ప్రపంచం లో అత్యంత బలమైన మతం హిందూమతమని, కానీ దురదృష్టవశాత్తు హిందువులే అత్యంత బలహీనం గా ఉన్నారని, తమ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం లో వెనకబడి ఉన్నారనీ, అందుకే హిందువుల పైన, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయని, ఇతర మతస్థులు కన్వర్షన్స్ పేరుతో హిందువుల ఉనికి ని నాశనం చేస్తున్నారని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి పార్టీ నేత శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యం లో హన్మకొండ లో జరిగిన మహాశివరాత్రి వేడుకలలో ఆయన గీతా గాన ప్రవచనం చేశారు. హిందూమతం పట్ల ప్రతి ఒక్క హిందువూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఇటు హిందూయిజం, అటు హిందువూ ఇద్దరూ బలోపేతం అవుతారని, ఇందులో భాగం గా బాల్యదశ నుండే భగవవద్గీతాధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. మన తల్లితండ్రులను, ఆరోగ్యాన్ని , ఆస్తులను కాపాడుకున్నట్టే హిందూధర్మాన్ని కాపాడుకోవాలని, ఇది ఒక్కటే సార్వజనీనమైన, ఉత్తమజీవనవిధాన మార్గమని గంగాధర శాస్త్రి అన్నారు. స్వార్థరహిత ఉత్తమసమాజ నిర్మాణం కోసం మన బిడ్డలను గీతా సైనికులుగా తయారుచేయాలని, సర్వ శాస్త్రాల సమాహారమే గీత అని, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టేనని … సమాజం చేయూతతో ఎదిగి తిరిగి సమాజానికి ఇవ్వగలిగినప్పుడే దైవానుగ్రహానికి పాత్రులం కాగలమని అన్నారు. మనం ఆరాధించే దైవాలలో ప్రతి దైవానికి ఒక తత్వం ఉందని, దాన్ని అర్ధం చేసుకోగలిగినప్పుడే మానవ జీవితం సార్ధకమవుతుందని, నిరాడంబరత్వం, సర్వప్రాణులపట్ల సమానత్వం, లోకహితం కోసం కర్మలనాచరించడం, అధర్మాన్ని మసిచేయడం, అనన్య భక్తి కి వశుడు కావడమే శివతత్వమని అన్నారు. మతం తల్లి లాంటిదని, మతమార్పిడి అంటే తల్లిని మార్చడమనే నీచమైన సంస్కృతికి నిదర్శమని గమనించి మాతృ మూర్తిని, మాతృ భూమిని, మాతృ భాషను, మాతృ సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రపంచం లోని సర్వమానవులను, సర్వప్రాణులను, సర్వ మతాలను సమానం గా చూసే భారతీయుల సంస్కారానికి స్ఫూర్తి భగవద్గీత లోని ‘ఆత్మౌపమ్యేన సర్వత్ర’ ( 6-32 ) శ్లోకమేనని అన్నారు.ప్రతి హిందువూ ఏ దేవాలయానికి వెళుతున్నాడో ఆ దేవతా ప్రార్థన ఒక్క శ్లోకమైనా నేర్చుకుని తమ బిడ్డలకు నేర్పించడం ద్వారా హిందువుగా తమ ఉనికిని పటిష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు..