‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార కార్యక్రమాల కోసం అమెరికా లో పర్యటిస్తూ శాన్ డియాగో కు చేరుకున్నారు. ఆయనను ఆహ్వానించిన ‘గీతా ఫౌండేషన్’ అమెరికా శాఖ అధ్యక్షులు డాII రాధాకృష్ణ తమిరిసా, గీతా బంధువు శ్రీ ప్రవీణ్ పురాణం తో కలిసి ఆ రోజు (11.8.2023) లహోయా సముద్రపు ఒడ్డున భగవద్గీతా కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆమార్గం లో ఒక బెంచ్ మీద కూర్చుని, దూరం నుంచి తెల్ల చొక్కా తెల్ల లుంగీ ధరించిన గంగాధర శాస్త్రి ని గమనిస్తున్న ఒక అమెరికన్ యువకుడు గంగాధర శాస్త్రి దగ్గరకు వెళ్లి ‘నమస్తే … నా పేరు అలెక్స్ .. శాండియాగో లోని ఒక స్టార్ హోటల్ లో సీనియర్ షెఫ్ గా పనిచేస్తున్నాను. నాకు కాబోయే భార్య జిల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ …ఎందుకో మిమ్మల్ని చూడగానే పరిచయం చేసుకోవాలని అనిపించింది. మీరు ఇండియన్ కదూ.. నాకు ఇండియన్ స్పిరిట్యువాలిటీ అంటే చాలా ఇష్టం..’ అంటూ పరిచయం చేసుకున్నాడు. అతనితో గంగాధర శాస్త్రి కాసేపు సంభాషించారు. భగవద్గీత సారాంశం వివరించారు. ఈ లోపు డాII రాధాకృష్ణ, శ్రీ ప్రవీణ్ లు మరుసటి రోజు జరిగే గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం కార్యక్రమానికి ఆహ్వానించారు. అలెక్స్ తనకు కాబోయే శ్రీమతి జిల్ తో శివ విష్ణు దేవాలయానికి వచ్చాడు. శ్రీ ప్రవీణ్ పురాణాన్ని అనువదించమని కోరి మరీ రెండు రోజుల గీతా గాన ప్రవచన కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తి శ్రద్ధలతో ఆనందించారు అలెక్స్, జిల్ దంపతులు.. గంగాధర శాస్త్రి భజనలు చేయించినప్పుడు అలెక్స్ దంపతులు భక్తి పారవశ్యం తో కరతాళ ధ్వనులతో భజనలు చేశారు. కార్యక్రమం మొత్తాన్ని జిల్ తన కెమెరా లో భద్రపరుచుకుంది… ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలలో ఆమె కనిపిస్తున్న ఫోటోలు తప్ప మిగిలినవన్నీ ఆమె తీసినవే… ఎక్స్ప్రెషన్స్ ని క్లిక్ చేయడం తన ప్రేత్యేకత అని చెప్పింది జిల్ … రెండురోజుల ప్రవచన కార్యక్రమం అనంతరం గంగాధర శాస్త్రి అలెక్స్ దంపతులను దుశ్శాలువతో సత్కరించి పండ్లు అందించారు. ఆ సమయం లో అలెక్స్ అశ్రునయనాలతో భావోద్వేగానికి గురయ్యాడు. ‘నన్ను మీ శిష్యుడు గా స్వీకరిస్తారా.. నేను మీతో భారత దేశానికి వచ్చి సేవచేయడానికి సిద్ధం గా ఉన్నాను. నేను హిందువు గా మారిపోతాను ‘ అని అభ్యర్ధించాడు. అందుకు గంగాధర శాస్త్రి… ” మత మార్పిడులు మా అభిమతం కాదు. మతం తల్లి లాంటిది. మతం మారే ప్రయత్నం తల్లిని వదిలిపెట్టడం లాంటిది. అది అమానుషమైన చర్య. హిందువులు ఇలాంటి అకృత్యాలకు ఒడిగట్టరు … మనమందరం ఒక్కటే. మన అందరికి ఒక్కడే’ అనేది హిందూ ధర్మ సిద్ధాంతం.. మాది మతం కాదు. ధర్మం .. మీరు అమెరికా లోనే ఉండండి. మీ మాతృభూమిని వదిలిపెట్టొద్దు. ఆదర్శ దంపతులుగా మెలగండి. భారతీయులు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళండి.. ఆధ్యాత్మిక సారాన్ని అర్ధం చేసుకోవడానికి, అటుపై ఆచరించడానికి ప్రయత్నించండి. మీరు సంపాదించే ధనాన్ని కొంత సమాజ సేవకు ఖర్చుపెట్టండి. మీ పిల్లలను దైవ భక్తి, దేశభక్తి కలిగి ఉండేలా, కుటుంబ వ్యవస్థ పై గౌరవం పెరిగేలా పెంచండి… సమాజానికి స్ఫూర్తి అందించేలా ఎదగండి.” అంటూ ఆశీర్వదించారు. మొత్తంమీద శాండియాగో లో జరిగిన శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచన కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారి మధ్య అమెరికా జంట అలెక్స్, జిల్ లు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.