భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ ఆధ్వర్యం లో ఆదివారం నాడు హైదరాబాద్, అంబర్ పేట లోని మహారాణాప్రతాప్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ సంబరాలు ఘనం గా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, గౌరవ అతిథి గా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి, బేటీ బచావో -బేటీ పడావో తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి గీతామూర్తి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి బతుకమ్మ పండగ విశిష్టతను పాడుతూ వివరించారు. బతుకమ్మ పండగ పరమార్ధం - కేవలం ప్రకృతి మాతను ఆరాధించడమే కాక , పరమాత్మ మనకు ఇచ్చిన శక్తులను శ్రీ కిషన్ రెడ్డి లాగా సేవ రూపం లో తిరిగి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం కూడా అని తెలుసుకోవాలన్నారు.

పువ్వు కాయగా మారడం లాగే... స్త్రీ కూడా నవమాసాలూ మోసి , బిడ్డలు అనే ఫలాలను సమాజానికి అందిస్తుందని, అందుకే తొమ్మిది రకాల పూలతో , తొమ్మిది వరుసలతో పేర్చి , తొమ్మిది రోజుల పాటు, దుర్గా నవరాత్రులలో ఈ బతుకమ్మ పండగను జరుపుతారని అన్నారు.

బతకడమంటే- మనం వెళ్లిపోయిన తర్వాత కూడా లోకం గుర్తుంచుకునే పనులతో మిగిలిపోవడమే అన్నారు..