చాలా మందికి తీసుకోవడం లో ఉన్న ఆనందం ఇవ్వడం లో ఉండదు... తెలియదు కూడా.. ఇవ్వడం మొదలు పెడితే నువ్వు శాశ్వతుడివవుతావు. శ్రీ రాముడి లాగా.. కర్ణుడి లాగా.. శిబి చక్రవర్తి లాగా..!!! పరోపకారాయ ఫలంతి వృక్షా : I పరోపకారాయ వహంతి నద్యః I పరోపకారాయ చరంతి గావః I పరోపకారార్థమిదం శరీరమ్ II అంటాడు భర్తృహరి ... వృక్షాలు, నదులు, గోవులు .. అన్నీ లోకం కోసమే జీవిస్తున్నాయి. మనిషి మాత్రమే స్వార్థం తో తనకోసమే జీవిస్తున్నాడు.. ఇతరుల కోసమే ఈ జీవితం అనే సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోవాలి. నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి I అని గీత లో పరమాత్ముడు చెప్పినట్టు- లోకం కోసం మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. శాశ్వతుడు అవుతాడు. ఎవడు తనకోసం ఆలోచిస్తాడో - తాను ఉన్నంత వరకే ఉంటాడు. ఎవడు లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం చిరంజీవి గా ఉండిపోతాడు.
ఈ ఆలోచనా విధానమే ఒక వ్యక్తిని చిరంజీవిని చేసింది.. ఆయన పేరు శ్రీ వేగిరాజు శివ వర్మ . పుట్టింది పశ్చిమ గోదావరి ప్రాతళ్ల మెరక గ్రామం. అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని ఆ గ్రామాన్ని - 25 సంవత్సరాల కాల వ్యవధి పెట్టుకుని తన ఆస్తిని, ఆదాయాన్ని, చివరకు తన యావజ్జీవితాన్ని అంకితం చేసి ఈ దేశం లోనే ఆదర్శ గ్రామం గా, గుడిసెలు లేని, సమస్యలు లేని గ్రామం గా తీర్చి దిద్దాడు. 'పద్మశ్రీ' లకు అతీతమైన ఖ్యాతి గడించాడు.
తన సోదరి పేరుమీద 'విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్' ను స్థాపించి శ్రీ శివవర్మ తన ఊరి ఋణం తీర్చుకున్న ఈ నేపధ్యం లో... అత్యంత వైభవం గా ప్రాతళ్ల మెరక లో జరిగిన రజతోత్సవ వేడుకలకు గౌరవ అతిథి గా, కార్యక్రమ సంధాన కర్త గా - భగవద్గీత ను ప్రచారం చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసిన గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యస్థాపకులు అయిన శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించారు. భగవద్గీతను ఆచరించి చూపించిన శ్రీ శివ వర్మ లోకానికి ఆదర్శమని, తనవల్ల తన వల్ల ప్రయోజనం పొందిన వారి కళ్ళలో ఆనందం చూసి ఆనందించడమే నిజమైన, శాశ్వతమైన ఆనందమని తెలుసుకున్న నిష్కామ కర్మ యోగి అనీ శివవర్మను- గంగాధర శాస్త్రి ప్రశంసించారు. శ్రీ శివవర్మ - ఈ కార్య క్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత సి డి ప్యాక్ ను బహుమతి గా అందించి సత్కరించారు.
.