‘గర్భం లో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు.. తల్లిగర్భంలోనే విష్ణు తత్వం విని ప్రహ్లాదుడు పరమ వైష్ణవ భక్తుడైనట్టు … తల్లి గర్భం లో ఉన్నప్పుడే శిశువుకు భగవద్గీతను వినిపిస్తే – ఈ లోకం లోకి వచ్చాక లౌకిక మైన కర్మలను ఆచరిస్తూనే ఆధ్యాత్మ జ్ఞాని అవుతాడు. భవబంధాలకు తావు లేకుండా కర్మలను ఆచరించ గలుగుతాడు. మానసిక వత్తిడి లేని ఆరోగ్యవంతుడు గా జీవితం కొనసాగిస్తాడు. నిస్వార్ధం గా లోకహితం కోసం కర్మలను ఆచరిస్తాడు. తనని శాశ్వతుడిని చేసే కర్మల పట్ల ఆసక్తి చూపుతాడు. లక్ష్యం చేరుకోవడం కోసం చేసే ప్రయాణాన్ని అనుక్షణం ఆస్వాదించగలుగుతాడు. భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునుడి కి ఉపదేశించిన ప్రతీ శ్లోకమూ సకల మానవాళి కి ఉపయోగపడే ఒక్కో జీవిత పాఠం … ! అందుకే కనీసం బాల్యదశ నుండైనా మీ పిల్లలకు భగవద్గీతామృతాన్ని రుచి చూపించండి.. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. సందేహం లేదు.’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అద్దం ముందు నిలబడితే మనం భౌతికం గా ఎలా ఉంటామో మాత్రమే తెలుస్తుంది. భగవద్గీత అనే అద్దం ముందు నిలబడితే మన తత్త్వ మేమిటో తెలుస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టి, చేసే కర్మలను బట్టి మనం సాత్త్వికులమో, రాజసికులమో, తామసికులమో అర్ధమవుతుంది. మన తప్పుటడుగుల్ని సరిచేసి, మనల్ని మనం ఉద్ధరించుకునే అవకాశం కల్పిస్తుంది గీత..!’ అన్నారు గంగాధర శాస్త్రి. నిత్యజీవితానికి భగవద్గీత ను అన్వయిస్తూ సాగిన ప్రవచనం ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. అమెరికా లోని కాన్సస్ సిటీ లోని “తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ” వారు ఘనం గా నిర్వహించిన (10.9.2023) కార్యక్రమంలో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేసిన స్ఫూర్తిదాయకమైన గీతా గాన ప్రవచనాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై విన్నారు. ఈ సందర్భం గా అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి గాన ప్రవచనా సరళి పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ”గీతా గాన కౌస్తుభ” బిరుదు తో ఘనం గా సత్కరించారు. కార్యక్రమానికి రూపకల్పన చేసి, నడిపించిన తీరు అద్వితీయమని శ్రీ గంగాధర శాస్త్రి అసోసియేషన్ సభ్యులను ప్రశంసిస్తూ – బోర్డు చైర్ పర్సన్, శ్రీ అమ్మిరెడ్డి శ్రీధర్, ప్రెసిడెంట్ శ్రీ నరేంద్ర దుద్దెల, వైస్ ప్రెసిడెంట్ శ్రీ చంద్ర శేఖర్ యక్కలి, బోర్డు సభ్యులు శ్రీ శ్రీనివాస్ పెనుగొండ, శ్రీ శివ తియ్యగూర, కోశాధికారులు శ్రీ ఫణి కుమార్, శ్రీ ఉదయ్, శ్రీమతి శ్రావణి మేక, శ్రీ విశేష్ రేపల్లె, శ్రీమతి సరిత, పాండురంగ, శ్రీమతి రాధికా గాదిరాజు, శ్రీనుకుమార్, లకు కృతజ్ఞతలు తెలియజేసారు. తమ తెలుగు భగవద్గీత కు చేయూత నందించడమే గాక, ఆత్మీయ ఆతిధ్యం అందిస్తూ ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తలు గా వ్యవహరించి, ఘన విజయం చేకూర్చిన వదాన్యులు శ్రీ రాజగోపాల్, శ్రీమతి అరుణ రంగినేని లకు డా గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు. కార్యక్రమానికి ముందు హిందూ దేవాలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు మహేంద్రాడ నిర్వహణలో హిందూ దేవాలయం లోని శ్రీవెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై గణపతి కీర్తన తో పాటు, భగవద్గీత శ్లోకాలు గానం చేసిన చిII శ్రీనిధి ని గంగాధర శాస్త్రి అభినందన పూర్వక ఆశీస్సులందించారు.










































