కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ – దక్షిణాది కళలను, కళాకారులను ప్రోత్సహించడం కోసం ‘సంగీత నాటక అకాడమి’ దక్షిణభారతీయ కేంద్రాన్ని – పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ని శిల్పకళావేదిక లో జరిగిన (12. 2. 2024) ఒక కార్యక్రమం లో లాంఛనం గా ప్రారంభించింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా గీతా గాన ప్రవచన ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు. ఈ SNA కేంద్రం లో నిర్మించే ఆడిటోరియానికి ఘంటసాల శత జయంతి నేపధ్యం లో ‘గానగంధర్వ ఘంటసాల కళా మండపం’ అనిపేరు పెట్టడం బహుధా హర్షణీయమని, ఘంటసాల ను ‘తెలంగాణ’ ప్రభుత్వాలు మరిచిపోయాయనే అనుమానం సర్వే సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణం లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి చొరవతో జరుగుతున్న ఘంటసాల ఆడిటోరియం నిర్మాణం – ఇటు ఘంటసాల పాటను, ఆయన అభిమానులను గౌరవించినట్టయ్యిందని గంగాధర శాస్త్రి అన్నారు. కేవలం ఆడిటోరియానికి ఘంటసాల పేరు పెట్టడం తో పరిమితం కాకుండా, ప్రతి సంవత్సరం ఘంటసాల పాటల పోటీలను నిర్వహించి, తగిన బహుమతులతో గాయకులను ప్రోత్సహించవలసిందని సూచించారు. అంతేకాక ‘సంగీత నాటక అకాడమీ’ సంగీత విభాగం లో ఇచ్చే అవార్డులు కూడా ఘంటసాల పేరుతోనే ఇస్తే బావుంటుందని గంగాధర శాస్త్రి అన్నారు. ” ఘం.. ట.. సా.. ల..! అనే నాలుగు అక్షరాలు నాలాంటి వేలాది మంది గాయకులకు చతుర్వేదాలతో సమానమైనవి. తెలుగు సినిమా రంగానికి ఆయన చిరస్మరణీయులు. నాకు ఆయన ప్రాతస్మరణీయులు. ఘంటసాల గారి గానం తోనే జీవితమంతా ముడిపడి ఉన్న గాయకుడు బహుశా నేనొక్కడినేమో అనిపిస్తుంది. మా నాన్నగారి ద్వారా నేను విన్న తొలి పాట – ఘనా ఘన సుందర, కాలేజీ రోజుల్లో నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ బహుమతి తెచ్చిపెట్టిన పాట – శివశంకరి, నాకు ‘ఈనాడు’ పత్రికలో రామోజీ రావు గారు జర్నలిస్టు గా ఉద్యోగం ఇవ్వడానికి కారణమైన పాట – పాడుతా తీయగా, సినీ నేపధ్య గాయకుడుగా శ్రీ దాసరినారాయణ రావు గారు అవకాశం ఇవ్వడానికి దోహదం చేసింది – పుష్పవిలాపం, భాషపై పట్టు నేర్పింది – శ్యామలా దండకం, నన్ను ఎన్ టి ఆర్, ఏ ఎన్నార్, డా సి నారాయణ రెడ్డి వంటి మహానుభావులకు దగ్గర చేసింది ఘంటసాల పాటే… ! చివరకు – ఈ దేశం లో సంపూర్ణ భగవద్గీతను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రికార్డు చేసి, విడుదల చేసి, గీతా ప్రచారానికే జీవితాన్ని అంకితం చేసిన తొలి గాయకుడు గా నాకు స్ఫూర్తినిచ్చి, నా జన్మను చరితార్థం చేసింది కూడా ఘంటసాల గారే… ! ‘ఘంటసాల గానo ప్రాంతాలకు అతీతమైనది. భగవద్గీత మతాలకు అతీతమైనది. ఘంటసాలగారి స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారేమో గాని ఆయన స్థాయిని భర్తీ చేసిన వారు లేరని నా అభిప్రాయం.. ఆ గాన యోగి గాత్రం లో ఉన్న ఆర్ద్రత, పవిత్రత, పరమ శాంతి మరే గాత్రం లోనూ నేను వినలేదు. మిగతా వారి పాటలు తేనె తాగుతున్నట్టు అనిపిస్తే, ఘంటసాల పాటలు అమృతం తాగుతున్నట్టు అనిపించేవి. ఆయన మార్గమే నా రాతను మార్చి ‘గీత’ వైపు నడిపించింది. భగవద్గీతను జీవన గీత గా గుర్తించండి. మరణ గీత గా కాదు. గీతను బాల్యదశనుండే తాత్పర్యం తో సహా పిల్లలకు నేర్పించండి. స్వార్థ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించండి..” అంటూ గాన ప్రసంగం చేశారు గంగాధర శాస్త్రి. ఈ సందర్భం గా అదే వేదికపైన గానం చేసిన కొందరు అంధ విద్యార్థులు తాము భగవద్గీత నేర్చుకుంటున్నామని చెబుతూ, శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి తమ పాఠశాలకు ఆహ్వానిస్తూ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో తెలుగు కోయిల శ్రీమతి పి. సుశీల, ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, దాత శ్రీ అల్లూరి సీతారామరాజు పాల్గొన్నారు.