రి అన్నారు. మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు. గో సంరక్షణ తో పాటు యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ లోకశ్రేయస్సును కాంక్షించే శ్రీ శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్టు సేవలను కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కుప్పా శ్రీనివాస స్వామి ని అభినందించారు. ఈ వ్యవస్థ కు చేయూతనందించడం ద్వారా హైందవ సంస్కృతిని, ధర్మాన్నీ కాపాడవలసింది గా భక్తులను, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖను కోరారు. అనంతరం గంగాధర శాస్త్రి దంపతులు గో సేవలో పాల్గొన్నారు.