‘ప్రపంచం లో ప్రతి ఒక్క మతమూ తమది జీవన విధాన మార్గమనే చెబుతుంది… హిందూ మతం పేరుతో పిలువబడే సనాతన ధర్మం మాత్రం ఉత్తమ జీవన విధాన మార్గమని గుర్తించాలి. మిగతా మత గ్రంథాలు వ్యక్తు ల చేత రచించబడినవి. సనాతన ధర్మ సారాంశమైన ‘భగవద్గీత’ ఆ పేరులోనే చెప్పబడినట్టు గా సాక్షాత్తు భగవానుని ముఖపద్మం నుండి వెలువడిన కర్తవ్యోపదేశం గా గుర్తెరగండి. ఇది వ్యక్తి ఆరాధనా గ్రంథం కాదు. సిద్ధాంత గ్రంధము. సహేతుకం గా, విశ్లేషణాత్మకం గా పరిశీలిస్తే ఇది సర్వజన ఆమోదయోగ్య మైన బోధ అని తెలుస్తుంది.. ఇది ఆచరణకు మిక్కిలి సులభము… శాశ్వతము. అందుకే గీత ను అధ్యయనం చేయండి. అర్ధం చేసుకోండి. ఆచరించండి. సత్ఫలితాలను పొందండి.. బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించండి. జీవితాన్ని ఎలా అందం గా, ఆనందం గా, ఆదర్శవంతం గా, స్ఫూర్తి దాయకం గా, మానసిక వత్తిడి లేకుండా గడపాలో తెలియజెప్పండి. ఉత్తమ సమాజాన్ని నిర్మించండి.” అన్నారు. గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి కాన్సస్ సిటీ ( అమెరికా )లో (11.9. 2023) న శ్రీమతి సరితా పాండురంగారావు గృహం లో ఏర్పాటైన సత్సంగం లో పాల్గొని గీతా సారం పైన గాన ప్రవచనం చేశారు. సరితా పాండురంగారావులు తమ కుమార్తె చిII శ్రీనిధి కి 5 వ తరగతి నుండే కీర్తనలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించడాన్ని అభినందిస్తూ ఆశీర్వదించారు. ఇక్కడి తెలుగు వారికి పెద్ద దిక్కుగా ఉంటూ భారతీయ సంస్కృతికి చేయూతనందిస్తున్న డాII రంగినేని రాజ గోపాల్, శ్రీమతి అరుణ లకు గంగాధరశాస్త్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. హిందూ దేవాలయం ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఈ సత్సంగానికి హాజరయ్యారు. ఆ మరు రోజు శ్రీ గంగాధర శాస్త్రి శ్రీమతి రాధిక, శ్రీనుకుమార్ గాదిరాజు గృహం లో అతిధ్యం స్వీకరించారు.


































