‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా ద్వితీయ కార్యక్రమం – గోల్డ్ కోస్ట్ లోని, రోబినా కమ్యూనిటీ సెంటర్ లో, ‘గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం (TAG)’ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది. ప్రసిద్ధ మానసిక వైద్యులు, TAG అధ్యక్షులు డాII మాణిక్ గూడూరి, శ్రీమతి హరిత గూడూరి, DEVAA వ్యవస్థాపకులు శ్రీ పవన్ వఝలలు శ్రీ గంగాధర శాస్త్రి కి పుష్పగుచ్ఛo తో స్వాగతం పలికారు. కార్యక్రమానికి చేదోడుగా నిలిచిన శ్రీ రవి ద్రోణవల్లి, శ్రీమతి మాధవి ద్రోణవల్లి, శ్రీమతి సురేఖ గాదంశెట్టి మరియు TAG మేనేజిమెంట్ కమిటీ లతో కలిసి శ్రీ గంగాధర శాస్త్రి జ్యోతిప్రకాశనం చేసి, వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ గీతా గానప్రవచనం చేశారు. భగవద్గీత ను చదివి అర్ధం చేసుకుని, ఆచరిస్తే నిత్యజీవనసరళి లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. ‘పొలం దున్ననిదే విత్తనం ఫలించనట్టు చిత్తం శుద్ధి కానిదే జ్ఞానం వంటబట్టదు. నిర్మలమైన చిత్తం తో భగవద్గీత అధ్యయనం చేస్తే లౌకిక, అలౌకికమైన గొప్ప ఫలితాలను పొందగలము. గీత వైరాగ్య గ్రంథం కాదు. మానవ జీవనo ఆదర్శవంతం గా గడిపేందుకు, సకల విజయాలకు దోహదం చేసే ఉత్తమ జీవన విధాన గ్రంథం. అందుకు ఉదాహరణే – ‘న యోత్సే..’ అంటూ యుద్ధం చేయనని గాండీవంతో పాటు అస్త్ర సన్న్యాసం చేసిన అర్జునుడు కృష్ణపరమాత్ముని గీతా బోధ విని ‘నష్టోమోహస్మృతిర్లబ్ధా..’. అంటూ తన అజ్ఞానo నశించి, సందేహాలు తొలగిపోయి యుద్ధం చేసి విజయం సాధించాడు. ఇది ఒక్క అర్జునునికి మాత్రమే కాదు. సకల మానవాళికి ఉపయోగపడే కర్తవ్య బోధ… విజయ గీత ! దీనిని మీరూ నేర్చుకుని మీబిడ్డలకు నేర్పించి మనదైన జ్ఞాన సంబంధమైన ఆస్తిని కాపాడుకోండి. ” అన్నారు గంగాధర శాస్త్రి. ఆయన తాత్పర్య సహితం గా గానం చేసిన విశ్వరూప సందర్శన యోగం వింటూ ప్రేక్షకులు చెమర్చిన కళ్ళతో లేచి నిలబడి కరతాళధ్వనులు సలిపారు. ‘తమ ‘గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా, తెలుగువారి హృదయాలను కదిలించేలా, స్ఫూర్తిదాయకం గా గురువర్యులు డాII గంగాధర శాస్త్రి గారి ప్రవచనం సాగింద’ని, శ్లోకాలూ గీతాలూ, భజనలూ పాడుతూ అన్ని వర్గాలవారిని ఆకట్టుకునేలా, అర్ధమయ్యేలా గీత చెప్పడం తాముకూడా ఊహించలేదని, శాస్త్రి గారి భగవద్గీత ప్రచార ఉద్యమాన్ని ఆస్ట్రేలియా దేశవ్యాప్తం చేయడం లో తమవంతు కృషి చేస్తామని డాII మాణిక్ అన్నారు. అనంతరం డాII మాణిక్ గూడూరి దంపతులను, స్వచ్ఛమైన తెలుగులో సుమధురం గా వ్యాఖ్యానం అందించిన తెలుగు లహరి సభ్యులు శ్రీ హరి పంచుమర్తి ని, వినసొంపైన సౌండ్ సిస్టం ని అందించిన ఆస్ట్రేలియన్ సౌండ్ ఇంజనీర్స్ ని గంగాధర శాస్త్రి అభినందిస్తూ సత్కరించారు. దేవా (DEVAA – DHARMA ENLIGHTENMENT VEDIC ASSOCIATION OF AUSTRALIA ) సంస్థ నుంచి, తన ఆస్ట్రేలియా పర్యటనను అత్యంత వైభవం గా నిర్వహిస్తున్న శ్రీమాన్ పవన్ వఝల కు శ్రీ గంగాధర శాస్త్రి అభినందన పూర్వక ఆశీస్సులందించారు.