పమనిషి మరణించే వరకు జీవించడం గొప్పవిషయం కాదని, సమాజానికి తాను చేసిన మంచి పనులద్వారా మరణించాక కూడాజీవించడమే గొప్పవిషయమని, దీనినే మరణాన్ని జయించడమని, ఆవిధం గా ఉత్తమ జీవితాన్ని గడిపి తద్వారా కీర్తిని శేషం గా మిగుల్చుకుని వెళ్లిపోయిన గొప్ప వ్యక్తే దివంగత శ్రీ సిద్ధారెడ్డి జనార్దన రెడ్డి అని – భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి అన్నారు. నెల్లూరు సమీపం లోని గూడూరు కు చెందిన ‘సంస్కృతి సమ్మేళనం’ పూర్వ అధ్యక్షులు కీIIశేII సిద్ధారెడ్డి సంస్మరణార్ధం ఆయన సతీమణి శ్రీమతి ఇంద్రసేనమ్మ, ఆమె సోదరుడు శ్రీ ధనంజయ రెడ్డి, ఆమె కుమారుడు శ్రీ సుధీర్ రెడ్డి, కోడలు శ్రీమతి ప్రణతి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీతా గాన ప్రవచనం చేస్తూ – నైతిక విలువలతో కూడిన, ధర్మబద్ధమైన, స్వార్ధ రహిత జీవితం ఎలా గడపాలో భగవద్గీత తెలియ జేస్తుందని అన్నారు. జీవులకు జనన మరణ రూప సంసార చక్రాన్ని తప్పించుకోలేమని, దానిని మనం తప్పించుకోలేమని, ఆ మధ్యలో ఉన్న జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉందని, దానిని ఆదర్శవంతం గా, స్ఫూర్తిదాయకం గా, నిస్వార్ధం గా, లోకహితం కోసం గడపాలని అన్నారు. ఇది మతగ్రంధం కాదని, జీవితం ఎలా గడపలో తెలియజేసే నిఘంటువుని, కాబట్టి బాల్యదశ నుండే భగవద్గీతను నేర్చుకుని, ఇతరులకు నేర్పించే బాధ్యత మనపై ఉందని అన్నారు. భగవద్గీత జీవన గీత అని- దానిని వ్యక్తుల మరణ సమయాలలో ప్రదర్శించి ‘మరణ గీత’ అనే భావనను కలగజేయరాదని గంగాధర శాస్త్రి అన్నారు. అనంతరం సిద్ధారెడ్డి కుటుంబం శ్రీ గంగాధర శాస్త్రి ని ఘనం గా సత్కరించి ఆశీస్సులు పొందింది.