‘దేవుడు దేవాలయం లో ఉన్నాడనుకోవడం – భక్తి.! ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం…! ఆ జ్ఞానాన్ని గీత ద్వారా తెలియజేస్తూ భక్తి, జ్ఞానాలను వివరిస్తాడు కృష్ణ పరమాత్మ..! ఆ పరమాత్మ కి ఎలాంటి వారంటే ఇష్టమో తెలుసుకోవాలంటే 12వ అధ్యయమైన భక్తి యోగం చదవండి. ధర్మ మార్గం లో నడిచేవాడు పరమాత్మకు ప్రీతిపాత్రుడు. ముఖ్యం గా ‘అద్వేష్టా సర్వ భూతానాం…, సంతుష్టస్సతతం యోగీ..’. అనే జంట శ్లోకాల ద్వారా – ఏ ప్రాణి పట్లా ద్వేషభావం ఉండకూడదనీ, మమతాహంకారాలు ఉండకూడదని, మైత్రి, కరుణ ఉండాలని, సుఖ దుఃఖాలలో సమబుద్ధి కలిగి ఉండాలని, క్షమ కలిగి ఉండాలని, ఉన్నదానీతో సంతోషం గా ఉండాలని, పరమాత్మ చింతన ఉండాలని, మనో నిగ్రహం, దృఢ నిశ్చయం కలిగి ఉండి మనోబుద్ధులు పరమాత్మకు అర్పించిన భక్తుడే ఆయనకు ప్రీతి పాత్రుడని పరమాత్మ చెబుతాడు. అడిగినవన్నీ ఇస్తాడు దేవుడు. దేవుణ్ణి ఏమి అడగాలో చెబుతాడు గురువు. దేవుడు, గురువు ఇద్దరూ కలిస్తే – జగద్గురువైన కృష్ణపరమాత్మ…! భగవద్గీత హిందువులను మాత్రమే ఉద్ధరించడానికి చేసిన ఉపదేశం కాదు. యావత్ మానవాళి కి ఉపయోగపడే జీవన సందేశం.’ అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి… అమెరికా లో, న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బని లోని ఆల్బని తెలుగు అసోసియేషన్ (ATA ), హిందూ టెంపుల్ సొసైటీ సంయుక్త నిర్వహణలో- తమ సాంస్కృతిక కార్యక్రమాల చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేవిధంగా, హిందూ టెంపుల్ సభాసదనం లో ఏర్పాటు చేసిన ( 24. 8. 2024) తొలి సంపూర్ణ ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి పాల్గొని స్ఫూర్తి దాయకం గా గీతా గాన ప్రవచనం చేశారు. సాక్షాత్తు తాను దైవం గా ప్రకటించుకుని, దాన్ని విశ్వరూప ప్రదర్శన ద్వారా నిరూపించుకుని కర్తవ్యోప దేశం చేసినందువల్ల ‘భగవద్గీత’ ప్రపంచం లోనే ఏకైక దైవగ్రంథం గా పేరుగాంచిందనీ, ఇది మతాలకు అతీతమైన జీవితపాఠమని, గీత నేర్చుకునే రాత మార్చుకున్నట్టేనని గంగాధర శాస్త్రి అన్నారు. గీతను retirement గ్రంథం గా చూడవద్దని, దీనిని పఠనా గ్రంథం గా కాక ఆచరణ గ్రంథం గా భావించాలని, బాల్యదశనుండే తల్లి తండ్రులు పిల్లలకు నేర్పించాలని, దీనివల్ల స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చని, మానసిక వత్తిడి లేని, ఆరోగ్యకరమైన ప్రశాంత జీవితాన్ని గడపవచ్చని అన్నారు.కర్మ మాత్రమే మనచేతులలో ఉందని, ఫలితం పరమాత్మ చేతిలో ఉందని భావిస్తే మానసిక వత్తిడి కి తావుండదని గంగాధర శాస్త్రి అన్నారు. బహిర్ముఖుడికి సుఖం, అంతర్ముఖుడికి శాంతి లభిస్తాయని అన్నారు. ఆయన విశ్వరూప సందర్శన యోగ ఘట్టాన్ని తాత్పర్య సహితం గా కనులకుకట్టినట్టుగా గానం చేస్తున్నప్పుడు ప్రేక్షకులు లేచినిలబడి కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు, భక్తిప్రపత్తులతో తనకు ఆతిధ్యం ఇచ్చినందుకు శ్రీ వెంకట్ జాస్తి , శ్రీమతి అనురాధ దంపతులకు గంగాధర శాస్త్రి దుశ్శాలువతో సత్కరించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ATA సభ్యులు శ్రీ యుగంధర్ రెడ్డి, శ్రీ నారాయణ గడ్డం, శ్రీ సత్య, శ్రీ కమల్ గోవిందరాజులు, శ్రీ రాజశేఖర్, హిందూ టెంపుల్ సొసైటీ సభ్యులు శ్రీ రమణ ఆకెళ్ళ, శ్రీమతి నీరజ, శ్రీ శివ బండారు,శ్రీ శ్రీనివాస్ ఉప్పుటూరి, శ్రీ శ్రీనివాస్ మంగ, శ్రీ రామిరెడ్డి, కార్యక్రమ సమన్వయ కర్త ఎల్. విశ్వతేజ లకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. కార్యక్రమ ఏర్పాటుకు ముఖ్య కారకుడైన శ్రీ ఉదయ్ దొమ్మరాజు ను దుశ్శాలువా తో సత్కరించారు. ఈ సందర్భం గా ‘ఆల్బని తెలుగు అసోసియేషన్’, హిందూ టెంపుల్ సభ్యులంతా శ్రీ గంగాధర శాస్త్రి ని ‘జీవన సాఫల్య పురస్కారం ‘( Life Time Achievement Award ) తో సత్కరించారు. Salvatore Labaro అనే అమెరికన్ హిందూయిజం పట్ల అభిమానాన్ని పెంచుకుని తన పేరును అనంత దీక్షిత్ గా మార్చుకుని సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న నేపథ్యం లో – ఈ కార్యక్రమానికి హిందూ సాంప్రదాయ దుస్తులలో వచ్చి గీతా గాన ప్రవచనాన్ని 3 గంటలపాటు విని బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి ఆశీస్సులు తీసుకోవడo విశేషం….!