“చైత్ర శుద్ధ నవమి – శ్రీరాముడు పుట్టిన రోజు..!
శ్రావణ బహుళ అష్టమి- శ్రీకృష్ణ భగవానుని పుట్టిన రోజు ..!
మార్గశిర శుద్ధ ఏకాదశి – శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకొని ప్రపంచ మానవాళికి గీతను బోధించిన రోజు…
ఈ తిథుల ప్రాముఖ్యత పిల్లలకు చెప్పండి. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8 వ సంతానం .. జగద్గురువుగా మానవాళికి ‘ధర్మమార్గం’ అనే పాఠం బోధించడానికి విష్ణువు ఎత్తిన 8 వ అవతారం.. ఆయన ఎంటర్ టైనర్ కాదు. ఎన్లైటనర్ … కృష్ణాష్టమి నాడు కేవలం కృష్ణుడి గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకోవడం తో మన బాధ్యత తీరిపోదు.. ఆయన తత్త్వం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించాలి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ లు ఆయన అవతార పరమార్ధం. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడుంటాడు. కాబట్టి ఆయనను చేరుకోడానికి మార్గం ధర్మ మార్గం…! ఆ ధర్మాన్ని, మానవులు ఆచరించవలసిన కర్తవ్యాన్ని విశేషం గా వివరించి బోధించినదే భగవద్గీత… కృషుని తత్త్వం, ఆయన ఆలోచనా విధానం, ఆయన భావజాలం, ఆయన అవతార పరమార్ధం తెలుసుకుని ఆయన అనుగ్రహం పొందాలంటే భగవద్గీత చదవండి. అర్ధం చేసుకోండి.. ఆచరించండి…! శ్రీకృష్ణుడు..సర్వ ప్రాణులను సమదృష్టితో చూడమని చెప్పిన నిజమైన సోషలిస్టు… ఆత్మానందస్థితిని పొందడం ఎలాగో చెప్పిన యోగేశ్వరుడు… తన గురువైన సాందీపుని కుమారుడు మరణిస్తే, యమధర్మరాజు ని శాసించి, గురుపుత్రునికి ఆయుష్షుని ప్రసాదించి, గురుదక్షిణ చెల్లించిన కృతజ్ఞుడు ! జరాసంధుడి బారినుండి తన ప్రజలను రక్షించడానికి ద్వారకా నగరాన్ని నిర్మించిన రక్షకుడు… గీతోపదేశం ద్వారా ప్రపంచమానవాళి కి ఉత్తమ జీవన మార్గాన్ని బోధించిన జగద్గురువు..” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి. అమెరికా లోని న్యూయార్క్ రాజధాని ఆల్బని నగరం లోని హిందూ టెంపుల్ సొసైటీ లో జరిగిన శ్రీకృష్ణాష్టమి ( 26.8.2024 ) వేడుకలకు హాజరై ఆయన శ్రీకృష్ణ వైభవాన్ని వివరిస్తూ భక్తుల చేత కృష్ణ భజనలు చేయించారు. ఆలయo చైర్మన్ శ్రీ రమణ అల్లెన, శ్రీమతి నీరజ దంపతులు శ్రీ గంగాధర శాస్త్రికి ఘన స్వాగతం పలికి సత్కరించారు.