0


" ఎన్టీఆర్ అంటే రాముడు .. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు ... ఎన్టీఆర్ అంటే తెలుగు భాష .... ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్ అంటే నటుడుగా సంపాదించుకున్న శక్తిని రాజకీయం అనే సేవ ద్వారా ప్రజల హృదయాలలో స్థిరస్థానం ఏర్పరచుకున్న కారణజన్ముడు! అలాగే అమృత గానం అంటే ఘంటసాల ... ఈ ఇద్దరు తెలుగు మహనీయులనూ దయచేసి 'భారత రత్న' తో గౌరవించండి." అని భారత ప్రభుత్వాన్ని కోరారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. తాను సంగీతభరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేయడానికి ఈ ఎన్టీఆర్, ఘంటసాలలే స్ఫూర్తి అన్నారు. గాన సుధాకర్ స్థాపించిన 'తేజస్విని కల్చరల్ అసోసియేషన్' సంస్థ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాన్ని హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఎన్టీఆర్ అవార్డు ను 'గాత్ర కంఠీరవ' సాయికుమార్ కు అందజేశారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి - ఎన్టీఆర్, ఘంటసాలలకు నివాళిగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం లోని 'నను భవదీయ దాసుని' పద్యాన్ని ఆలపించారు. ఔచిత్యభరితమైన నటనతో, అద్భుతమైన గాత్రం తో ఘన కీర్తిని సంపాదించుకుని ఎన్టీఆర్ ప్రశంసలు పొందిన సాయికుమార్ 'ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారానికి' ముమ్మాటికీ అర్హులు అన్నారు. తమ భగవద్గీతా ఫౌండేషన్ రూపొందించిన "The Making of Bhagavadgita Documentary " కి సాయికుమార్ గాత్రo అందించడాన్ని ఈ సందర్భం గా కృతజ్ఞతలతో గుర్తుచేసుకున్నారు. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసారు.


''స్వార్థ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించాలంటే భగవద్గీతను ఆచరించండి. లంచాలు లేని భారత దేశాన్ని సృష్టించాలంటే భగవద్గీతను బాల్యదశ నుండే నేర్పించండి. భారత దేశానికి పూర్వ వైభవం రావాలంటే మతాలకు అతీతమయిన భగవద్గీతను మన రాష్ట్ర ప్రభుత్వాలు 5 వ తరగతి నుండే పాఠ్యాంశం గా చేర్చాలి. భారత ప్రభుత్వం గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలి .." అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. డిసెంబర్ 14, 2021 నాడు విశ్వహిందూ పరిషత్ అధ్వర్యం లో జరిగిన లక్ష యువగళ గీతార్చన విజయవంతమైన నేపధ్యం లో - ప్రత్యేకసంచికను ఆవిష్కరించే కార్యక్రమం లో ఆయన ప్రసంగించారు. హిందూమతం బలం గా ఉన్నప్పటికీ హిందువులు మాత్రం బలహీనం గా ఉన్నారని, విశాఖపట్నం లో కనక మహాలక్ష్మి దేవాలయం వీధిలోని చర్చి నిర్మాణం జరిగినా, తిరుపతి లో ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మాణం జరిగినా, పిఠాపురం లో విగ్రహాలను విరగ్గొట్టినా హిందువులు బయటికొచ్చి ప్రభుత్వాలు వణికే లా ప్రశ్నించలేని బలహీనమైన స్థితి లో ఉన్నారని గంగాధర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. భగవద్గీత చదవడం, అర్ధం చేసుకోవడం, ఆచరించడం, ప్రచారం చేయడం, హిందూ మతాన్ని ఎవరు కించపరచినా అడ్డుకోవడం- ప్రతి ఒక్క హిందువు పైనా ఉన్న బాధ్యత అన్నారు. సమాజం లో నైతిక విలువలు రోజురోజుకీ అడుగంటడం చూస్తున్నామని... సినిమాలూ, టివి లు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలో అనైతికత రోజు రోజుకీ పెరిగిపోతోందని, స్వేచ్ఛ పేరుతో మానవ మృగాలలా ప్రవర్తించడం సోషల్ మీడియా లో ఎక్కువైపోయిందనీ, పైగా- చాలా మంది చేస్తుంటే లేని తప్పు మేము చేస్తే అలాంటి వారిని కొన్ని టివి చానెళ్లు ఇంటర్వ్యూ లు చేస్తూ వారికి ప్రాధాన్యతనివ్వడం దురదృష్టకరమైన పరిణామమని, వీటిపై ప్రభుత్వాలు, పోలీసులూ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గంగాధర శాస్త్రి కోరారు. సమాజానికి హాని చేసే ప్రతి విషయమూ నేడు ఎంటర్టైన్మెంట్ కోణం లో చూపించబడడం దారుణమని అన్నారు. బాల్యదశ నుండే భగవద్గీత నేర్పిస్తే ఇలాంటి ఆలోచనలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని గంగాధర శాస్త్రి అన్నారు. 'సంభవితస్య చా కీర్తి హి మరణాదతిరిచ్యతే' - గౌరవము కలవానికి అపకీర్తి మరణము కన్నా అధికమైనది కాబట్టి అపకీర్తి తెచ్చిపెట్టే పనులు చేయవద్దని భగవద్గీత హెచ్చరిస్తుందని అన్నారు. గతం లో కన్నా భగవద్గీతా పఠనం పట్ల ప్రజలకు ఆసక్తి పెరగడం ముదావహమని, కానీ అర్ధం తెలుసుకుని చదివితేనే మన కర్తవ్యం, జీవిత పరమార్ధం బోధపడుతుందని, భగవద్గీతను కేవలం పారాయణ గ్రంధం గా చూడరాదని, అది ఆచరణ గ్రంథమని, శ్రీకృష్ణుని గీతోపదేశం విని, ఆచరించి, అర్జునుడు యుద్ధరంగం లో విజయం సాధించినట్టే భగవద్గీత ను అనుసరించగలిగితే మనమూ శాశ్వత ప్రయోజనాలను సాధించగలమని గంగాధర శాస్త్రి అన్నారు.


'ఇహ పర లోకాలలో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి, జన్మరాహిత్య స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్ని శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించే వాడు గురువు అవుతాడు. అయితే సర్వ దేశాలకూ, సర్వ కాలాలకూ, సర్వ జాతులకూ వర్తించే విధం గా - జగత్తులోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి అభ్యుదయ నిశ్రేయస మార్గాలను రెండింటినీ, మహోదాత్తమైన పధ్ధతి లో, విశ్వజనీనమైన భగవద్గీతా రూపం లో ఉపదేశించడం ద్వారా శ్రీ కృష్ణుడు జగద్గురువయ్యాడు... ఆ జ్ఞానాన్ని యథార్థం గా విశ్లేషణాత్మకం గా, మహోదాత్తం గా జన బాహుళ్యానికి అందించడం ద్వారా వేద వ్యాసుడు, ఆది శంకరాచార్య జగద్గురువులయ్యారు.' అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త బ్రహ్మశ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ నిర్వహణలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య భక్త సమాజం, వేదాంత భారతి, ఋషి పీఠం, తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యం లో హైదరాబాద్ లో జరుగుతున్న శ్రీ శంకర జయంతి ఉత్సవాలలో శ్రీ గంగాధర శాస్త్రి పాల్గొని ప్రసంగించారు. 32 సంవత్సరాల వయసులోపే అఖండ భారతాన్ని పర్యటించి, నాలుగు పీఠాలను స్థాపించి, హిందూ మతాల మధ్య సయోధ్యను నెలకొల్పి, అనేక రచనలు చేసి ముఖ్యం గా ప్రస్థాన త్రయానికి ( బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ) భాష్యాలు రచించి, హిందూ మతానికి దిశానిర్దేశం చేసిన అవతార పురుషుడు శ్రీ శంకరాచార్య - అన్నారు. శ్రీ శంకరాచార్య 'నారాయణః పరోవ్యక్తాత్' అంటూ నారాయణ స్మరణం తో భగవద్గీత కు భాష్యం ప్రారంభించారని, శివకేశవులకు అభేదమని ప్రవచించారని, విష్ణు రూపాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు శివుడిని పూజించిన వారేనని, అజ్ఞానం తో వారిద్దరూ వేరు అని మనం భావిస్తున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. 'సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।' అంటూ -శివ నామం లేకుండా విష్ణు సహస్రనామం, విభూతి యోగం లో 'రుద్రాణాం శంకర శ్చాస్మి' అంటూ శంకర నామం లేకుండా భగవద్గీత పూర్తి కాదని పేర్కొన్నారు. భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి శంకరులు చేసిన కృషి మరెవ్వరూ చేయలేదని అన్నారు. ముఖ్యం గా అద్వైతామృతవర్షిణి గా బోధించబడిన భగవద్గీతకు శ్రీ శంకరాచార్య వ్రాసిన భాష్యం అత్యంత ప్రామాణికమని గంగాధర శాస్త్రి అన్నారు. మతాలకు అతీతమైన, ఉత్తమ జీవన విధాన గ్రంథమైన భగవద్గీతను బాల్యదశ నుంచే నేర్పించే ప్రయత్నం తల్లులు చేయాలని పిలుపునిచ్చారు. అటుపై రాష్ట్ర ప్రభుత్వాలు గీతను పాఠ్యాంశo గా ప్రవేశ పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం భగవద్గీతను జాతీయ గ్రంధం గా ప్రకటించాలని కోరారు. శ్రీ శంకరుల బోధనలను అర్ధం చేసుకుని వాటిని కొంతవరకైనా ఆచరించగలిగితే - అదే ఆ మహాత్మునికి ఘనమైన నివాళి అవుతుందని గంగాధరశాస్త్రి అన్నారు.


మనిషి మరణించే వరకు జీవించడం గొప్పవిషయం కాదని, సమాజానికి తాను చేసిన మంచి పనులద్వారా మరణించాక కూడాజీవించడమే గొప్పవిషయమని, దీనినే మరణాన్ని జయించడమని, ఆవిధం గా ఉత్తమ జీవితాన్ని గడిపి తద్వారా కీర్తిని శేషం గా మిగుల్చుకుని వెళ్లిపోయిన గొప్ప వ్యక్తే దివంగత శ్రీ సిద్ధారెడ్డి జనార్దన రెడ్డి అని - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి అన్నారు. నెల్లూరు సమీపం లోని గూడూరు కు చెందిన 'సంస్కృతి సమ్మేళనం' పూర్వ అధ్యక్షులు కీIIశేII సిద్ధారెడ్డి సంస్మరణార్ధం ఆయన సతీమణి శ్రీమతి ఇంద్రసేనమ్మ, ఆమె సోదరుడు శ్రీ ధనంజయ రెడ్డి, ఆమె కుమారుడు శ్రీ సుధీర్ రెడ్డి, కోడలు శ్రీమతి ప్రణతి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీతా గాన ప్రవచనం చేస్తూ - నైతిక విలువలతో కూడిన, ధర్మబద్ధమైన, స్వార్ధ రహిత జీవితం ఎలా గడపాలో భగవద్గీత తెలియ జేస్తుందని అన్నారు. జీవులకు జనన మరణ రూప సంసార చక్రాన్ని తప్పించుకోలేమని, దానిని మనం తప్పించుకోలేమని, ఆ మధ్యలో ఉన్న జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉందని, దానిని ఆదర్శవంతం గా, స్ఫూర్తిదాయకం గా, నిస్వార్ధం గా, లోకహితం కోసం గడపాలని అన్నారు. ఇది మతగ్రంధం కాదని, జీవితం ఎలా గడపలో తెలియజేసే నిఘంటువుని, కాబట్టి బాల్యదశ నుండే భగవద్గీతను నేర్చుకుని, ఇతరులకు నేర్పించే బాధ్యత మనపై ఉందని అన్నారు. భగవద్గీత జీవన గీత అని- దానిని వ్యక్తుల మరణ సమయాలలో ప్రదర్శించి 'మరణ గీత' అనే భావనను కలగజేయరాదని గంగాధర శాస్త్రి అన్నారు. అనంతరం సిద్ధారెడ్డి కుటుంబం శ్రీ గంగాధర శాస్త్రి ని ఘనం గా సత్కరించి ఆశీస్సులు పొందింది.


ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతాఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని - మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఆ రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ నరోత్తం మిశ్రా, ఆ రాష్ట్ర బి జె పి పార్టీ ఇంఛార్జి శ్రీ మురళీధర రావు, శ్రీ పి. నరహరి IAS లు 'సరస్వతీ పుత్ర' అవార్డు తో ఘనం గా సత్కరించారు. ఇదే వేదిక పై సినీ నటుడు అలీ, కిన్నెర వాద్య కళాకారుడు 'పద్మశ్రీ' పురస్కృత దర్శనం మొగులయ్య లను కూడా సత్కరించారు. తెలుగు సంగమం-హైదరాబాద్, బాలాజీ భక్త మండలి-భోపాల్, తెలుగు సాంస్కృతిక పరిషత్తు-భోపాల్ సంయుక్త ఆధ్వర్యం లో భోపాల్ లో 'తెలుగు సమాగం' పేరుతో తెలుగు సాంస్కృతిక సంబరాలు ( ఏప్రిల్ 16, 2022 న ) ఘనం గా జరిగాయి. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ - స్వార్ధరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని భగవద్గీత ప్రచారం కోసమే అంకితం చేయడం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి తన గాన ప్రసంగం లో తనకీ పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ - ఆ రోజు హనుమజ్జయంతి సందర్భంగా 'మనోజవం మారుత తుల్యవేగం' శ్లోకాన్నీ, మధ్యప్రదేశ్ కు చెందిన భోజరాజు ఆస్థానం లోని మహాకవి కాళిదాసు ను స్మరిస్తూ 'మాణిక్యవీణాం' శ్లోకాన్ని, ఈదేశం ప్రపంచానికి అందించిన, మతాలకు అతీతమైన జ్ఞాన సందేశం భగవద్గీత లోని 'యదా యదాహి ధర్మస్య' శ్లోక ద్వయాన్ని, తెలుగు భాషా మాధుర్యాన్ని గుర్తు చేస్తూ 'యేనుంగునెక్కి' పద్యాన్ని మధురం గా గానం చేసి అలరించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు, 'తెలుగు సంగమం' వ్యవస్థాపకులు శ్రీ మురళీధర రావు తెలుగు భాష, తెలుగు జాతి, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన ప్రేమాభిమానాలు గల వ్యక్తి కావడం తెలుగు వారి అదృష్టం అన్నారు. వృత్తి రీత్యా ప్రపంచం తో అనుబంధం ఏర్పరచుకోవడం కోసం ఇంగ్లీష్ కి దగ్గరవడం తప్పు కాదని, కానీ మన మాతృ భాష తెలుగు కి దూరమైతే మాత్రం అది బాధ్యతా రాహిత్యమవుతుందని, మన సంస్కృతీ వారసత్వాన్ని తర్వాత తరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని, ఈ దేశం లో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం, తెలుగు వాడిగా పుట్టినందుకు పోతన పద్యం నేర్చుకుని మన ఉనికిని కాపాడుకోవాలని గంగాధర శాస్త్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు గంగాధర శాస్త్రి రూపొందించిన సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత ను జ్ఞాపిక లు గా అందించడం విశేషం. కార్యక్రమానంతరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున శ్రీ పి. నరహరి IAS శ్రీ గంగాధర శాస్త్రి కుటుంబానికి ఉజ్జయిని మహా కాళేశ్వరుని, గడ కాళీమాత దర్శనాన్ని ఏర్పాటు చేశారు.ఇండస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి పార్టీ నేత శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యం లో హన్మకొండ లో జరిగిన మహాశివరాత్రి వేడుకలలో ఆయన గీతా గాన ప్రవచనం చేశారు.
'గీతా జయంతి-2021' వేడుకలను 'భగవద్గీతా ఫౌండేషన్' వైభవం గా నిర్వహించింది. చిక్కడపల్లి, హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాజ గానసభ వేదికపై ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9. 30 ని||లకు గోపూజ తో గీతా జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం - పూజ్యశ్రీ శ్రీ రామప్రియ స్వామి,శ్రీ గోవింద పీఠం, 'శ్రీ వేదభారతి' అధ్యక్షులు డా|| ఆర్ వి ఎస్ ఎస్ అవధానులు, విశిష్ట అతిథి శ్రీ వి వి లక్ష్మీనారాయణ IPS (Retd.), తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ వై రామారావు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా వి ఎస్ జనార్దన మూర్తి, కార్యక్రమ ప్రాయోజకులు 'సమూహ ప్రాజెక్ట్స్ ప్రై.లి.' శ్రీ వెంకయ్య నాయుడు , భగవద్గీతా ఫౌండేషన్ అడ్వొకేసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి జ్యోతి ప్రకాశనం తో 'గీతాజయంతి-2021" వేడుకలు ప్రారంభమయ్యాయి. గత నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు భగవద్గీత ను బోధిస్తున్న శ్రీ వై. రామకృష్ణ కు 'గీతాచార్య-2021" పురస్కారం అందిస్తూ, దుశ్శాలువా, రు. 25,000/- నగదు, సన్మాన పత్రం తో సత్కరించారు. భగవద్గీత లోని 700 శ్లోకాలనూ నేర్చుకున్న విద్యార్థిని చి|| గొర్తి నాగ అనిష్క కు 'పార్థ పురస్కారం-2021' అందిస్తూ, దుశ్శాలువా, రు. 10,000/- నగదు, ప్రశంసాపత్రం తో సత్కరించారు. అలాగే నాలుగేళ్ల వయస్సుకే 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతనూ ధారణ చేసి, వాటిని సంస్కృతం లో వ్రాయగలిగిన బాలమేధావి ఐదేళ్ల బాలుడు చిII కలగా అచ్యుతశర్మ కు 'గీతాబాల మేధావి'పేరుతో ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తూ రు. 10,000/- నగదు, ప్రశంసా పత్రం తో సత్కరించారు. అనంతరం అచ్యుతశర్మ ను వేదికపై ఉన్నవారూ, ప్రేక్షకులూ అడిగిన శ్లోకాలన్నీ స్పష్టమైన ఉచ్చారణతో చెప్పి అందరినీ అబ్బురపరచాడు. శ్రీమతి శైలజ నిర్వహణలో చిన్నారుల చేత భగవద్గీత లోని 12 వ అధ్యాయమైన 'భక్తి యోగము' పారాయణ జరిగింది. థియేటర్ లోని గీతాభిమానులందరూ ఈ పరాయణలో పాల్గొన్నారు. చివరిగా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి అతిథులందరినీ సత్కరించి అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ సాధించిన ప్రగతిని వివరిస్తూ, భవిష్యత్తులో తాము చేయబోయే కార్యక్రమాలను తెలియజేసారు. తమ కార్యక్రమాలకు చేయూతనందించవలసిందిగా కోరారు. శ్రీమతి క్రాంతి నారాయణ్ స్వాగత నృత్యం తో కార్యక్రమం ప్రారంభం కాగా, శ్రీ గాంధీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. అనంతరం ప్రసాదవితరణ తో కార్యక్రమం ముగిసింది.ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, పూర్వ శాసన ఉపసభాపతి, పూర్వ అధికార భాషాసంఘం అధ్యక్షులు, తెలుగు భాషకు ప్రాచీన హోదాను సాధించిన సాంస్కృతిక బంధువు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్... వారి కుమారుడు చిII వెంకట రామ్ ను చిIIలIIసౌ సాయి సుప్రియ కు ఇచ్చి హైదరాబాద్ లోని జలవిహార్ లో ఘనం గా వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీతాఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరై వధూవరులకు భగవద్గీత గ్రంధాన్ని బహూకరించి, వారిచేత ఒక గీతా శ్లోకం చెప్పించి ఆశీర్వదించారు. ఆ సందర్భం లోని కొన్ని చిత్రాలు ఇక్కడ...


తెలంగాణ ట్రాన్స్ కో & జెన్ కో సి.ఎం.డి శ్రీ దేవులపల్లి ప్రభాకర రావు - హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు 'గీతాచార్య' శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కార్యాలయం లోని శ్రీ కృష్ణ విగ్రహానికి శ్రీ ప్రభాకర రావు తులసిమాల వేసి నమస్కరించి, అటుపై గీతా గాన రికార్డింగు ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రదర్శించిన లఘుచిత్రాన్ని తిలకించి, పులకించి గంగాధర శాస్త్రిని అభినందించారు. పరమాత్ముని అనుగ్రహం చేతనే ఇంతటి మహత్కార్యాన్ని గంగాధర శాస్త్రి సాధించగలిగారని అన్నారు. ఈ సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ భవిష్యత్తు ప్రణాళికలను శ్రీ గంగాధర శాస్త్రి వివరించగా , ఈ గీతా యజ్ఞం లో తానూ ఒక సమిధగా ఉపయోగపడతానని శ్రీ ప్రభాకరరావు అన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ ప్రభాకర రావు, శ్రీ వై. రామారావు, Advocate, Telangana HighCourt, డాII హెచ్.ఆర్.వి. రాజ్ కుమార్, Dr. H.R.V. Rajkumar, Professor and Head of the Department of Microbiology and Infectious Diseases, Kamineni Academy of Medical Sciences and Research Centre, శ్రీ మంతెన శ్రీనివాస రాజు, Chairman, Nalanda Group of Colleges లను శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీ అజాద్ బాబు లు సత్కరించారు.


తాను పుట్టిన ఊరు ఎలాంటి సమస్యలనూ ఎదుర్కొనరాదని - తన మాతృ భూమి సేవే పరమాత్ముని సేవగా భావించి, తన యావదాస్తిని తన స్వగ్రామమైన ప్రాతళ్ల మెరక అభివృద్ధి కి కేటాయించి, ఈ దేశం లోనే ఒక ఆదర్శవంతమైన గ్రామం గా తీర్చిదిద్దిన మహనీయుడు, నిజమైన దేశభక్తుడు శ్రీ వేగిరాజు శివవర్మ ! ఇటీవల తన కుమార్తె చి|| సంజన వివాహ వేడుకలకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా - దంపతులు చి|| అవినాష్, చి|| ల|| సౌ|| సంజన లకు - భగవద్గీత గ్రంధాన్ని అందజేసి ఆశీస్సులందించారు. ఈ సందర్భం గా కొన్ని చిత్రాలు ఇక్కడ.


ప్రసిద్ధ పారిశ్రామికవేత్త శ్రీ అడుసుమిల్లి కృష్ణమూర్తి సతీమణి శ్రీమతి అడుసుమిల్లి రమాదేవి (శ్రీమతి బేబమ్మ) దివంగతురాలైన నేపథ్యం లో ఆమె స్మృత్యర్థం శ్రీ అడుసుమిల్లి వెంకట్, కుమార్తె శ్రీమతి ప్రభ, మనుమరాలు శ్రీమతి వాసుకి సుంకవల్లి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. జూబిలీ హిల్స్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అతిధి గా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా - 'భగవద్గీత - ఉత్తమ జీవితం' అనే అంశం పై ఆయన గాన ప్రసంగం చేశారు.


శ్రీ శ్రీ శ్రీ చిద్రూపానంద స్వామి, చిన్మయ మిషన్ ( ఢిల్లీ శాఖ అధిపతి ) తన హైదరాబాద్ పర్యటనలో భాగం గా - భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, గీతాగాన ప్రవచన కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, సంస్థ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, డాII పద్మ వీరపనేని, సభ్యులు శ్రీ బి ఎస్ శర్మ , శ్రీ ఎం రఘు తదితరులు చిద్రూపానంద కు ఘన స్వాగతం పలికారు. వారిని ఫల పుష్ప వస్త్రాలతొ సత్కరించి, సంపూర్ణ భగవద్గీత ఆడియో సి డి ని అందించారు. ఈ సందర్భం గా ప్రదర్శించిన The Making of Bhagavadgita - Documentrary ని తిలకించి శ్రీ చిద్రూపానంద - భగవద్గీతా ఫౌండేషన్ కి ఆశీస్సులు అందజేశారు. భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ గంగాధర శాస్త్రి ని అభినందిస్తూ, ఫౌండేషన్ తలపెట్టిన భవిష్యత్తు ప్రాజెక్టులు విజయవంతం కావాలని అందుకు తమ గురుదేవులు శ్రీ చిన్మయానంద ఆశీస్సులు తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. విచ్చేసిన భక్తులు అడిగిన అనేక సందేహాలకు సమాధానాలు చెప్పారు.


భగవద్గీతా ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు (2008-2017)... కీ,,శే ,, శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారికి I.A.S (Retd) ఘననివాళి..


భక్తి టీవీ ఛానల్ వారు - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి. గంగాధర శాస్త్రి గారి తో 25 రోజుల పాటు (12.7.2021-5.8.2021) చేయించిన 'సంపూర్ణ భగవద్గీతా పారాయణ గాన ప్రవచన మహా యజ్ఞం' విజయవంతమై - ప్రపంచవ్యాప్తం గా తెలుగు బంధువుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమం లో ముఖ్యం గా- భగవద్గీత మత గ్రంథం కాదని కర్తవ్య బోధనా గ్రంథమని,ఇది కేవలం హిందూ జాతి సముద్ధరణ కోసం బోధించబడినది కాదని.., యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం బోధించబడినదని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీత ను కేవలం పారాయణ గ్రంథం గా కాక ఆచరణ గ్రంధం గా భావించాలని , మరణ గీత గా కాక జీవన గీత గా చూడాలని, వృద్ధాప్యపు పఠనా గ్రంధం గా కాక, విద్యార్థులకు యువతరానికి బోధించే గ్రంధం గా మారాలని శ్రీ గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు. ముఖ్యం గా విద్యార్థులను, యువతరాన్ని లక్ష్యం గా చేసుకుని ఈ 25 రోజుల కార్యక్రమం జరిగింది. ఊరూరా గీతా మందిరాల నిర్మాణం జరగాలని, తద్వారా గీతా ప్రచారం విస్తృతం గా జరగాలని, ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలని, ప్రతి ఒక్క హిందువూ సనాతన ధర్మ జ్యోతిగా ప్రకాశించాలని కోరుకుంటున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ సందర్భం గా హిందువుల మతం మార్చడానికి ప్రయత్నించే వారిని తీవ్రం గా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 25 వ రోజు గీతా ప్రచార కంకణ బద్ధులవుతామని యువత చేత ప్రమాణం చేయించారు. ఈ 25 రోజుల గీతా కార్యక్రమం లో చివరన గంగాధర శాస్త్రి గారు చేయించిన కృష్ణ భజనకు విశేషమైన స్పందన లభించింది. స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత కు మించిన పాఠం మరొకటి లేదని, కాబట్టి పాఠశాలలలో ఒకటవ తరగతి నుండే విద్యార్థులకు భగవద్గీతను నేర్పించేటట్లు చర్యలు తీసుకోవాలని గంగాధర శాస్త్రి - రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే భగవద్గీతను జాతీయ గ్రంధం గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భగవద్గీత ద్వారా హిందువులలో హిందుత్వాన్ని పటిష్టం చేయడం తమ భగవద్గీతా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భం గా తనకీమహదావకాశాన్ని ఇచ్చిన భక్తి టీవీ అధినేతలు శ్రీమతి రమాదేవి, శ్రీ నరేంద్ర చౌదరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భం గా భక్తి టీవీ లో ప్రసారమైన సంపూర్ణ భగవద్గీతా పారాయణ, గాన ప్రసంగ కార్యక్రమం లోని కొన్ని చిత్రాలు మీ కోసం...


తెలుగు భాష కు ప్రాచీన హోదాను సాధించడంలో కీలక పాత్రను పోషించిన నిజమైన తెలుగు భాషాభిమాని, సాంస్కృతిక బంధువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉప శాసన సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఆహ్వానం మేరకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి- భారత దేశ అత్యున్నత న్యాయస్థాన, 48 వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్ వి రమణను మర్యాద పూర్వకం గా కలిశారు. హైదరాబాద్ లోని రాజభవన్ లో జరిగిన ఈ కార్యక్రమం లో శ్రీ రమణ ను తులసి మాల తోనూ, దుశ్శాలువాతోనూ సత్కరించి తాను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ప్యాక్ ను జ్ఞాపిక గా అందించారు. అనంతరం గీతలోని - 'యద్యదాచరతిశ్రేష్ఠ' శ్లోకాన్ని గానం చేస్తూ - భవిష్యత్తు తరాల న్యాయాధిపతులకు ఆదర్శం గా, ప్రమాణం గా నిలిచే నిర్ణయాలను తీసుకుంటూ, గీత ద్వారా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని బోధించిన ఈ దేశం లో - న్యాయ వ్యవస్థ లో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి తద్వారా స్థిరమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, అందుకు పరమాత్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. తెలుగు వారు గర్వపడే భారత ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని శ్రీ రమణ అలంకరించడం ఆ ఏడుకొండల శ్రీనివాసుడి అనుగ్రహమే ననీ, అందుకే శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలపడానికి శ్రీ రమణ తిరుమల వెళ్లడం ఆయనలోని ఆధ్యాత్మికతను చాటిచెబుతోందని అన్నారు. పదవి కాలం పూర్తి అయ్యాక కూడా ప్రజలు శాశ్వతం గా గుర్తుంచుకునేలా, ఉత్తమ సమాజ నిర్మాణం కోసం, నిష్కామ కర్మ యోగి గా తన పదవీ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. తనకు భగవద్గీత చాల ఇష్టమైన కర్తవ్యబోధా గ్రంధమనీ, తప్పకుండా శ్రీ గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతను వింటానని, జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. ఈ కార్యక్రమం లో భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులు శ్రీ చలపతి రాజు, శ్రీ అజాద్ బాబు కూడా పాల్గొన్నారు.

స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం 'భగవద్గీత' ప్రచారమే జీవిత ధ్యేయంగా,అందుకు 'భగవద్గీతా యూనివర్సిటీ' స్థాపనే అంతిమ లక్ష్యం గా - ప్రసిద్ధ గాయకులు, 'గీతాచార్య' శ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి 2007 లో 'భగవద్గీతా ఫౌండేషన్' అనే ఆధ్యాత్మిక, సామాజిక సంస్థను స్థాపించి,ఒక దశాబ్ద కాలం పరిశోధనాత్మక కృషి చేసి, ప్రపంచం లోనే తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ను తెలుగు తాత్పర్యం తో వెలువరించడం జరిగింది. 'భారత రత్న' డాII ఏ పి జె అబ్దుల్ కలామ్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వంటి మహాత్ముల అభినందనపూర్వక ఆశీస్సులతో గత 15 సంవత్సరాలుగా దేశవిదేశాలలోనూ, సోషల్ మీడియా ద్వారానూ, ప్రసార మాధ్యమాల ద్వారానూ అనేక గీతా ప్రచార కార్యక్రమాలతో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శ్రీ గంగాధర శాస్త్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. కాగా ఆయన మార్గాన్ని అనుకరిస్తూ ఇటీవల మరొకరు తాము కూడా - తమ భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా గీతా యూనివర్సిటీ ని నిర్మించదలచామంటూ ఆన్ లైన్ లో విరాళాలు సేకరిస్తున్నట్టు మా ఫౌండేషన్ కార్యాలయానికి వ్యక్తిగతం గానూ, ఫోన్ల ద్వారానూ అనేకమంది తెలియజేస్తున్నారు. అయితే ఈ తాజా సంస్థ తో శ్రీ గంగాధర శాస్త్రి గారు స్థాపించిన భగవద్గీతా ఫౌండేషన్ కి ఎటువంటి సంబంధమూ లేదని తెలియజేస్తున్నాము. అన్ని విషయాలూ భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం ( 102, హిమసాయి పార్క్ వ్యూ అపార్టుమెంట్స్, రోడ్ నెంబర్ 5, బంజారా హిల్స్ , హైదరాబాద్ 500 034, ఫోన్ : 9030756555; Website : www.bhagavadgitafoundation.org ) ద్వారా వివరంగా తెలుసుకున్న పిమ్మట విరాళాలు అందించవలసిందిగా దాతలను విజ్ఞప్తి చేస్తున్నాము

అది 2006 వ సంవత్సరం ... TAMA ( తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా ) సంస్థ అధ్యక్షుడు శ్రీ బాల ఇందుర్తి ఆహ్వానం మేరకు నేను గాయకుడు గా తెలుగు వైభవాన్ని గుర్తు చేసే మధురమైన గీతాలతో సంగీత విభావరి ని సమర్పించడానికి అమెరికా లోని అట్లాంటా నగరానికి వెళ్లడం జరిగింది. రసాత్మకం గా సాగిన నాటి కార్యక్రమం లో చివరిగా - నేను తలపెట్టిన సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞానికి చేయూత ని అందించమని ప్రేక్షకులను కోరగా, హర్షాన్ని ప్రకటిస్తూ వందలాది చేతులు తామున్నామంటూ గాలిలోకి లేచాయి... ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత ఒక్క వ్యక్తి మాత్రం భారత దేశానికి ఫోన్ చేస్తూ - తనను తాను పరిచయం చేసుకుని ' నేను భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మునికి పరమ భక్తుడిని. అట్లాంటా హిందూ టెంపుల్ లో పూజ కమిటీ కి చైర్మన్ గా పరమాత్మునికి సేవలందిస్తున్నాను. మీ గీతా గాన యజ్ఞం రికార్డింగ్ లో పాల్గొనే అవకాశం మాకు ఇవ్వండి.' అంటూ 17 జూన్ , 2007 లో వైభవోపేతం గా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా వేదికపై నా జీవితం లోని తొలి గీతా గాన ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటుపై ఆలయం తరపున భగవద్గీత లోని 'విశ్వరూప సందర్శన యోగం' అనే అధ్యాయం రికార్డింగ్ కి అయ్యే ఖర్చు ని విరాళం గా - ఆలయం అధ్యక్షులు శ్రీ శర్మ, తామా అధ్యక్షులు శ్రీ రమేశ్, శ్రీ బాల ఇందుర్తి చేతుల మీదుగా భగవద్గీతా ఫౌండేషన్ కి అందించారు. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం లో, నిర్వహించడం లో, విజయవంతం చేయడం లో ఆయన ఎన్ని నిద్ర లేని రాతులు గడిపి , ఎంతటి విశేషమైన కృషి చేశారో నాకు ఆజన్మాంతం గుర్తుంటుంది. ఈ విషయం లో నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం అతి చిన్న పదమే అవుతుంది. అతి నిరాడంబరమైన ఆ నిష్కామ కర్మ యోగి ని భగవద్గీతా ఫౌండేషన్ అమెరికా శాఖ కి (2007-20015) గౌరవాధ్యక్షులు గా కూడా నియమించుకున్నాము. ఆ మహాత్ముడి పేరు డాII జగన్మోహన్ రావు. ఆయన ఈనాడు 'లేరు' అన్న వార్త శ్రీ బాల ఇందుర్తి గారి ద్వారా తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి కి లోనయ్యాం. ఆయన సతీమణి శ్రీమతి సుగుణ సద్గతులను పొందిన సంవత్సరానికే శ్రీ జగన్మోహన్ రావు కూడా వెళ్లిపోవడం బాధకలిగించింది... '... స మహాత్మా సుదుర్లభః ' అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు - లోక శ్రేయస్సు కోసం పాటుపడే ఇటువంటి మహాత్ములు మానవ జాతికి లభించడం మిక్కిలి అరుదు. ఆ ధర్మాత్ముడు తన ధర్మ పత్ని తో సహా భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా 'గీతా' వ్యాప్తికి చేసిన కృషి మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము. ఆయన లేని లోటు పూడ్చలేనిది. అమెరికా నుంచి భారత దేశానికి తరచూ వచ్చి వెళ్లే వారిలో చాలా మంది - తమ పనులతో పాటు, తమ బల హీనతలను సంతృప్తి పరచే స్నేహ బృందాలను కలవడం ... చివరిలో సమయం ఉంటె తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలను సందర్శించడం చూస్తూఉండేవాడిని.. కానీ శ్రీ జగన్మోహనరావు ఇక్కడికి వచ్చిన ప్రతి సారి- తిరిగి అమెరికా వెళ్లేంతవరకూ ఆధ్యాత్మికం, సేవ అనే రెండు మార్గాలలో మాత్రమే ప్రయాణించడం చూసాను. ప్రపంచపు తొలి సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత విడుదల కార్యమం లో పాల్గొని, అటుపై శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు భార్యాసమేతుడై అశ్రునయనాలతో ఆయన పొందిన మహదానందం ఈ రోజుకీ మాకు జ్ఞప్తికి వస్తుంది.. 'భగవద్గీతా ఫౌండేషన్' సభ్యులందరూ ఆ మహాత్మునికి - స్మృత్యంజలి ఘటిస్తున్నారు.. ... ఆత్మ శుద్ధమైన నివాళులర్పిస్తున్నారు . సద్గతులను ప్రసాదించమని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నారు. ...! ( ఈ సందర్భం గా శ్రీ జగన్మోహన రావు గారు 2007అట్లాంటా లో ఏర్పాటు చేసిన నా గీతా గాన ప్రవచనం కార్యక్రమ దృశ్య మాలిక మీ కోసం... ) - మీ ఎల్వీ గంగాధర శాస్త్రి, వ్యవస్థాపక అధ్యక్షులు, భగవద్గీతా ఫౌండేషన్

హైదరాబాద్, బంజారా హిల్స్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో సంస్థ వ్యవస్థాపకులు, గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి - సంగీత భరిత సంపూర్ణ ఆంగ్ల భగవద్గీత ఎడిటింగ్ కార్యక్రమం లో ఉన్నారు. ఆ సమయం లో ఓ జంట - తమ ఐదేళ్ల పిల్లవాడితో ఫౌండేషన్ కార్యాలయం లోకి అడుగు పెట్టారు. ఒక చోట కుదురుగా కూర్చోవడంకూడా తెలియని ఆ పిల్ల వాడి పేరు అచ్యుత్ ! కృష్ణ పరమాత్ముడి పేరే.. ! విచిత్రం ఏమిటంటే - వీడికి మాట్లాడడం ఇంకా పూర్తి గా రాకపోయినా ( ఈ విషయమై ఈ పిల్లవాడి తల్లి తండ్రులు శైలజ, కామేశ్వర రావులు అనేక మంది డాక్టర్లను సంప్రదించామని ఆవేదనతో చెప్పారు ) భగవద్గీత లోని 700 శ్లోకాలూ కంఠతా పట్టేసాడు. దీనిని పరమాత్మ అనుగ్రహం, పూర్వ జన్మ వాసన అనక ఇంకేమి అనగలం ? ఈ పిల్లవాడి వృత్తాంతం పునర్జన్మ ను ధ్రువీకరించడం లేదూ..! పైగా ఈ భగవద్గీత ను తల్లి తండ్రులు నేర్పించలేదట. వాడంతట వాడే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాడట.. ఇది ఇంకా అద్భుతం. ఆ రోజు పనులన్నీ ఆపేసి.. ఈ అచ్యుతుడి తోనే ఆనందం గా గడిపేశారు గంగాధర శాస్త్రి... ఏ శ్లోకం అడిగినా అత్యద్భుతమైన, పరిణతితో కూడిన, స్పష్టమైన ఉచ్చారణతో ఆ పిల్ల వాడు శ్లోకాలను చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు గంగాధర శాస్త్రి... భగవద్గీతను ఏ వయస్సు పిల్లలకు నేర్పించాలి అని చాలామంది అడిగే ప్రశ్నకు ఈ పిల్లవాడే ఉదాహరణ అని, యంయం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం I తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః II (8-6) అని గీతాచార్యుడు చెప్పినట్టు - 'అంత్య కాలం లో మనుజుడు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో మరు జన్మలో అతడు ఆయా భావాలనే పొందుతాడు.' అనడానికి ఈ పిల్లవాడే ఒక ఉదాహరణ అని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ పిల్ల వాడు భవిష్యత్తులో 'గీతాచార్యుడు' గా లోకానికి మార్గదర్శి కాగలడని ఆశీర్వదించారు. మనం పోయేటప్పుడు - లౌకికం గా సంపాదించిందంతా ఇక్కడే వదిలేసి పోతామని .. జీవుడు ఒక దేహం విడిచి మరొక దేహం పొందేటప్పుడు తన వెంట ఇంద్రియాలు, మనస్సు తీసుకు వెళతాడని, మనం చేసే కర్మల ఫలితం ఇంద్రియాలకు, మనస్సుకు అంటుకుని ఉంటుందని ... ఈ కర్మలే జీవుల ఉత్తమ, అధమ జన్మలను నిర్ణయిస్తాయని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే మంచి పనులు, మంచి ఆలోచనలు చేయాలనీ, స్వార్ధ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, మతాలకు అతీతమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ పఠించి, ఆచరించాలని పిలుపునిచ్చారు.

'న హి కల్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి' అని గీతాచార్యుడు చెప్పినట్టు - లోకం చేసే మంచిపని ఎన్నటికీ దుర్గతిపాలు కాదు. అది తరంగాలలాగా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ప్రపంచం లోని తెలుగు వారిని ఆధ్యాత్మిక ఆనంద పారవస్యులను చేస్తోంది. అనేక మంచి పనులకు స్ఫూర్తినిస్తోంది. ఈ విషయమై ప్రపంచం నలు మూలలనుంచి నిత్యం హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయానికి(9030756555)ఫోన్ల ద్వారా అభినందనలు అందుతూంటాయి. తాజాగా చెన్నై లోని శ్రీమతి అల్లాడి రోహిణి(82)-తన సోదరుడు బహూకరించిన - గంగాధర శాస్త్రి భగవద్గీత ను వినడం ప్రారంభించారు. అది తనకు దివ్యానుభూతిని కలిగిస్తోందని, ఆ భగవద్గీతను వినడం తన నిత్యకృత్యమని చెబుతూ స్వయంగా చేతి అల్లికతో 'గీతోపదేశం'చిత్రాన్ని తయారుచేసి తన సోదరుడైన శ్రీ పట్టాభిరామ్ ద్వారా భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయానికి పంపించారు. ఈ చిత్ర పటాన్ని ఆయన శ్రీ గంగాధర శాస్త్రి కి స్వయం గా అందించి సత్కరించారు.

చాలా మందికి తీసుకోవడం లో ఉన్న ఆనందం ఇవ్వడం లో ఉండదు... తెలియదు కూడా.. ఇవ్వడం మొదలు పెడితే నువ్వు శాశ్వతుడివవుతావు. శ్రీ రాముడి లాగా.. కర్ణుడి లాగా.. శిబి చక్రవర్తి లాగా..!!! పరోపకారాయ ఫలంతి వృక్షా : I పరోపకారాయ వహంతి నద్యః I పరోపకారాయ చరంతి గావః I పరోపకారార్థమిదం శరీరమ్ II అంటాడు భర్తృహరి ... వృక్షాలు, నదులు, గోవులు .. అన్నీ లోకం కోసమే జీవిస్తున్నాయి. మనిషి మాత్రమే స్వార్థం తో తనకోసమే జీవిస్తున్నాడు.. ఇతరుల కోసమే ఈ జీవితం అనే సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోవాలి. నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి I అని గీత లో పరమాత్ముడు చెప్పినట్టు- లోకం కోసం మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. శాశ్వతుడు అవుతాడు. ఎవడు తనకోసం ఆలోచిస్తాడో - తాను ఉన్నంత వరకే ఉంటాడు. ఎవడు లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం చిరంజీవి గా ఉండిపోతాడు. ఈ ఆలోచనా విధానమే ఒక వ్యక్తిని చిరంజీవిని చేసింది.. ఆయన పేరు శ్రీ వేగిరాజు శివ వర్మ . పుట్టింది పశ్చిమ గోదావరి ప్రాతళ్ల మెరక గ్రామం. అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని ఆ గ్రామాన్ని - 25 సంవత్సరాల కాల వ్యవధి పెట్టుకుని తన ఆస్తిని, ఆదాయాన్ని, చివరకు తన యావజ్జీవితాన్ని అంకితం చేసి ఈ దేశం లోనే ఆదర్శ గ్రామం గా, గుడిసెలు లేని, సమస్యలు లేని గ్రామం గా తీర్చి దిద్దాడు. 'పద్మశ్రీ' లకు అతీతమైన ఖ్యాతి గడించాడు. తన సోదరి పేరుమీద 'విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్' ను స్థాపించి శ్రీ శివవర్మ తన ఊరి ఋణం తీర్చుకున్న ఈ నేపధ్యం లో... అత్యంత వైభవం గా ప్రాతళ్ల మెరక లో జరిగిన రజతోత్సవ వేడుకలకు గౌరవ అతిథి గా, కార్యక్రమ సంధాన కర్త గా - భగవద్గీత ను ప్రచారం చేయడానికే తన జీవితాన్ని అంకితం చేసిన గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యస్థాపకులు అయిన శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించారు. భగవద్గీతను ఆచరించి చూపించిన శ్రీ శివ వర్మ లోకానికి ఆదర్శమని, తనవల్ల తన వల్ల ప్రయోజనం పొందిన వారి కళ్ళలో ఆనందం చూసి ఆనందించడమే నిజమైన, శాశ్వతమైన ఆనందమని తెలుసుకున్న నిష్కామ కర్మ యోగి అనీ శివవర్మను- గంగాధర శాస్త్రి ప్రశంసించారు. శ్రీ శివవర్మ - ఈ కార్య క్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత సి డి ప్యాక్ ను బహుమతి గా అందించి సత్కరించారు.

ఈయన పేరు చెముడుపాటి శివరామ శాస్త్రి. హైదరాబాద్ లోని మల్కాజిగిరి లో నివాసం ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ సంస్థ కు అధిపతి గా ఉన్నారు. తన తల్లితండ్రులైన రామనాథం, సావిత్రి గార్ల పేర్లతో ఒక సేవా సంస్థ ను స్థాపించి ఏటా ఉత్తమ కళాకారులను సత్కరిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని, ఆయన ఫౌండేషన్ కార్యాలయం లోనే సత్కరించి, ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. భగవద్గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు.

అనంతపురం జిల్లా లోని ధర్మవరం లో కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ - పద్మశ్రీ ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించింది. 16.2.2020 న జరిగిన ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి విశిష్ట అతిధి గా హాజరై ఘంటసాల పాటలలో ఉన్న జీవన విలువలను వివరిస్తూ గాన ప్రసంగం చేశారు. ఘనాఘన సుందరా, అహో ఆంధ్ర భోజ, వినరా వినరా నరుడా, ఆలయన వెలసిన, కలకానిది, బాబూ వినరా, గాంధీపుట్టిన దేశమా వంటి గీతాలను గానం చేస్తూ మధ్య మధ్య భగవద్గీతా రహస్యాన్ని వివరించారు. ఘంటసాల భగవద్గీతా గానం తో తన జన్మని చరితార్థం చేసుకుని తెలుగువారికి ఆరాధ్యుడయ్యారనీ, ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా భగవద్గీతను సంపూర్ణం గా గానం చేసి గురుదక్షిణ చెల్లిoచుకున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. అయన పాటలు పాడడం ద్వారా తనకు ప్రపంచ వ్యాప్తం గా గాయకుడి గా విశేషమైన గుర్తింపూ, గౌరవం వచ్చిందనీ ఆ కృతజ్ఞతతోనే తాను కట్టుకున్న ఇంటికి "ఘంటసాల స్వర సౌధం" అని పేరు పెట్టుకున్నానని అన్నారు. ప్రజలు తమ విధులను నిర్వర్తించడానికి బయటికి వెళ్లే ముందు ప్రతిరోజూ తాను పాడిన భగవద్గీతను వినడం ద్వారా ధర్మ మార్గం లో ప్రయాణం చేయవచ్చని - ఘంటసాల చెబుతూ ఉండేవారని, అటువంటిది ఆయన పాడిన భగవద్గీతను వ్యక్తుల మరణాలకు సంకేతం గా ఉపయోగించడం బాధాకరమని అన్నారు. ఘంటసాల పాటల్లో భక్తి , సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, సంస్కృత, ఆంధ్ర భాషల మాధుర్యం, శాంతి ఉన్నాయని అన్నారు. ధర్మవరం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ జి ఆర్ మధుసూదన్, శ్రీ పి వెంకటనారాయణ , శ్రీ బి నాగరాజారావు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు.

ఈ నెల 7వ తేదీన దుబాయ్ లోని - అల్ జుర్ఫ్, అజ్మాన్ లోని ఇండియన్ అసోసియేషన్ హాల్ లో 'శ్రీనివాస కళ్యాణం' అత్యంత వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమం లో భాగం గా - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారి చే గీతా గాన ప్రవచనం జరిగింది. గత దశాబ్ద కాలం గా 'భగవద్గీతా ఫౌండేషన్' కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా వీక్షించిన వందలాదిమంది అభిమానులు గంగాధర శాస్త్రి ప్రవచనానికి తరలివచ్చారు. భగవద్గీత గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సెల్ఫీ లు తీసుకున్నారు. గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ఆడియో సిడి లను పొందారు. ప్రపంచం లో మిగతా మత గ్రంథాలు మానవుల చేత రచించబడినవనీ, భగవద్గీత - సాక్షాత్తూ పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడి ప్రపంచ మానవాళికి అందిన మహోత్కృష్టమైన దివ్య సందేశమని, దీనిని ప్రతి ఒక్కరూ విని, ఆచరించి, ప్రచారం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని స్థాపించవచ్చని, మానసిక వత్తిడి లేని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీ గంగాధర శాస్త్రి చెప్పారు. ఫిబ్రవరి 8,9,10 తేదీలలో దుబాయ్ పరిసరాల లోని అబు ధాబి, రాస్ ఆల్ ఖైమా, షార్జా ల లో కూడా శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం తో నిత్య జీవన మార్గం లో భగవద్గీత ఆవశ్యకతను తెలియజేశారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పీ మురళీధర రావు - రాజకీయాలకు అతీతం గా , రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే అనే నినాదం తో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని తరువాత తరాల వారికి వారసత్వ సంపదగా అందించాలనే ధ్యేయం తో 'తెలుగు సంగమం'అనే సంస్థని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఈ నెల 19 న 'సంక్రాంతి సమ్మేళనం' కార్యక్రమాన్ని అత్యంత వైభవం గా నిర్వహించారు. తెలుగు జాతి సమైక్య గీతి ని విశేషం గా కాపాడుకున్న ఈ కార్యక్రమం లో పలువురు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళా, సేవా రంగాయాలకు చెందిన ప్రముఖులు వందలాదిగా తరలి వచ్చారు. శ్రీ పి మురళీధర రావు స్వాగత వచనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ విశేషమైన కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతాఫౌండషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి సమన్వయకర్త గా, వ్యాఖ్యాతగా, గాయకుడు గా వ్యవహరించి కార్యక్రమాన్ని రంజింపచేశారు. ఆయన గానానికి తాను పరవశించానని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ ప్రశంసించి గంగాధర శాస్త్రి ని సత్కరించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ మరో విశిష్ట అతిథి గా విచ్చేసారు. ఈ కార్యక్రమం లో ప్రసిద్ధ సినీనటులు శ్రీ కృష్ణం రాజుని, గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ని తెలుగుసంగమం వేదిక ఘనం గా సత్కరించింది.

భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను విస్తృతం గా ప్రచారం చేయడం కోసం స్థాపించిన ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీతా ఫౌండేషన్. ప్రతి ఏటా ఘనం గా నిర్వహిస్తున్నట్టే ఈ సారి కూడా భగవద్గీతా ఫౌండేషన్ - గీత జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధ టి వి చానెల్స్ TV 5, హిందూ ధర్మం ప్రత్యక్ష ప్రసారం చేయగా - ప్రపంచవ్యాప్తం గా లక్షలాదిమంది గీతా బంధువులు వీక్షించి ఆనందాన్నీ, స్ఫూర్తినీ పొందారు. డిసెంబర్ 8 వ తేదీ, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ముందుగా వత్స తో కూడిన గోవు కు పూజ చేసి, అటుపై గీతా రథం పై శ్రీకృష్ణుడు, అర్జునుడు సుప్రతిష్టులై ఉండగా, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి జెండా ఊపి గీతా రథ యాత్ర ను ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులు,యువకులు- జై శ్రీ కృష్ణ, కృష్ణం వందే జగద్గురుమ్, జై భగవద్గీతా నినాదాలతో రథ యాత్రలో పాల్గొన్నారు. అటుపై గీతా జయంతి వేడుకల సభ టివీ 5 స్టూడియో సెట్ లో ప్రారంభమయ్యింది. తొలుత శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి జ్యోతి ప్రకాశనం గావించారు. అటుపై ఘనా ఘన సుందరా అంటూ కృష్ణప్రార్థన చేసి - దశాబ్ద కాలం లో, గీతా ప్రచారం లో 'భగవద్గీతా ఫౌండేషన్' సాధించిన ప్రగతి నివేదికను సమర్పిస్తూ, భగవద్గీత గొప్పతనం గురించి స్ఫూర్తి దాయకం గా తన గాన ప్రసంగం ద్వారా వివరించారు. ప్రతి తల్లి తన బిడ్డలకు బాల్యదశ నుండే భగవద్గీత నేర్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు భగవద్గీత ను పాఠ్యాంశంగా చేర్చాలనీ, కేంద్ర ప్రభుత్వం భగవద్గీత ను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని గంగాధర శాస్త్రి కోరారు. అంతే కాక - భగవద్గీత మతాలకు, దేశ, కాల, జాత్యాదులకు అతీతమైన జ్ఞాన బోధ కాబట్టి భగవద్గీత బోధించిన దినాన్ని "international wisdom day" గా ప్రకటించాలని సూచించారు. భగవద్గీత పట్ల సాధారణ ప్రజలలో వీలైనంత అవగాహన కలిగించే ప్రయత్నం చేశామనీ, వ్యక్తుల మరణ ప్రదేశాలలోనూ, శవ యాత్ర వాహనాలలోనూ భగవద్గీతను ప్రదర్శించడాన్ని సాధ్యమైనంతగా అరికట్టగలిగామనీ గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న గీతా ప్రచారాన్ని యూట్యూబ్ ద్వారా ఇప్పటివరకూ 20 లక్షలమందికి పైగా ప్రేక్షకులు వీక్షించారనీ... పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో గీత ద్వారా వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలతో విద్యార్థులకు స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ కలిగించామనీ, ప్రపంచ వ్యాప్తం గా అనేక దేవాలయాలలోనూ, ఇంకా ఇతర సందర్భాలలో భగవద్గీతను ప్రచారం చేయగలిగామని గంగాధర శాస్త్రి వివరించారు. ఒక దశాబ్దం పాటు పరిశోధనాత్మక కృషి చేసి తాము రూపొందించిన సంగీతభరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతకు ప్రపంచ వ్యాప్తం గా విశేషమైన ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రస్తుతం భగవద్గీతను ఆంగ్ల తాత్పర్యంతో రూపొందిస్తున్నామని, త్వరలో దీనిని అమెరికా అధ్యక్షుడి చేతులమీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇంకా హిందీ, గుజరాతి, కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో భగవద్గీతను వెలువరించేందుకు 'భగవద్గీతా ఫౌండేషన్' యోచన చేస్తోందని, సర్వజన హితం గా గీతను బోధించిన గీతాచార్యుడికి 'గుడి' ని, ఆయన బోధించిన భగవద్గీతకు 'బడి' ని 18 ఎకరాలలో నిర్మించాలని, తద్వారా గీతా ప్రచారాన్ని విస్తృతం చేయడం కోసం భగవద్గీతా ఫౌండేషన్ సంకల్పించిందనీ గంగాధర శాస్త్రి అన్నారు. 'గీతాజయంతి' సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ - 'గీతాచార్య' పురస్కారాన్ని రిటైర్డ్ డీజీపీ శ్రీ కరణం అరవింద రావు కు, 'పార్థ' పురస్కారాన్ని చిII వలివేరు సాయి శ్రీకర్ కు అందించింది. ఈ సందర్భం గా విశిష్ట అతిధులు గా విచ్చేసి, గీతా సందేశం అందించిన శ్రీ వి వి లక్ష్మీనారాయణ-జనసేన నాయకులు, శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం IAS, శ్రీమతి 'భారతీయం' సత్యవాణి, టీవీ 5 చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు లను ఫౌండేషన్ సత్కరించింది. శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి గీతాచార్యుడికి మహా హారతి ఇచ్చి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమాన్ని భావగంభీరమైన వ్యాఖ్యానం తో ధీ శ్రీనివాస్ నిర్వహించారు. 'బాహుబలి' చిత్రం ఫేమ్ శ్రీమతి ఆశ్రిత వేముగంటి శ్రీకృష్ణుడిని స్వాగతిస్తూ చేసిన నృత్యం అలరించింది. ఈ కార్యక్రమానికి శ్రీ ఘంటా అజాద్ బాబు సమన్వయ కర్త గా వ్యవహరించారు. శ్రీ సరస్వతి చలపతి రాజు, శ్రీ సతీష్ లు పర్యవేక్షించారు. అనంతరం గీతా ఫల శృతి ( యత్ర యోగేశ్వరః కృష్ణో 18-78) శ్లోకం తో, శాంతి మంత్రాలతో గీతా జయతి వేడుకలను మంగళప్రదం గా ముగించారు.ఈ రోజు (26-6-2019) తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రివర్యులు శ్రీ ఏ. ఇంద్రకరణ్ రెడ్డి - హైదరాబాద్ లోని 'భగవద్గీతా ఫౌండేషన్' కార్యాలయాన్ని సందర్శించారు. ఫౌండేషన్సభ్యులు మంత్రి కి పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అటుపై ఆయన ఫౌండేషన్ కార్యాలయం లోని శ్రీకృష్ణుడి కి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీతా ఫౌండషన్ చేసిన, చేస్తున్న కార్యక్రమాల సమాహారం గా రూపొందించిన లఘు చిత్రాన్ని ఇంద్రకరణ్ రెడ్డి కి చూపించారు. ఈ సందర్భం గా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి - ఇంద్రకరణ్ రెడ్డి ని తులసిమాల తో, దుశ్శాలువతో, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత తో సత్కరించారు. అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ నిర్మించ సంకల్పించిన "గీతా సంస్థాన్" కి సంబంధించిన వివరాలను ఇంద్రకరణ్ రెడ్డి కి వివరించగా - ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ కి ప్రభుత్వ సహకారం ఉంటుందని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి గీతా మూర్తి, శ్రీయుతులు బి కె శర్మ , బి ఎస్ శర్మ, గిరిధరన్, చలపతి రాజు, ఎం రఘు, ఎల్ వేణుగోపాల్ ,లింగమూర్తి, వెంకట రమణ, దంటు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ప్రసిద్ధ గాయకులు గంగాధర శాస్త్రి గానం చేసిన సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత - భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సువర్ణ హస్తాల లోకి బహుమతి గా చేరింది. ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు హాజరైన శ్రీ నరేంద్ర మోడీ ని బి జె పి నాయకులు అంత క్రితం బేగంపేట విమానాశ్రయం లో ఘన స్వాగతం పలికారు. బి జె పి నాయకురాలు, భగవద్గీతా ఫౌండేషన్ సభ్యురాలు అయిన శ్రీమతి గీతా మూర్తి - ఫౌండేషన్ తరపున గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీత ప్యాక్ ను శ్రీ మోడీ కి బహుమతి గా ఇచ్చి స్వాగతం పలికారు. ఇది దశాబ్ద కాలం కృషితో రూపొంది, అటుపై భారత రత్న డాII అబ్దుల్ కలాం ప్రశంసలు పొంది, తెలుగు జాతి కి అంకితం చేయబడ్డ విశిష్ట ప్రయత్నమని, గీతా మూర్తి మోడీ కి వివరించగా-మోదీ అభినందిస్తూ ఈ గీతను తాను తప్పక వింటానన్నారు. ఈ ప్రయత్నం జరుగుతున్న సమయం లో మోదీ - భగవద్గీతా ఫౌండేషన్ ను అభినందిస్తూ రాసిన లేఖని ఈ సందర్భం గా ఆమె ప్రస్తావించారు.

Bhagavadgita Foundation soulfully congratulates India's 14th President Sri. Ramnath Kovind.

Packs Available


Bhagavadgita Promo