'భగవద్గీతా పఠనం పరమ లక్ష్యం ఏమిటంటే- అర్ధం చేసుకోవడం, ఆచరించడం... తద్వారా లోక హితమైన కర్మలు చేయడానికి  స్ఫూర్తి పొంది  శాశ్వతమైన కీర్తిని, జన్మరాహిత్య స్థితిని పొందగలం.  కాబట్టే మోక్షగాములు భగవద్గీతను ఆశ్రయిస్తారు. అందుచేత మానసిక వత్తిడి లేని ఆనందాన్ని, మరణం తర్వాత కూడా లోకం దృష్టిలో చిరంజీవిత్వాన్ని  పొందాలంటే భగవద్గీతను బాల్యదశనుండే అభ్యసించి సాధన చేయండి.. " అన్నారు భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ గంగాధర శాస్త్రి. స్వర్గీయ తిరుమలశెట్టి విజయలక్ష్మి స్మృత్యర్థం ఆమె భర్త  నాగేశ్వరరావు, కుమారుడు రాజశేఖర్ లు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన గీతా గాన ప్రసంగం చేశారు. కృష్ణ పరమాత్మ 'అనిత్యమ్ అసుఖం లోకం' - అంటూ ఈ లోకo అశాశ్వతమని, ఇక్కడ సుఖం లేదని స్పష్టం చేసాడని, దేహ తత్వాన్ని చెబుతూ 'దుఃఖాలయమ్ అశాశ్వతం' అన్నాడని అన్నారు. జనన మరణాలు అనివార్యమని, కానీ వాటి మధ్య జీవితం ఆదర్శవంతం గా , స్ఫూర్తి దాయకం గా, నిస్వార్ధం గా, లోక హితం కోసం సాగాలని, ఇలాంటి భావజాలం, ఆదర్శవంతమైన ఆలోచనలు  బాల్య దశనుండే  కలిగిఉంటే మనo మరణాన్ని జయించగలిగే చిరంజీవులమవుతామని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే తల్లి తండ్రులు పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, భగవద్గీత నేర్పించడం ద్వారా ఆదర్శవంతమైన భావాల బీజాలను బాల్య దశలోనే వారి మనస్సులలో నాటాలని, తద్వారా మంచి సమాజాన్ని సాధించవచ్చని అన్నారు.
.