సుప్రసిద్ధ దర్శకులు, సినిమాటోగ్రాఫర్ శ్రీ మీర్ - భార్యా సమేతంగా నిన్న హైదరాబాద్ బంజారా హిల్స్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయానికి విచ్చేసి కాసేపు ఆధ్యాత్మికం గా గడిపారు. ఈ సందర్భం గా తాను భగవద్రామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారం గా అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాల స్థాయిలో రూపొందించిన "విశ్వాచార్యుడు' చిత్రాన్ని - గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి కి, ఫౌండేషన్ సభ్యులకూ ప్రదర్శించారు. అతి త్వరలో శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి ఆశీస్సులతో జన బాహుళ్యం లోకి వెళ్ళబోతున్న ఈ చిత్రం బాలల నుండి వృద్ధుల దాకా, సామాన్యుల నుండి పండితుల దాకా ప్రశంసలు అందుకునే రీతి లో, అత్యున్నత సాంకేతిక విలువలతో అద్వితీయం గా దర్శకులు మీర్ తెరకెక్కించారు. ముఖ్యం గా ప్రతి విషయాన్నీ లాజిక్కు తో ఆలోచించే ఈ తరం వారికి- లాజిక్కును ఆధ్యాత్మికత తో అనుసంధానిస్తూ మానవ జీవితాలను ధర్మ మార్గం లో నడిపించడం కోసం రామానుజాచార్యులు ఎంత కృషి చేశారో, జాతి ఎంత సేవ చేశారో ఈ చిత్రం ద్వారా మీర్ అత్యద్భుతం గా తెరకెక్కించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా, యు ట్యూబ్ ద్వారా భగవద్గీతా అభిమానుల చేత విశేషంగా ఆదరణ పొందుతున్న "THE MAKING OF BHAGAVADGITA' డాక్యూమెంటరీ శ్రీ మీరు దర్శకత్వం లో రూపొందినదే ! విశ్వాచార్యుడు చిత్ర ప్రదర్శన అనంతరం శ్రీ మీర్ దంపతులను అభినందిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి దుశ్శాలువాతోనూ, భగవద్గీత గ్రంథం తో నూ సత్కరించారు. ఈ కార్యక్రమం లో నటులు,ఫౌండేషన్ సభ్యులు శ్రీ చలపతి రాజు, ప్రముఖ వేణువాద్య కళాకారుడు శ్రీ నాగరాజు, గాయని శ్రీమతి మణి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.