అది 2006 వ సంవత్సరం ... TAMA ( తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా ) సంస్థ అధ్యక్షుడు శ్రీ బాల ఇందుర్తి ఆహ్వానం మేరకు నేను గాయకుడు గా తెలుగు వైభవాన్ని గుర్తు చేసే మధురమైన గీతాలతో సంగీత విభావరి ని సమర్పించడానికి అమెరికా లోని అట్లాంటా నగరానికి వెళ్లడం జరిగింది. రసాత్మకం గా సాగిన నాటి కార్యక్రమం లో చివరిగా - నేను తలపెట్టిన సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞానికి చేయూత ని అందించమని ప్రేక్షకులను కోరగా, హర్షాన్ని ప్రకటిస్తూ వందలాది చేతులు తామున్నామంటూ గాలిలోకి లేచాయి... ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత ఒక్క వ్యక్తి మాత్రం భారత దేశానికి ఫోన్ చేస్తూ - తనను తాను పరిచయం చేసుకుని ' నేను భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మునికి పరమ భక్తుడిని. అట్లాంటా హిందూ టెంపుల్ లో పూజ కమిటీ కి చైర్మన్ గా పరమాత్మునికి సేవలందిస్తున్నాను. మీ గీతా గాన యజ్ఞం రికార్డింగ్ లో పాల్గొనే అవకాశం మాకు ఇవ్వండి.' అంటూ 17 జూన్ , 2007 లో వైభవోపేతం గా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా వేదికపై నా జీవితం లోని తొలి గీతా గాన ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటుపై ఆలయం తరపున భగవద్గీత లోని 'విశ్వరూప సందర్శన యోగం' అనే అధ్యాయం రికార్డింగ్ కి అయ్యే ఖర్చు ని విరాళం గా - ఆలయం అధ్యక్షులు శ్రీ శర్మ, తామా అధ్యక్షులు శ్రీ రమేశ్, శ్రీ బాల ఇందుర్తి చేతుల మీదుగా భగవద్గీతా ఫౌండేషన్ కి అందించారు. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం లో, నిర్వహించడం లో, విజయవంతం చేయడం లో ఆయన ఎన్ని నిద్ర లేని రాతులు గడిపి , ఎంతటి విశేషమైన కృషి చేశారో నాకు ఆజన్మాంతం గుర్తుంటుంది. ఈ విషయం లో నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం అతి చిన్న పదమే అవుతుంది. అతి నిరాడంబరమైన ఆ నిష్కామ కర్మ యోగి ని భగవద్గీతా ఫౌండేషన్ అమెరికా శాఖ కి (2007-20015) గౌరవాధ్యక్షులు గా కూడా నియమించుకున్నాము. ఆ మహాత్ముడి పేరు డాII జగన్మోహన్ రావు. ఆయన ఈనాడు 'లేరు' అన్న వార్త శ్రీ బాల ఇందుర్తి గారి ద్వారా తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి కి లోనయ్యాం. ఆయన సతీమణి శ్రీమతి సుగుణ సద్గతులను పొందిన సంవత్సరానికే శ్రీ జగన్మోహన్ రావు కూడా వెళ్లిపోవడం బాధకలిగించింది... '... స మహాత్మా సుదుర్లభః ' అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు - లోక శ్రేయస్సు కోసం పాటుపడే ఇటువంటి మహాత్ములు మానవ జాతికి లభించడం మిక్కిలి అరుదు. ఆ ధర్మాత్ముడు తన ధర్మ పత్ని తో సహా భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా 'గీతా' వ్యాప్తికి చేసిన కృషి మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము. ఆయన లేని లోటు పూడ్చలేనిది. అమెరికా నుంచి భారత దేశానికి తరచూ వచ్చి వెళ్లే వారిలో చాలా మంది - తమ పనులతో పాటు, తమ బల హీనతలను సంతృప్తి పరచే స్నేహ బృందాలను కలవడం ... చివరిలో సమయం ఉంటె తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలను సందర్శించడం చూస్తూఉండేవాడిని.. కానీ శ్రీ జగన్మోహనరావు ఇక్కడికి వచ్చిన ప్రతి సారి- తిరిగి అమెరికా వెళ్లేంతవరకూ ఆధ్యాత్మికం, సేవ అనే రెండు మార్గాలలో మాత్రమే ప్రయాణించడం చూసాను. ప్రపంచపు తొలి సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత విడుదల కార్యమం లో పాల్గొని, అటుపై శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు భార్యాసమేతుడై అశ్రునయనాలతో ఆయన పొందిన మహదానందం ఈ రోజుకీ మాకు జ్ఞప్తికి వస్తుంది.. 'భగవద్గీతా ఫౌండేషన్' సభ్యులందరూ ఆ మహాత్మునికి - స్మృత్యంజలి ఘటిస్తున్నారు.. ... ఆత్మ శుద్ధమైన నివాళులర్పిస్తున్నారు . సద్గతులను ప్రసాదించమని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నారు. ...! ( ఈ సందర్భం గా శ్రీ జగన్మోహన రావు గారు 2007అట్లాంటా లో ఏర్పాటు చేసిన నా గీతా గాన ప్రవచనం కార్యక్రమ దృశ్య మాలిక మీ కోసం... ) - మీ ఎల్వీ గంగాధర శాస్త్రి, వ్యవస్థాపక అధ్యక్షులు, భగవద్గీతా ఫౌండేషన్
.