'గవా మంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశః' అంటూ గోవును సర్వదేవతా స్వరూపం గా, చతుర్దశ భువనాకృతి గా కీర్తించిన వేదం పుట్టిన భరత భూమిలో గోవు నిరాదరణకు గురి కావడం దురదృష్టం..! అ అంటే అమ్మ .. ఆ అంటే ఆవు అని తెలుగు పిల్లలకు పాఠం చెబుతూ అమ్మ తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చిన తెలుగు భూమిలో కూడా నిత్యం గోవధ జరగడం తెలుగు జాతి దురదృష్టం' అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. 'అఖిల భారత గో సేవా ఫౌండషన్' చేపట్టిన 'గోమహాపాదయాత్ర' కార్యక్రమానికి అతిథి గా హాజరై ప్రసంగించారు. గోవును హిందువుల జంతువుగా భావించరాదని, ఇది సర్వ మానవాళికి హితమొనర్చె ప్రాణి అని, సృష్టిలో శ్రేష్టమైనవాటిని హిందువులు తమ తపస్సు ద్వారా గుర్తించారనీ అన్నారు. వేదాలలో విశిష్ట స్థానం ఇవ్వబడి, 'సర్వోపనిషదో గావో ..' అంటూ ఉపనిషత్తుల ను గోవులతో పోల్చి న భరత భూమి లో, 'పాడి ఆవులలో కామధేనువు నేను' అనే పరమాత్మ చేత పేర్కొనబడిన మన దేశం లో నిత్యం వేలాది గోవులు బలి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గోవును జాతీయ ప్రాణి గా ప్రకటించి, గోవధ నిషేధానికి కఠినమైన చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులవల్ల భూమి, ఆహారం విషతుల్యమైపోయిందని, గో ఆధారిత వ్యవసాయం వల్ల భూమి సారవంతమవుతుందని, తద్వారా పండే పంట తినడం ద్వారా ఆరోగ్యం, సద్బుద్ధి, సదాలోచనలు కలుగుతాయని అన్నారు. ఆవులు పాలు రోగ నిరోధకశక్తి ని పెంచుతాయని, గోవులను వధ్యశాలలకు అమ్మేసేవారు, వాటిని కొని గోవులను సంహరించేవారు, 'అల్కబీర్' లాంటి గోవధ్యశాలలను నిర్వహించేవారు అందరు హిందువులే కావడం అత్యంత శోచనీయమని గంగాధర శాస్త్రి అన్నారు. గో హత్య మహా పాపమని అన్నారు. గర్భం తో ఉన్న గోవు లలోని పిండాలకు ముస్లిం దేశాలలో అత్యంత గిరాకీ అన్న వార్త చదివి దుఃఖం ఆపుకోలేకపోయానని, ఇది మానవ జాతికే శాపమని గంగాధర శాస్త్రి గద్గద స్వరం తో అన్నారు. ఈ సందర్బo గా -మానవ జీవితంతో మమేకమైన గోవు ప్రయోజనాలను వివరిస్తూ సాగే 'గోవులగోపన్న' చిత్రం లోని 'వినరా వినరా నరుడా' గీతాన్ని ఆలపించి ఆలోచింపచేశారు. భారత దేశపు సంస్కృతి అస్థిత్వాన్ని కాపాడి తరువాత తరాలవారికి అందించాల్సిన బాధ్యత మన అందరిదని చెబుతూ ఈ గో మహాపాదయాత్ర ముఖ్యోద్దేశ్యాన్ని గ్రహించి ప్రజలు చైతన్యులవ్వాలని, తల్లితండ్రులను కన్నబిడ్డలే పట్టించుకోని ఈ రోజుల్లో బాలకృష్ణ గురుస్వామి అఖిల గోమాత పరిరక్షణ కోసమే తన జీవితాన్ని అంకితం చేయడం నమస్కరించతగ్గ విశేషమని గంగాధర శాస్త్రిఅన్నారు. హైద్రాబాదు నుండి తిరుపతి వరకూ జరిగే ఈ గో మహాపాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు..
.