తెలుగు భాష కు ప్రాచీన హోదాను సాధించడంలో కీలక పాత్రను పోషించిన నిజమైన తెలుగు భాషాభిమాని, సాంస్కృతిక బంధువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉప శాసన సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఆహ్వానం మేరకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి- భారత దేశ అత్యున్నత న్యాయస్థాన, 48 వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్ వి రమణను మర్యాద పూర్వకం గా కలిశారు. హైదరాబాద్ లోని రాజభవన్ లో జరిగిన ఈ కార్యక్రమం లో శ్రీ రమణ ను తులసి మాల తోనూ, దుశ్శాలువాతోనూ సత్కరించి తాను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ప్యాక్ ను జ్ఞాపిక గా అందించారు. అనంతరం గీతలోని - 'యద్యదాచరతిశ్రేష్ఠ' శ్లోకాన్ని గానం చేస్తూ - భవిష్యత్తు తరాల న్యాయాధిపతులకు ఆదర్శం గా, ప్రమాణం గా నిలిచే నిర్ణయాలను తీసుకుంటూ, గీత ద్వారా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని బోధించిన ఈ దేశం లో - న్యాయ వ్యవస్థ లో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి తద్వారా స్థిరమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, అందుకు పరమాత్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. తెలుగు వారు గర్వపడే భారత ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని శ్రీ రమణ అలంకరించడం ఆ ఏడుకొండల శ్రీనివాసుడి అనుగ్రహమే ననీ, అందుకే శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలపడానికి శ్రీ రమణ తిరుమల వెళ్లడం ఆయనలోని ఆధ్యాత్మికతను చాటిచెబుతోందని అన్నారు. పదవి కాలం పూర్తి అయ్యాక కూడా ప్రజలు శాశ్వతం గా గుర్తుంచుకునేలా, ఉత్తమ సమాజ నిర్మాణం కోసం, నిష్కామ కర్మ యోగి గా తన పదవీ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. తనకు భగవద్గీత చాల ఇష్టమైన కర్తవ్యబోధా గ్రంధమనీ, తప్పకుండా శ్రీ గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతను వింటానని, జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. ఈ కార్యక్రమం లో భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులు శ్రీ చలపతి రాజు, శ్రీ అజాద్ బాబు కూడా పాల్గొన్నారు..
.