‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఇటీవలే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఆస్ట్రేలియా దేశం లో పర్యటిస్తున్నారు. ఆయన తొలి గీతా ప్రవచన కార్యక్రమo సిడ్నీ లోని పెనెంట్ హిల్స్ కమ్యూనిటీ సెంటర్ లో (24.3.2024) అత్యంత వైభవం గా ఏర్పాటు కాగా ఇతరప్రాంతాలనుంచి కూడా అనేకమంది భగవద్గీతాభిమానులు విశేషం గా తరలివచ్చి కార్యక్రమానికి ఘనవిజయం చేకూర్చారు. ఆస్ట్రేలియా లోని సాంస్కృతిక సంస్థలన్నిటినీ ఏకీకృతం చేసి ‘దేవా ( DEVAA-DHARMA ENLIGHTENMENT VEDIC ASSOCIATION OF AUSTRALIA) అనే సంస్థను స్థాపించి, శ్రీ గంగాధర శాస్త్రి చేతులమీదుగా ప్రారంభింపజేస్తూ తొలి కార్యక్రమం గా గీతా గాన ప్రవచనాన్ని ఏర్పాటుచేశారు. శ్రీమాన్ పవన్ వఝల సారధ్యం లో శ్రీ సాయి పరవస్తు, శ్రీ రవి మిరియాల, శ్రీ రామ్ వేల్, శ్రీ జగదీష్ హరిదాసు, శ్రీ కిశోర్ రంగా, శ్రీ మురహరి గాజుల, శ్రీ అనంతసాయి పరస, శ్రీ జయపాల్ కదిరి, శ్రీ వాణి మోటమర్రి, శ్రీ సాయి గొల్లపూడి, శ్రీ మల్లిక్ రాచకొండ, శ్రీ శ్రీనివాస్ పల్లపోతు తదితరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆస్ట్రేలియా లో భగవద్గీతను బోధించే గురువులు తయారవ్వాలని, సర్వ శాస్త్రమయి అయిన భగవద్గీత పట్ల, సనాతన ధర్మం పట్ల పిల్లలందరికీ అవగాహన కల్పించాలని, మాతృభాషను, మాతృసంస్కృతిని కాపాడుకుంటూ, దీనిని తరువాత తరాలకు వారసత్వసంపదగా అందించే బాధ్యతను తెలుగువారందరూ స్వీకరించాలని, ఏ దేశం వెళ్లినా తమ మతాన్ని, సంస్కృతిని, వేషభాషలను కాపాడుకునే ముస్లింలు, సిక్ఖులు, క్రైస్తవులను చూసి హిందువులు మేల్కోవాలని, అందరిలో కలిసిపోయే ప్రయత్నం లో మన ఉనికిని కోల్పోవాల్సిన అవసరం లేదని గంగాధర శాస్త్రి అన్నారు. జ్ఞానం అంటే ఏమిటో మిగతా ప్రపంచానికి తెలియని వేల సంవత్సరాల క్రితమే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ సర్వమానవాళి కోసం భగవద్గీత బోధించాడని, ఇది దేశ కాల జాత్యాదులకు అతీతమైన కర్తవ్య బోధ అని చెబుతూ – మన పిల్లలకు మన ధర్మం పట్ల అవగాహన కల్పించక పోవడం వల్లనే కన్వర్షన్స్ జరుగుతున్నాయని గంగాధర శాస్త్రి అన్నారు. గీత లోని అతి ముఖ్యమైన శ్లోకాలను దైనందిన జీవితానికి అన్వయించుకుని ఆచరిస్తే సత్పలితాలను పొందవచ్చని, భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదని, బాల్యదశ నుంచే దీనిని అభ్యసిస్తే, మానసిక వత్తిడి లేని, స్వార్ధరహిత, ఆనందకరమైన ఉత్తమ జీవితాన్ని గడపవచ్చని గంగాధర శాస్త్రి అన్నారు. ఆయన విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలు తాత్పర్య సహితం గా, కళ్ళకు కట్టినట్టు గా, గానం చేస్తుంటే ప్రేక్షకులు భక్తి ఆర్ద్రతలతో , చెమర్చిన కళ్ళతో , లేచి నిలబడి కరతాళధ్వనులు సలిపారు. ఆయన తో పాటు భక్తి పారవశ్యం తో కృష్ణ భజన చేశారు.ఈ కార్యక్రమం లో తెలుగు, ఆంగ్ల భాషలలో కమనీయమైన వ్యాఖ్యానాన్ని అందించిన శ్రీమతి అర్చనను, స్వాగత నృత్యం తో ఆకట్టుకున్న శ్రీమతి నేహా మనోజ్ లను గంగాధర శాస్త్రి అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాక తనకు భక్తిపూర్వకంగా ఆతిధ్యాన్ని ఇచ్చిన శ్రీ పవన్ వఝల, శ్రీమతి హరిత దంపతులకు శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతలతో ఆశీస్సులు అందించారు. శ్రీ గంగాధర శాస్త్రి గారి గీతా ప్రవచన స్ఫూర్తి తో ‘భగవద్గీతా ఫౌండేషన్’ ఆస్ట్రేలియా శాఖను త్వరలో స్థాపించి ఉద్యమ స్థాయిలో భగవద్గీతను ప్రచారం చేస్తామని దేవా సంస్థ సభ్యులు ప్రేక్షకుల కరతాళధ్వనులు మధ్య ప్రకటించారు. ఈ సందర్భం గా హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్, సిడ్నీ తెలుగు అసోసియేషన్, వేద గాయత్రి పరిషత్ మరియు జెట్ సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు.