కీ II శే II వేటూరి సుందరరామమూర్తి విగ్రహావిష్కరణ

తెలుగు సినిమా గేయ కవిరాజు కీ || శే || వేటూరి సుందరరామమూర్తి విగ్రహాన్ని వేటూరి జన్మస్థలమైన కృష్ణా జిల్లా, దివిసీమ లోని, పెదకళ్లేపల్లి గ్రామం లో- ప్రముఖ గాయకులు, పద్మభూషణ్ శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బుధవారం నాడు ఆవిష్కరించారు.

దివి ఐతిహాసిక పరిశోధన మండలి, అవనిగడ్డ మరియు పెదకళ్లేపల్లి గ్రామస్థులు సంయుక్తం గా అత్యంత వైభవం గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దివిసీమ వాస్తవ్యుడైన ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి డా|| మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించి వెన్నంటి నడిపించారు. శ్రీ వేటూరి సినీ గేయ రచన వైభవాన్ని వివరిస్తూ - వేటూరి రాయగా స్వీయ సంగీతం లో తాను గానం చేసి, రికార్డు చేసిన 'దివిసీమ జాతీయ గీతా' న్ని గంగాధర శాస్త్రి కార్యక్రమం లో స్వాగత గీతం గా ఆలపించడం విశేషం గా అలరించింది. 'సురలంత నరులైన సీమ దివి సీమ - స్వరసుధాక్షరధామమీ దివ్య సీమ' అనే వేటూరి భావానికి పెదకళ్లేపల్లి గ్రామస్థులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు సలిపారు. శ్రీ వేటూరి రచనా వైదుష్యాన్ని, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీ కొనకళ్ల నారాయణ రావు, ఎం.పి; శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ ఎల్. వి. సుబ్రహ్మణ్యం IAS , శ్రీ వెన్నెలకంటి, శ్రీ ఎల్ బి శ్రీరామ్, శ్రీమతి వేటూరి సీతా మహాలక్ష్మి, శ్రీ వేటూరి రవిప్రకాష్ ! శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం వేటూరి తో తన ఆత్మానుబంధాన్ని గుర్తుచేసుకుంటూ 'శంకరా నాదశరీరాపరా' గీతాన్ని ఆలపించి అలరించారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి నిర్వహణలో జరిగిన వేటూరి సినీ గానలహరి కార్యక్రమంలో గాయకులు - రమణ , రాము , శుభశ్రీ , చందన లు ఆలపించిన వేటూరి గీతాలు పెదకళ్లేపల్లి గ్రామస్థులను విశేషం గా ఆకట్టుకున్నాయి. అతిధులందరినీ శ్రీ మండలి బుద్ధప్రసాద్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం లు సత్కరించారు.