"నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి ... అనే గీతా వాక్యాన్ని అనుసరించి.. లోక కల్యాణం కోసం ఎవరైతే నిస్వార్ధం గా పనులు చేస్తారో వారు లోకం దృష్టిలో మరణాన్ని జయించిన చిరంజీవులే... కాబట్టి దేహం కోసం కాక -దేశం కోసం, ధర్మం కోసం, హిందూ మత పరిరక్షణ కోసం అంకితమైన మహనీయుడు ఛత్రపతి శివాజీ .." అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. హైదరాబాద్ లోని పాతబస్తీ కార్వాన్ లో 'ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళ్' వారు అత్యంత ఘనం గా నిర్వహించిన ఛత్రపతి శివాజీ 392వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథి గా హాజరై యువతను చైతన్య పరుస్తూ ఉత్తేజపూర్వక గాన ప్రసంగం చేశారు. శివాజీ జీవితం లోని ప్రతి అడుగూ భారతజాతికి స్ఫూర్తి దాయకమని, శివాజీ తన తండ్రి షాహాజి నుంచి దేశభక్తిని, తల్లి జిజాబాయి నుంచి దేశభక్తులు, దైవభక్తుల కథలు నేర్చుకుని దేశానికి అంకితమైన దేశభక్తుడని, కాబట్టి నేటి సమాజం లో తల్లి తండ్రులు వారి బిడ్డలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యం తో పెంచాలని గంగాధర శాస్త్రి అన్నారు. శివాజీ -మొఘల్ సామ్రాజ్యాన్ని, బీజాపూర్, గోల్కొండ సుల్తాను లను వణికించినవాడని చెప్పారు. ఓటమి తప్పనప్పుడు యుద్ధం నుంచి తప్పుకుని, అనువైన సమయం చూసుకుని దాడిచేసే గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యూహాత్మకమైన నాయకుడని అన్నారు. శివాజీకి 12 సంవత్సరాల వయసప్పుడు అతని తండ్రి తాను పనిచేసే బీజాపూర్ సుల్తాన్ కి పరిచయం చేస్తూ సలాం చేయమన్నప్పుడు 'ఈ దేశాన్ని గౌరవించని పరాయి రాజు ముందు వంగి సలాం చేయను' అని చెప్పిన ధైర్యవంతుడు శివాజీ అన్నారు. శివాజీ అన్ని మతాలనూ గౌరవిస్తూ గుళ్ళతో పాటు మసీదులను కూడాకట్టించాడని అన్నారు. ఒకసారి శివాజీ సైనికులు ఒక అందమైన ముస్లిం యువతిని బంధించి శివాజీ ముందు హాజరు పరచి బహుమానం ఆశించగా...శివాజీ వారిని మందలించి - ఆమె కాళ్లపై పడి, తన సైనికులు చేసిన పనికి క్షమించమని కోరుతూ 'నా తల్లి కూడా నీ అంత అందగత్తె అయ్యుంటే నేను ఇంకెంత అందం గా పుట్టి ఉండేవాడినో ..." అని ప్రశంసించి ఆమె ను ఇంటికి క్షేమం గా పంపించాడని ... ఈ సంఘటన శివాజీ సంస్కారాన్ని చాటిచెబుతుందని గంగాధర శాస్త్రి అన్నారు. సతీ సహగమనాన్ని నిషేధించాడని, ధర్మ రక్షణకై నిలబడ్డాడని, జమిందారీ వ్యవస్థను రద్దు చేసాడని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసాడని అన్నారు. శివాజీ ముస్లిం లకు వ్యతిరేకి కాదనీ, ఆయన సైన్యం లో ముస్లిం లకు కూడా స్థానం కల్పించాడని, అయితే హిందూ సంస్కృతిని గౌరవించని ముస్లిం లకు మాత్రమే ఆయన సింహ స్వప్నం గా నిలిచాడని గంగాధర శాస్త్రి అన్నారు. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదని, ఎంతమంది హృదయాలలో జీవించామన్నది ముఖ్యమని శివాజీ జీవితం చెబుతుందని అన్నారు. 50 ఏళ్ళు మాత్రమే జీవించిన శివాజీ 392 ఏళ్ల తర్వాత కూడా భారతీయుల గుండెల్లో ఆరాధ్యుడు గా ఉండడమే గమనించవలసిన విశేషమని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీతా మార్గం లో నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ, ప్రచారం చేస్తూ, కాపాడుకుంటూ, తర్వాత తరాల వారికి అందజేయవలసిన బాధ్యత ప్రతిఒక్క హిందువు పైన ఉందని అన్నారు. మహాత్ముల జయంతులు ఒక్కరోజు పండగ కాకూడదని, వారి ఆశయాలను ఆచరించిన్నప్పుడే వారికి ఘనమైన నివాళి అర్పించినవారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో - దేశ దారుఢ్యము పెరగాలంటే అందుకు దేహ దారుఢ్యమూ అవసరమని చెబుతూ బాలల చేత సాము గారడీ విన్యాసాలు చేయించారు. ఛత్రపతి శివాజీ మజరాజ్ సేవాదళ్ అధ్యక్షులు జి శంకర్ - శ్రీ గంగాధర శాస్త్రి ని, మరో విశేష అతిథి శ్రీ మామిడి గిరిధర్ ను సత్కరించారు.