భక్తి టీవీ ఛానల్ వారు - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి. గంగాధర శాస్త్రి గారి తో 25 రోజుల పాటు (12.7.2021-5.8.2021) చేయించిన 'సంపూర్ణ భగవద్గీతా పారాయణ గాన ప్రవచన మహా యజ్ఞం' విజయవంతమై - ప్రపంచవ్యాప్తం గా తెలుగు బంధువుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమం లో ముఖ్యం గా- భగవద్గీత మత గ్రంథం కాదని కర్తవ్య బోధనా గ్రంథమని,ఇది కేవలం హిందూ జాతి సముద్ధరణ కోసం బోధించబడినది కాదని.., యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం బోధించబడినదని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీత ను కేవలం పారాయణ గ్రంథం గా కాక ఆచరణ గ్రంధం గా భావించాలని , మరణ గీత గా కాక జీవన గీత గా చూడాలని, వృద్ధాప్యపు పఠనా గ్రంధం గా కాక, విద్యార్థులకు యువతరానికి బోధించే గ్రంధం గా మారాలని శ్రీ గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు. ముఖ్యం గా విద్యార్థులను, యువతరాన్ని లక్ష్యం గా చేసుకుని ఈ 25 రోజుల కార్యక్రమం జరిగింది. ఊరూరా గీతా మందిరాల నిర్మాణం జరగాలని, తద్వారా గీతా ప్రచారం విస్తృతం గా జరగాలని, ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలని, ప్రతి ఒక్క హిందువూ సనాతన ధర్మ జ్యోతిగా ప్రకాశించాలని కోరుకుంటున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ సందర్భం గా హిందువుల మతం మార్చడానికి ప్రయత్నించే వారిని తీవ్రం గా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 25 వ రోజు గీతా ప్రచార కంకణ బద్ధులవుతామని యువత చేత ప్రమాణం చేయించారు. ఈ 25 రోజుల గీతా కార్యక్రమం లో చివరన గంగాధర శాస్త్రి గారు చేయించిన కృష్ణ భజనకు విశేషమైన స్పందన లభించింది. స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత కు మించిన పాఠం మరొకటి లేదని, కాబట్టి పాఠశాలలలో ఒకటవ తరగతి నుండే విద్యార్థులకు భగవద్గీతను నేర్పించేటట్లు చర్యలు తీసుకోవాలని గంగాధర శాస్త్రి - రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే భగవద్గీతను జాతీయ గ్రంధం గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భగవద్గీత ద్వారా హిందువులలో హిందుత్వాన్ని పటిష్టం చేయడం తమ భగవద్గీతా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భం గా తనకీమహదావకాశాన్ని ఇచ్చిన భక్తి టీవీ అధినేతలు శ్రీమతి రమాదేవి, శ్రీ నరేంద్ర చౌదరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భం గా భక్తి టీవీ లో ప్రసారమైన సంపూర్ణ భగవద్గీతా పారాయణ, గాన ప్రసంగ కార్యక్రమం లోని కొన్ని చిత్రాలు మీ కోసం....
.