‘కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః I అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణోగతిః II’ అనిచెబుతూ కృష్ణ పరమాత్మ కర్మను ఎలా ఆచరించాలో చెప్పాడు. వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుతున్నాయని, చేయదగిన కర్మను విహిత కర్మ అని, చేయరాని కర్మను వికర్మ లేదా నిషిద్ధ కర్మ అని, ఏ పని చేయకుండా ఉండే సోమరిపోతు స్థితిని అకర్మ అని పరమాత్మ చెబుతూ, ఏ పని చేసినా త్రికరణ శుద్ధి గా చేయాలనీ, ధర్మబద్ధంగా చేయాలని, ఫలితం దైవానిదని భావించి చేయాలనీ, నిస్వార్ధం తో, లోకహితం కోసం కర్మలనాచరించాలని, నైపుణ్యం తో చెయ్యాలని ఉపదేశిస్తాడు. భగవద్గీత మతాలకు అతీతమైన కర్తవ్య బోధ, సర్వమానవాళికీ ఆచరణీయ గ్రంథం..” అన్నారు గీతా, గాన, ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాII ఎల్.వి.గంగాధర శాస్త్రి. అమెరికా లోని సిన్సినాటి లో శ్రీమాన్ డాII వేదాంతం రామానుజాచారి గృహం లో (18.8.2024) ఏర్పాటుచేసిన గీతా సత్సంగం లో శ్రీ గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచనం చేశారు. ‘పాశ్చాత్యులను సైతం విశేషం గా ప్రభావితం చేసిన దైవ గ్రంథం భగవద్గీత … ఇది రిటైర్మెంట్ గ్రంథం కాదు. వైరాగ్య గ్రంధమూ కాదు. ఇది దేశకాలజాత్యాదులకు, కులమత వర్గవిభేదాలకు తావులేకుండా, సర్వకాల సర్వావస్థలలోను పఠించి, అర్ధం చేసుకుని, ఆచరించి తరించవలసిన జీవన గీత. భారత దేశానికి దూరమైనా భారతీయతకు దూరం కాకండి. భారత దేశ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించండి. పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యం తో, లక్ష్యం వైపునకు సాగమనే సందేశాన్ని భగవద్గీత ఇస్తుంది. నువ్వు చేసే పాప పుణ్యాలతో పరమాత్మ కు సంబంధం లేదు. ఆ రెండూ నువ్వే అనుభవించాలని, సర్వ ప్రాణులయందు సమదృష్టి కలవాడే పండితుడని గీత చెబుతుంది. ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టి ధర్మ మార్గం లో కర్మలను ఆచరించే వానికి పాపపుణ్యాలు అంటవని పరమాత్ముడు ఉపదేశిస్తాడు. కృష్ణుడు బోధించిన గీతను అర్జునుడు అర్ధం చేసుకుని, ఆచరించి, యుద్ధం లో విజయుడైనప్పుడు – ఆ గీత మనకీ విజయం చేకూరుస్తుందనడం లో సందేహం లేదు.మానసిక వత్తిడి లేని ప్రశాంత జీవనానికి భగవద్గీత దోహదం చేస్తుంది.” అన్నారు గంగాధర శాస్త్రి. ఈ సందర్భం గా విశ్వరూప సందర్శన ఘట్టాన్ని తన గాత్రం లో గీతా బంధువుల కళ్లముందుంచి, వారి హృదయాలను చెమరింపజేశారు. తమ భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న గీతా ప్రచార యజ్ఞం లో అందరూ పాల్గొని, చేయూతనివ్వాల్సిందిగా అభ్యర్ధించారు. ఈ సందర్భం గా డాII వేదాంతం రామానుజాచార్యులను బ్రహ్మశ్రీ డా ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీత గ్రంథం బహూకరిoచి, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సత్సంగం లో పాల్గొన్న కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సుహాసిని, శ్రీ కృష్ణచైతన్య దంపతులను గంగాధర శాస్త్రి సత్కరించారు. తొలుత శ్రీ చంద్రశేఖర్ దీనన్, శ్రీమతి సునీత, శ్రీ శ్రీనివాస్ వేదాంతం లు శ్రీ గంగాధర శాస్త్రి ని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి ఆహ్వానించారు.