అమెరికా తిరుపతి గా ప్రసిద్ధి గాంచిన పిట్స్ బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్ధాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా గాన ప్రవచనం చేశారు.(1.9.2023) కర్మ భక్తి జ్ఞాన మార్గాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గం లో నడిపించడానికి చేసిన కర్తవ్య బోధే భగవద్గీత అని శ్రీ గంగాధర శాస్త్రి అన్నారు. ఇది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన బోధ కాదని సకల మానవాళికి ఉపయుక్తమైనదని అన్నారు. భగవద్గీత చదవాల్సింది వృద్ధాప్యం లో కాదని బాల్యదశ నుంచే అని, చదివి, అర్ధం చేసుకుని, ఆచరించి, ప్రచారం చేయడం భగవద్గీత పరమార్ధమని భావించాలని అన్నారు. కర్మ ను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుందన్నది గీతోపదేశం పరమార్ధమని గంగాధర శాస్త్రి అన్నారు. విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలను గానం చేస్తున్నప్పుడు గంగాధర శాస్త్రి తో పాటు ప్రేక్షకులు కూడా చెమర్చిన కళ్ళతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ ట్రస్టీ శ్రీ కొత్తపల్లి శ్రీనివాస్ కి గంగాధర శాస్త్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెలిజియస్ ఛైర్ శ్రీ కళ్యాణ్ స్వాగత వచనాలు పలుకగా, ఎక్సిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీ ప్రభానంద్ యడ్ల మాట్లాడుతూ – ఒక గాయకుడు భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితం గా 9 ఏళ్ల పాటు గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి, అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, భగవద్గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేయడం భారతీయ సంగీత చరిత్రలో ఇదే ప్రథమమని, శ్రీ గంగాధర శాస్త్రి తెలుగువాడు కావడం గర్వకారణమని చెబుతూ వేదికకు ఆహ్వానించారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ గోపాల భట్టర్, శ్రీమాన్ సముద్రాల వెంకటాచార్యులు, ఆలయ బోర్డు సభ్యులతో కలిసి శ్రీ గంగాధర శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. తొలుత ఆలయ మర్యాదలతో కమిటీ సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి కి స్వాగతం పలికి శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భం గా సౌండ్ ఇంజినీర్ శ్రీ కార్ల్ ను గంగాధర శాస్త్రి ప్రత్యేకం గా అభినందించారు. కార్యక్రమ ప్రారంభం లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A