వివేకానంద కాన్వెంట్ హై స్కూల్ వార్షికోత్సవాలు

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి - ఆదివారం(7-4-2018) మూసాపేట్ లోని జింకలవాడ ( హైదరాబాద్ )లో ఉన్న వివేకానంద కాన్వెంట్ హై స్కూల్ వార్షికోత్సవానికి విశిష్ట అతిధి గా హాజరై, విద్యార్థులూ వారి తల్లితండ్రులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం చేశారు.

నైతిక విలువలతో కూడిన విద్యాబోధనే నిజమైన బోధన అనీ, అలాంటి విద్య ఈ వివేకానంద స్కూల్ లో లభిస్తుందని అన్నారు. రాంకుల కోసం కాక జ్ఞానం కోసం చదవాలని విద్యార్థులకు సూచించారు.

ఇష్టపడి చేసేపని ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, ఆత్మస్థైర్యాన్నీ పెంచుతుందని, కష్టపడి చేసేపని వాటన్నిటిని హరిస్తుందని, అందుచేత విద్యార్థులు ఇష్టపడి చదవాలని గంగాధర శాస్త్రి చెప్పారు. తల్లి తండ్రులను, గురువులను,అతిధులను దైవం గా పూజించే సంస్కృతి ఉన్న ఈ దేశం లో పుట్టడం అదృష్టమని, అలాంటి ఈ దేశం లో అన్ని రంగాలూ ప్రస్తుతం స్వార్ధం తో నిండిపోయి ఉన్నాయని, ఒకప్పటిలా నిస్వార్థమైన ఉత్తమ సమాజాన్ని నిర్మించే బాధ్యతని బిడ్డలకు గుర్తు చేస్తూ పెంచవలసిన బాధ్యత తల్లి తండ్రులకూ , అధ్యాపకులకూ ఉందని అన్నారు.బాల్యం లో తనకు స్కూల్ పాఠాలతో పాటు భగవద్గీత కూ నేర్పించడం వల్లే - తాను సంపూర్ణ భగవద్గీతను గానం చేసి రికార్డు చేసిన తొలి భారతీయ గాయకుడిగా- శ్రీ అబ్దుల్ కలాం ప్రశంసలు పొందగలిగానని అన్నారు. ఆచరించి మాట్లాడే వారి మాటకి సమాజాన్ని నడిపించగలిగే శక్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ అలాంటి శక్తిమంతులు కావాలని అన్నారు. భారతీయ సంస్కృతికి చిరునామా గా నిలిచిన స్వామి వివేకా నంద ను ఆదర్శం గా తీసుకోవాలని, జన్మ ఎత్తినప్పటినుంచి, జన్మ చాలించేంతవరకూ మన ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరి ఋణం తీర్చుకోవడమే కృతజ్ఞత, సంస్కారం అని అన్నారు.

అందుకోసం ప్రతి ఒక్కరూ లక్ష్యం తో పని చేయాలని, పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని స్వార్ధానికి కాక లోక కళ్యాణం కోసం ఉపయోగించే ఉత్తమ పౌరులుగా విద్యార్థులు తాయారు కావాలని అన్నారు. ప్రసంగం అనంతరం - వివిధ విషయాలలో ప్రతిభా పాటవాలను కనబరచిన విద్యార్థినీ విద్యార్థులకు గంగాధర శాస్త్రి బహుమతి ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమం లో లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ముఖ్య అతిథి గా హాజరై ఈ దేశ విద్యావిధానం లోని లోటుపాట్లని వివరిస్తూ జాగృతపరచారు.