‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా-భగవద్గీతా ప్రచార యాత్ర లో భాగం గా ముగింపు కార్యక్రమాన్ని – మెల్బోర్న్ లోని TAAI (ఆస్ట్రేలియా తెలుగు సంఘం) సంస్థ అత్యంత వైభవం గా, ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకునే విధం గా ( 6.4.2024-మౌంట్ వేవర్లీ కమ్మ్యూనిటీ సెంటర్ )నిర్వహించింది. సంస్థ అధ్యక్షులు శ్రీ చక్రి చయనం, ఉపాధ్యక్షులు శ్రీమతి కృష్ణ బేతనభట్ల, కోశాధికారి శ్రీ హేమంత్, సహ కార్యదర్శి శ్రీ హరి దేవరకొండ, శ్రీ రామ్ వెలవర్తిపాటి తదితర సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి ని పూర్ణకుంభo తో స్వాగతించారు. అనంతరం సాగిన శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం లో – భగవద్గీతను మతగ్రంథం గా కాక మానవీయ గ్రంథం గా చూడాలన్నారు. ‘ఇది ఉత్తమ జీవన విధాన మార్గం. ఉన్నతమైన వ్యక్తిత్వవికాస గ్రంథం. దీనిని వైరాగ్య గ్రంథం లాగా చూసేవారు ఇప్పటికీ ఉన్నారు. అదే నిజమైతే కృష్ణ పరమాత్మ చేసినబోధ విని అర్జునుడు యుద్ధం చేసి విజయం సాధించేవాడు కాద’ని అన్నారు గంగాధర శాస్త్రి. అర్జునునికి స్ఫూర్తినిచ్చి విజయపథం వైపు నడిపించిన కృష్ణుని బోధ మనల్ని నడిపించదా అని ప్రశ్నించారు. ‘న మే ద్వేష్యో స్తి న ప్రియః’ అంటూ తనకు ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవ్వరూ లేరని, ఎవరు ధర్మవర్తనులవుతారో వారితో ఉంటానని కృష్ణ పరమాత్మ చెబుతాడని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రతి ఒక్కరూ గీత చదివి పిల్లలచేత కూడా చదివించాలని అన్నారు. కృష్ణుడు అర్జునునికి నిర్బంధించినట్టు గా గీత చెప్పలేదని – ‘యథేచ్ఛసి తథా కురు’ అంటూ -‘బాగా ఆలోచించుకుని నీకు ఎలా ఇష్టమైతే ఆలా ఆచరించు’ అంటూ స్వేచ్ఛ నిస్తూ చెప్పాడని గంగాధర శాస్త్రి అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి గీత కు మించిన గ్రంథం లేదని, ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలన్నది తమ భగవద్గీతా ఫౌండేషన్ అభిలాష అనీ అన్నారు. మతాలు ఆవిర్భవించని కాలం లో బోధించిన గీతను మత గ్రంథ మని, అది బోధించిన భగవానుడైన శ్రీకృష్ణుని హిందూ మతస్థుడని అనడం అర్థరహితమని అన్నారు. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే నన్నారు. పాశ్చాత్యులు సైతం ప్రశంసించిన గీతను హిందువులే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. కార్యక్రమం చివరన గంగాధర శాస్త్రి అందరి చేతా కృష్ణ భజన చేయించారు. ప్రపంచం లోని వివిధ భాషల్లోకి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేసి విడుదల చేసేందుకు చేయూతను కోరారు. మెల్బోర్న్ లో తన గీతా ప్రవచనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ చక్రి చయనం, ఇతర సభ్యులను హృదయపూర్వక కృతజ్ఞతలతో అభినందించారు. శ్రీమతి లక్ష్మి ఆధ్వర్యం లో చిన్నారులు భగవద్గీత లోని రెండవ అధ్యాయం శ్లోకాలను పఠించగా వారి ఉచ్చారణను శ్రీ గంగాధర శాస్త్రి అభినందించారు. ఈ సందర్భం గా ‘తత్వం యోగశాల’ వారి చిహ్నాన్ని గంగాధర శాస్త్రి ఆవిష్కరించారు. శ్రీ రామ్ వేల్ తమ ‘అసెట్ పాయింట్స్’ సంస్థ తరఫున శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం మరియు ‘దేవా’ సంస్థ సంయుక్తం గా శ్రీ గంగాధర శాస్త్రిని ‘గీతా గాన ప్రవచన కౌస్తుభ’ బిరుదు తో ఘనం గా సత్కరించారు. కార్యక్రమ ప్రారంభం లో శ్రీమతి హర్షవర్ధని పాడిన ప్రార్ధన గీతాన్ని, అటుపై ‘ముద్దుగారే యశోద’ కీర్తనను అభినయించిన శ్రీమతి రూపా ప్రవీణ్, చిII రేయా లను గంగాధర శాస్త్రి అభినందించారు. ఆస్ట్రేలియా భగవద్గీత ప్రచార యాత్ర ను అత్యంత సమర్ధవంతం గా నిర్వహించిన శ్రీ పవన్ వఝలను శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు చెబుతూ సత్కరించారు.