ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని “మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం” “గౌరవ డాక్టరేట్ ” ప్రకటించింది.
భారతీయ సంస్కృతి ని, సంస్కృత విద్యను పరిరక్షించడం లో భాగంగా – పరిశోధనాత్మక కృషి చేసి, భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితంగా గాన చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి, అంతటితో తన భాధ్యత తీరిపోయిందని భావించకుండా – స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు శ్రీ గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ ” ను ప్రకటిస్తున్నట్లు పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి .విజయకుమార్ తెలియజేసారు.
మే 24, 2023 ఉదయం 11 గంటలకు కోఠీ మార్గ్ లోని విక్రం కీర్తి మందిరం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్ ) లో జరిగే ‘మహర్షి పాణిని సంస్కృ త్ ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం’ నాల్గవ స్నాతకోత్సవం లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించనున్నట్లు రిజిస్ట్రార్ డాII దిలీప్ సోని తెలిపారు.
ఈ సందర్భం గా గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఎల్.వి. గంగాధర శాస్త్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ –
మధ్యప్రదేశ్ గవర్నర్, ఆ రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాల కులపతి అయిన శ్రీ మంగుభాయ్ పటేల్ కు, మహర్షి పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విజయ్ కుమార్ సి.జి కు, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు, ఉన్నత విద్యా శాఖా మంత్రి శ్రీ మోహన్ యాదవ్ లకు వినమ్ర పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
కాగా – ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా తాను 17 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్, తెలుగువాడైన శ్రీ పి. మురళీధరరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తనకీ గౌరవం దక్కిందని, అందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు.
సంస్కృత వ్యాకర్త అయిన ‘పాణిని మహర్షి ‘ పేరు తో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందడం సముచితంగా, అదృష్టంగా భావిస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. తనకు లభించిన ఈ గౌరవం – తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, 17 ఏళ్ళ తన భగవద్గీతా ప్రయాణం లో సహకరించిన భార్యాబిడ్డలకు, మార్గ నిర్దేశకత్వం చేసిన గురువులకు, సాంకేతిక నిపుణులకు, ప్రపంచం నలుమూలల నుండి చేయూతనందించిన భగవద్గీత అభిమానులకే చెందుతుందని, తాను కేవలం శ్రీ కృష్ణుడు ఉపయోగించుకున్న సాధనం మాత్రమేనని గంగాధర శాస్త్రి అన్నారు.
స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘భగవద్గీత’ పునాదుల పై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా గీతా ప్రచారం తో పాటు –
* పేద విద్యార్థులకు, అనాధ బాలలకు, వికలాంగులకు , వృద్ధాశ్రమాలకు చేయూత
* గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ
* ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ
వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి చెప్పారు.
ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవా క్షేత్రంగా తెలుగునాట ‘ భగవద్గీతా యూనివర్సిటీ ‘ స్థాపనే పరమ లక్ష్యం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కృషి చేస్తుందని చెబుతూ – మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథం ‘భగవద్గీత’ ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించాలని కోరారు.
గతం లో శ్రీ గంగాధర శాస్త్రి సినిమా జర్నలిస్టు గా, సినీ నేపధ్య గాయకుడుగా, సంగీత కార్యక్రమాల సమర్పకుడు గా, ప్రయోక్త గా కొనసాగుతున్న తరుణం లో పరివర్తన చెంది, అప్పటి వరకూ తాను చేసిన జీవిత ప్రయాణపు దిశను మార్చుకుని ఆధ్యాత్మిక మార్గం లోకి ప్రవేశించారు. తెలుగు వాడైన ఘంటసాల కొంతమేరకు గానం చేసిన భగవద్గీతను సంపూర్ణం గా గానం చేసి, ఆయనకు అంకితమిచ్చి గురు ఋణం చెల్లించుకున్నారు. ‘భగవద్గీత జీవన గీత – మరణ గీత కాదు.’అన్న నినాదం తో సాగుతున్న గంగాధర శాస్త్రి కృషిని శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామి, దివంగత రాష్ట్రపతి డా II ఏ పి జె అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్రమోడీ, శ్రీ రాంనాథ్ కోవింద్ వంటి వారు ప్రశంసించారు. గతం లో – గీత ద్వారా గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ తో సత్కరించింది.