భారత సుప్రీమ్ కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్ వి రమణ తన ధర్మపత్ని, మనుమరాలితో – హైదరాబాద్ లోని ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయం లో (17.3.2024) కాసేపు ఆధ్యాత్మికం గా గడిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతాగాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ రమణ దంపతులు శ్రీకృష్ణునికి తులసిమాల సమర్పించి భక్తిశ్రద్ధలతో పూర్వజాకార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ‘The Making of Bhagavadgita’ పేరుతో భగవద్గీతాఫౌండేషన్ రూపొందించిన లఘు చిత్రాన్ని శ్రీ రమణ వీక్షించి అమితానందపరవశుడై శ్రీ గంగాధర శాస్త్రిని ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇటీవల రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు స్వీకరించిన సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి ని అభినందించారు. అనంతరం ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలిసి శ్రీ గంగాధర శాస్త్రి శ్రీ రమణ దంపతులను దుశ్శాలువతో సత్కరించి తాము రూపొందించిన సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత సి డి ప్యాక్ ను బహుమానం గా అందించి ఆశీస్సులందించారు. ఈ సందర్భం గా కరోనా సమయం లో స్వార్ధ రహితం గా వేలాదిమందికి ఉచిత వైద్య సేవలందించిన ప్రసిద్ధ వైద్యులు డాII రాజ్ కుమార్ ను, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రసిద్ధ న్యాయవాది శ్రీ వై రామారావు దంపతులను, కొప్పరపు సోదర కవుల మనుమడు, ఆంధ్ర పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ మా శర్మ ను – ‘భగవద్గీతా ఫౌండేషన్’ తరఫున శ్రీ ఎన్ వి రమణ సత్కరించారు. ఈ సందర్భం గా శ్రీ రమణ – ఫౌండేషన్ చేసిన, చేస్తున్న, చేపట్టబోతున్న కార్యక్రమాలను గురించి వివరం గా తెలుసుకున్నారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ చేపట్టిన ఈ కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిని కలగజేస్తున్నాయని, స్వార్ధరహిత ఉత్తమసమాజనిర్మాణాన్నీ, ప్రపంచశాంతినీ కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తం గా శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న ఈ నిస్వార్ధ గీతా ప్రచార సేవ లో, తానుకూడా భాగస్వామ్యం వహిస్తానని అన్నారు. ఈ సందర్భం గా శ్రీ గంగాధర శాస్త్రి శ్రీ ఎన్ వి రమణ మనుమరాలి చేత ఒక గీతా శ్లోకాన్ని చెప్పించగా – ఆమె వాక్స్పష్టతకు ముగ్ధుడైన గంగాధర శాస్త్రి ఆ చిన్నారికి అభినందనాపూర్వక ఆశీస్సులు అందించగా సభ్యులందరూ కారతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. భగవద్గీత వృద్ధాప్యపు పాఠం కాదని, ఇలా బాల్యదశనుంచే నేర్పించవలసిన అత్యవసరమైన జీవిత పాఠమని, భగవద్గీతాఫౌండేషన్ లక్ష్యం కూడా గీతను బాలలకు, యువతకు చేర్చడమేనని శ్రీ గంగాధర శాస్త్రి అన్నారు. ‘ఈ రోజు నాజీవితం లో మరిచిపోలేని రోజు మహదానందకరమైన రోజు’ అంటూ శ్రీ ఎన్ వి రమణ – శ్రీ గంగాధర శాస్త్రి కి కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేశారు. ఫౌండేషన్ సభ్యులు వారికి వీడ్కోలు పలికారు.





















































