ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురం శీకాంత్ – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ ను (16.5. 2024) సందర్శించారు. గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌంయేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకేసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలిసి శ్రీకాంత్ కు స్వాగతం పలికి సత్కరించారు. భగవద్గీతా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల తో రూపొందించిన లఘు చిత్రాన్ని శ్రీ శ్రీ కాంత్ వీక్షించారు. అటు పై సంస్కృత పండితుల పరిష్కరణ లో, ప్రామాణిక స్థాయిలో, తెలుగు తాత్పర్యం తో రూపొందిన, భారత దేశపు మొట్టమొదటి సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత ను ఉభయ తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నింటిలోనూ ప్రదర్శించే విషయమై చర్చించారు. ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందినందుకు శ్రీ గంగాధర శాస్త్రిని అభినందిస్తూ – ప్రపంచం లో – భగవద్గీతను ఆరాధించే ప్రతి ఒక్కరికీ ఆయా భాషల్లో తాత్పర్యాలతో రికార్డు చేసి విశ్వవ్యాప్తం చేసే విషయమై, ఫౌండేషన్ లక్ష్యాలను ముందుకు తీసుకు వెళ్లే విషయమై సుదీర్ఘం గా చర్చించి, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతా వ్యాప్తికి దేవాదాయ శాఖ తరఫున కృషి చేస్తానని శ్రీ శ్రీకాంత్ అన్నారు.