'గీతా జయంతి-2021' వేడుకలను 'భగవద్గీతా ఫౌండేషన్' వైభవం గా నిర్వహించింది. చిక్కడపల్లి, హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాజ గానసభ వేదికపై ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9. 30 ని||లకు గోపూజ తో గీతా జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం - పూజ్యశ్రీ శ్రీ రామప్రియ స్వామి,శ్రీ గోవింద పీఠం, 'శ్రీ వేదభారతి' అధ్యక్షులు డా|| ఆర్ వి ఎస్ ఎస్ అవధానులు, విశిష్ట అతిథి శ్రీ వి వి లక్ష్మీనారాయణ IPS (Retd.), తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ వై రామారావు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా వి ఎస్ జనార్దన మూర్తి, కార్యక్రమ ప్రాయోజకులు 'సమూహ ప్రాజెక్ట్స్ ప్రై.లి.' శ్రీ వెంకయ్య నాయుడు , భగవద్గీతా ఫౌండేషన్ అడ్వొకేసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి జ్యోతి ప్రకాశనం తో 'గీతాజయంతి-2021" వేడుకలు ప్రారంభమయ్యాయి. గత నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు భగవద్గీత ను బోధిస్తున్న శ్రీ వై. రామకృష్ణ కు 'గీతాచార్య-2021" పురస్కారం అందిస్తూ, దుశ్శాలువా, రు. 25,000/- నగదు, సన్మాన పత్రం తో సత్కరించారు. భగవద్గీత లోని 700 శ్లోకాలనూ నేర్చుకున్న విద్యార్థిని చి|| గొర్తి నాగ అనిష్క కు 'పార్థ పురస్కారం-2021' అందిస్తూ, దుశ్శాలువా, రు. 10,000/- నగదు, ప్రశంసాపత్రం తో సత్కరించారు. అలాగే నాలుగేళ్ల వయస్సుకే 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతనూ ధారణ చేసి, వాటిని సంస్కృతం లో వ్రాయగలిగిన బాలమేధావి ఐదేళ్ల బాలుడు చిII కలగా అచ్యుతశర్మ కు 'గీతాబాల మేధావి'పేరుతో ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తూ రు. 10,000/- నగదు, ప్రశంసా పత్రం తో సత్కరించారు. అనంతరం అచ్యుతశర్మ ను వేదికపై ఉన్నవారూ, ప్రేక్షకులూ అడిగిన శ్లోకాలన్నీ స్పష్టమైన ఉచ్చారణతో చెప్పి అందరినీ అబ్బురపరచాడు. శ్రీమతి శైలజ నిర్వహణలో చిన్నారుల చేత భగవద్గీత లోని 12 వ అధ్యాయమైన 'భక్తి యోగము' పారాయణ జరిగింది. థియేటర్ లోని గీతాభిమానులందరూ ఈ పరాయణలో పాల్గొన్నారు. చివరిగా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి అతిథులందరినీ సత్కరించి అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ సాధించిన ప్రగతిని వివరిస్తూ, భవిష్యత్తులో తాము చేయబోయే కార్యక్రమాలను తెలియజేసారు. తమ కార్యక్రమాలకు చేయూతనందించవలసిందిగా కోరారు. శ్రీమతి క్రాంతి నారాయణ్ స్వాగత నృత్యం తో కార్యక్రమం ప్రారంభం కాగా, శ్రీ గాంధీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. అనంతరం ప్రసాదవితరణ తో కార్యక్రమం ముగిసింది...
.