భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి - మహా నటులు "పద్మశ్రీ" కోట శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి కాసేపు ఆధ్యాత్మికం గా గడిపారు. గంగాధర శాస్త్రి పాత్రికేయుడి గా ఉన్నప్పుడు ఆయనతో తనకి ఉన్న అనుబంధాన్ని, సంఘటనలను, తన కుమారుడి వివాహానికి ఏర్పాటు చేసిన గంగాధర శాస్త్రి సంగీత కచేరి ని కోట గుర్తుచేసుకున్నారు. భగవంతుని ఆశీస్సుల వల్లే తనకు నాలుగు దశాబ్దాలపాటు ఎన్నో విశిష్టమైన పాత్రలను పోషించే ప్రాప్తం లభించిందని అన్నారు. ఎంత సాధించినా, తన కుమారుడు భౌతికం గా తమకు దూరం కావడం మాత్రం, ఈ ఏడు పదుల వయస్సులో తట్టులోలేని బాధను మిగిల్చిందని కంట తడి పెట్టుకున్నారు.. తాను పోషించిన విశిష్టమైన పాత్రల ఫోటోలను సేకరించి తన కుమారుడు తయారు చేసిన పోస్టర్ ను గంగాధర శాస్త్రి కి చూపించారు. భగవద్గీత కు సంబంధించిన అనేక విశేషాలను, భగవద్గీతా ఫౌండేషన్ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఒకప్పటి గంగాధర శాస్త్రిలో కమిట్మెంట్ ఉన్న ఉత్తమ జర్నలిస్టు ని చూశాననీ, ఇప్పటి గంగాధర శాస్త్రి లో ఆధ్యాత్మికవేత్తని చూస్తున్నాని కోట అన్నారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి - కోట శ్రీనివాసరావు నుదుట కస్తూరి తిలకాన్ని దిద్ది, భగవద్గీత గ్రంధాన్ని అందిస్తూ - 'మత్తహ్ పరతరం నాన్యత్' ( గీత -7. 7) అనే ఆరోగ్య సిద్ధి మంత్రాన్ని ఆయనతో చెప్పించారు. కోట శ్రీనివాసరావు - గంగాధర శాస్త్రి ని నూతన వస్త్రాలతో, ఫలాలతో సత్కరించారు. భగవద్గీతా ఫౌండేషన్ మేనేజర్ శ్రీ యుగంధర్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.