‘లౌకికమైనవి చూస్తేనే నమ్మగలం ….ఆధ్యాత్మికమైనవి నమ్మితేనే చూడగలం … పరమాత్మను తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, ముందు నమ్మకం ఉండాలి… అటుపై అర్హత ఉండాలి… యోగమాయ చేత ఆవరించబడి ఉండడం వల్ల పరమాత్మ కనిపించడు… అనన్యమైన భక్తి చేత మాత్రమే ఈ మాయను దాటి పరమాత్మను చేరవచ్చు. పరమాత్మే పరమ గతి అని నమ్మాలి. మనం చేసే సమస్త కర్మల ఫలితం పరమాత్మదే అని భావించాలి. ఇంద్రియ విషయాలపట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. సమస్త ప్రాణుల పట్ల ప్రేమభావం కలిగి ఉండాలి… ఇవే పరమాత్మ అనుగ్రహం పొందాలనుకునే వారికి ఉండాల్సిన ప్రధానమైన అర్హతలు.’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ’ వారి ఆధ్వర్యం లో, కడ్తాల్ లో 40 వేలమంది ప్టేక్షకుల సమక్షం లో వైభవంగా జరిగిన ‘పత్రీజీ ధ్యాన మహా యాగం’ కార్యక్రమం లో (24.12.2023) శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ‘ఏపని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ధర్మ బద్ధం గా చెయ్యాలి. స్వార్ధ రహితం గా చెయ్యాలి. లోక హితం కోసం చెయ్యాలి. ఏ పనినైతే ఎంచుకున్నామో ఆ పనికి మనమే చిహ్నమయ్యేట్టు చెయ్యాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేట్టు చెయ్యాలి. దైవార్పణ బుద్ధి తో చెయ్యాలి. అలా కర్మలను ఆచరించేవాడే మరణాన్ని జయించగలడు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుహు.. శ్లోకం అదే చెబుతుంది.. పుట్టిన వానికి మరణము తప్పదు.. అని చెబుతూ నువ్వు శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది.. మరణించిన వానికి జన్మము తప్పదు.. అంటూ పునర్జన్మ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ జననమరణాల మధ్యలోని జీవిత ప్రయాణాన్ని లోకం గుర్తుపెట్టుకునేలా సాగించాలి.’ అన్నారు గంగాధర శాస్త్రి. నిలకడ లేని చంచలమైన చిత్తం ఏ ఏ విషయాల లో సంచరిస్తుంటుందో, ఆయా విషయాలనుండి దానిని నియంత్రించి ఆత్మయందే స్థిరం గా ఉంచడం కోసం సాధన చెయ్యాలి… ఇదే ధ్యాన యోగం..ఇలా చేయగలిగిన ధ్యాన యోగ సాధకుడే పత్రీజీ …! ధ్యానం గురించి పూర్తి అవగాహన పొందాలంటే భగవద్గీత లో ఆరవ అధ్యాయం “ఆత్మ సంయమ యోగం’ చదవండి’ అన్నారు గంగాధర శాస్త్రి. ‘ఈ ప్రపంచం లో లౌకిక, ఆధ్యాత్మిక విషయాల గురించి సమగ్రం గా చెప్పగలిగే ఒకే ఒక్క దైవ గ్రంథం, వ్యక్తిత్వవికాస గ్రంథం, ధర్మ గ్రంథం, మానవీయ గ్రంథం, మతాలకు అతీతమైన గ్రంథం…..ఒక్క భగవద్గీత మాత్రమే..! దీనిని బాల్య దశనుండే పిల్లలకు నేర్పించి మనదైన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. అలా కాపాడుకునే ప్రయత్నం బలంగా చేయకపోవడంవల్లే కన్వర్షన్ పేరుతో ఒక మతం, లవ్ జిహాద్ పేరుతో మరో మతం- హిందూ మతాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయి…”అంటూ హెచ్చరించారు గంగాధర శాస్త్రి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, అందరూ భగవద్గీత చదవాలని సూచించారు. ఘంటసాల, అన్నమయ్య గీతాలను ఆలపించారు. బ్రహ్మమొక్కటే కీర్తన ఆలపిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆనంద నృత్యాలు చేశారు. కొన్ని భగవద్గీత శ్లోకాలను ప్రేక్షకుల చేత చెప్పిస్తూ, భగవద్గీతను చదివి ఆచరిస్తామని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. తనకి సంపూర్ణ భగవద్గీత పాడాలని సూచించింది భారవే అని గంగాధర శాస్త్రి గుర్తుచేసుకున్నారు. చివరన పిరమిడ్ సొసైటీ చైర్మన్ శ్రీ కే విజయభాస్కర రెడ్డి – శ్రీ గంగాధర శాస్త్రి దంపతులను సత్కరించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A